
పసితనంలో వివక్షకు గురైన పిల్లలు తీవ్ర ఒత్తిడి, అభద్రత, ఆగ్రహం, ఆత్మన్యూనతాభావానికి లోనవుతారు. లేదా తామిక్కడ ఉండటానికి తగినవాళ్లం కాదన్న ఒంటరి భావానికి గురికావొచ్చు. తమిళనాడు తెన్‌కాశి వీరకేరళంపూదుర్ ప్రభుత్వ పాఠశాలలో ఒకప్పుడు ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. ఈ ప్రాంతంలో నివసించే ప్రజల్లో ఎక్కువమంది కార్మికులు, పేదలు. వారి పిల్లల్లో కొంతమంది కళ్ళు నక్షత్రాన్ని (లోపల గుడ్డుభాగంలో కనిపించేలా) పోలినట్లుగా ఉండటం వారికి శాపంగా మారింది. ఇలాంటి వారిని పాఠశాలలో మిగతా పిల్లలు వేరుగా చూడటం ఆనవాయితీగా మారింది. దీనిని ఆ పాఠశాల ఉపాధ్యాయురాలు మాలతి ఎస్.చక్కదిద్దారు.
మాలతి ఆ స్కూల్లో టీచరుగా చేరేనాటికి ఒక రకమైన వాతావరణం ఉంది. కళ్లు సరిగ్గా లేని పిల్లలను మిగతావారు దూరం పెట్టేవారు. వెక్కిరించేవారు. ఇది వివక్షకు గురయ్యే పిల్లల్లో ఆత్మన్యూనతకు దారి తీసేది. పిల్లల్లో అందం, అందహీనత భావం వలదనీ, దీన్ని వదలించాలని మాలతి నడుం కట్టారు. విద్యార్థులు మెరుగ్గా నేర్చుకునేందుకు అనువైన వాతావరణంగా పాఠశాలల అంతటా ఉండాలని భావించారు. ఆమె కూడా ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని. తన కుమార్తె ఉపాధ్యాయురాలిగా మారి సమాజానికి సేవ చేయాలనేది ఆమె తల్లి కోరిక. 2008లో ఆమె సైన్స్ టీచరుగా ఉపాధ్యాయ బాధ్యతల్లోకి వచ్చారు. ప్రారంభ సంవత్సరాల్లో అక్కడి విద్యార్థులకు పాఠాలు అర్థమయ్యేవి కావు. విద్యార్థులను ప్రోత్సహించటానికిగాను సమాధానాలు చెప్పిన వారికి బహుమతులు ఇవ్వటం వంటివి చేసేవారు. పిల్లలకు తరగతి గదిలో బోధన ఒక్కటే సరిపోదని భావించారు. పిల్లల కోసం రోబోటిక్స్, కోడింగ్, బొమ్మల తయారీ, తోలుబొమ్మలాట వంటి కళలను ఆమె యూట్యూబ్‌లో చేర్చుకున్నారు. ఆన్‌లైన్ కోర్సులను అభ్యసించడం ద్వారా తన భాష, కళానైపుణ్యాలను పెంపొందించుకున్నారు.
తరువాత ఆమె బోధనకు ఎంచుకున్న మార్గం 'విల్లుపాట్టు'. పాటలు పాడటం, నృత్యం చేయటం ద్వారా పిల్లలకు చదువు చెప్పటమే విల్లుపాట్టు. అది పిల్లలను ఎంతగానో ఆకట్టుకొంది. మాలతి మరుసటిరోజు చెప్పాల్సిన పాఠాలపై ప్రతిరోజూ రాత్రి రెండు గంటల పాటు సన్నద్ధమవుతారు. బోధనోపకరణాలను సిద్ధం చేసుకుంటారు. సైన్స్ పాఠాలను వివరించటానికి 'విల్లుపాట్టు' పాటలను ఉపయోగిస్తాను. ఫిజిక్స్ ప్రయోగాలను నేర్పటానికి తోలుబొమ్మలాట కళను ఉపయోగిస్తారు. తరచుగా చిన్న చిన్న ప్రాజెక్టులను పిల్లలకు ఇచ్చి చేయిస్తారు. గృహోపకరాణాల తయారీ వంటి వాటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. పగిలిన అద్దాల నుండి కాలిడోస్కోప్, మెకానిజం వంటివి కూడా నేర్పిస్తారు.
అంతరాలపై 'విల్లుపాట్టు'
తల్లిదండ్రుల కష్టించే తత్వం, పని ప్రదేశాల్లో వారు చేసే శ్రమ పద్ధతులు, సరైన కూలీ డబ్బులు అందకపోవటం, అప్పులు చేస్తుండటం, పేదరికం వల్ల కలిగే సమస్యలు ... ఇలా అనేక అంశాలపై ఆమె పాటల రూపంలో పిల్లలకు వివరిస్తారు. అవి తమ గురించే అని పిల్లలు భావిస్తారు. ఆ విధంగా రోజూ ఎక్కువ మంది పిల్లలు బడికి వచ్చేలా ఆమె ప్రోత్సహించారు. పాఠాన్ని పాఠంగా వివరించటం కాక అది వారి హృదయానికి హత్తుకునేలా చెప్పాలనేది ఆమె తపన. కథలు, పాటలు, ఇతర బోధనేపకరణాలు, డిజిటల్ టూల్స్ ద్వారా పిల్లలకు వివరిస్తున్నారు. సెల్‌ఫోన్, కంప్యూటర్ వంటి మాధ్యమాలను కూడా ఉపయోగిస్తుండటంతో పిల్లల్లో ఏదో తెలుసుకోవాలని జిజ్ఞాస ఉద్భవించింది. రోజులు, నెలలు, ఏళ్లు గడిచాయి. పిల్లలు తమకు తెలియని అంశాల గురించి అడగటం, కృత్యాధార అంశాల్లో ఉత్సాహం పాల్గొనటం పిల్లల నుంచి మొదలైంది. ఈ క్రమంలో పిల్లల మధ్య అంతరాలను, వివక్షను ఆమె తొలగించారు. అందరూ కలసి మెలసి చదవడం, పాడటం, వివిధ ప్రయోగాలు చేయడం ద్వారా ఐక్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో పిల్లల్లో వచ్చిన మార్పును చూసి తల్లిదండ్రులు చాలా సంతోషించారు. పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులను, ప్రత్యేకంగా మాలతి టీచర్ కృషిని అభినందించటం మొదలెట్టారు.
కోవిడ్ కాలంలో ఆన్‌లైన్ తరగతులు
కోవిడ్-19 కాలంలో మాలతి డిజిటల్ విద్యాబోధనను సమర్ధవంతంగా నిర్వహించారు. వాస్తవానికి కరోనాకు ముందే ఆమె డిజిటల్ బోధనకు శ్రీకారం చుట్టారు. కోవిడ్ టైంలో అది బాగా ఉపయోగపడింది. ఆమె మారథాన్ ఆన్‌లైన్ టీచింగ్ తరగతులను నిర్వహించారు. వరుసగా 26 గంటల పాటు తరగతులు నిర్వహించటంలోనూ ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు.
ప్రత్యేక తరగతులతో ...
ప్రస్తుతం మాలతి టీచరు సైకాలజీలో ఎంఎస్‌సి చేస్తున్నారు. ఆమె తోటి ఉపాధ్యాయులకు సైతం విద్యాబోధనలో సరికొత్త మెలకువలను నేర్పుతున్నారు. నేటికీ ఆమె ప్రతిరోజూ సాయంత్రం 7 నుండి 8 గంటల వరకు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తున్నారు. ఈ తరగతులకు రాష్ట్ర్రవ్యాప్తంగా ఇతర పాఠశాలల విద్యార్థులూ హాజరవుతున్నారు. సెలవులు, ప్రత్యేక దినోత్సవాలు, పండుగల సందర్భంగా కూడా ఆమె ప్రత్యేక తరగతులు కొనసాగుతాయి. ఆమె సేవలను గుర్తించిన కేంద్రప్రభుత్వం ఈ ఏడాది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందజేసింది.