శాంటియాగో : చిలీ కమ్యూనిస్ట్ పార్టీ అధ్యక్షులు గుల్లెర్మో టెల్లియర్ (79) కన్నుమూశారు. గత కొన్ని సంవత్సరాలుగా కరోనా సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చిలీలోని క్లినికల్ హాస్పిటల్ ఆఫ్ ది యూనివర్శిటీలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మరణించినట్లు చిలీ కమ్యూనిస్ట్ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. ''పాపులర్ యూనిటీకి మద్దతునిచ్చిన సాల్వడార్ అలండే మద్దతుదారుడు. నియంతృత్వానికి, ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన సైనికుడు. వామపక్ష శక్తుల ఏకీకరణ వ్యూహకర్త '' అని చిలీ కమ్యూనిస్ట్ పార్టీ పేర్కొంది.
గుల్లెర్మో టెల్లియర్ మృతికి చిలీ అధ్యక్షుడు గాబ్రియేల్ బోరిక్ సంతాపం ప్రకటించారు. వివిధ తరాలను పార్టీకి అనుగుణంగా నడిపించడంలో కీలక పాత్ర పోషించిన కమ్యూనిస్ట్ పార్టీ చారిత్రాత్మక నేత అని వ్యాఖ్యానించారు. '' దేశం పట్ల ప్రదర్శించిన అంకిత భావానికి, న్యాయమైన సమాజాన్ని నిర్మించడానికి అతని అవిశ్రాంత ప్రయత్నాలకు నివాళిగా ఆయన గౌరవార్థం జాతీయ సంతాపదినంగా ప్రకటించాలని నిర్ణయించాము' అని అన్నారు. నిబద్ధత కలిగిన కమ్యూనిస్ట్ అయిన టెల్లియర్ 1988లో పిసి సెంట్రల్ కమిటీలో భాగమయ్యారు. మార్చి 2005 నుండి పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు.