Sep 15,2023 10:52

వర్షాకాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందే రోగాల్లో డెంగీ జ్వరం ఒకటి. ఇది నూటికి 99 శాతం మందికి పెద్దగా ఇబ్బంది పెట్టకుండానే తగ్గిపోతుందనీ, మరికొందరికైతే అసలు వచ్చినా తెలియకుండానే తగ్గిపోతుందని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. ఒక్క శాతం మందిలోనే తీవ్రంగా పరిణమిస్తుంది. దోమ కుట్టాక 3-14 రోజుల్లో ఎప్పుడైనా డెంగీ ఇన్‌ఫెక్షన్‌ రావొచ్చు. ప్లేట్‌లెట్లు తగ్గటం, రక్తం చిక్కపడటం, రక్తస్రావం వంటి సమస్యలకు దారితీస్తుంది. సకాలంలో, సరైన చికిత్స తీసుకుంటే సమస్య నుంచి బయటపడొచ్చు. దోమలు కుట్టకుండా చూసుకుంటే అసలు డెంగీ బారినపడకుండానే కాపాడుకోవచ్చు.
 

                                                                    ఎలా వ్యాప్తి చెందుతుందంటే...

'ఎడిస్‌ ఈజిప్టి' దోమ కుట్టడం ద్వారానే డెంగీ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. నిల్వ ఉన్న నీటిలోనే ఎడిస్‌ దోమలు గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేస్తాయి. నీరు నిల్వ ఉన్న చోట ఈ దోమలు ఎక్కువగా పెరుగుతాయి. అందుకే ఇంటి పరిసరాలు, చుట్టు పక్కల నీరు నిల్వ ఉండే వాటిని గుర్తించి తొలగించాలి. పూలకుండీలు, బక్కెట్లు, పాత వస్తువులు, పక్కన పడేసి టైర్లు, వినియోగించని ఎయిర్‌ కూలర్లు ఇలాంటి ఏవైనా ఉంటే వాటిలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి. దోమలు కుట్టకుండా నివారించేందుకు చర్మానికి రాసుకునేందుకు రిపెలెంట్స్‌ (క్రీమ్స్‌, స్ప్రేలు) అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ రిపెలెంట్లను పిల్లల కళ్లు, నోరు, అరచేతులకు రాయకూడదు. వాటికి తగలకుండా చూసుకోవాలి.

112

                                                                       నాలుగు రకాల వైరస్‌లు

డెంగ్యూ వైరస్‌లలో నాలుగు రకాలున్నాయి. ఒక రకం వైరస్‌తో ఒకసారే డెంగ్యూ వస్తుంది. అయితే ఇతర రకాల వైరస్‌లతో రావొచ్చు. అంటే ఒకరికి జీవితంలో గరిష్టంగా నాలుగుసార్లు డెంగీ వచ్చే అవకాశముంటుందని అనుకోవచ్చు. రెండోసారి, మూడోసారి మరో రకం వైరస్‌తో జ్వరం వస్తే మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. డెంగ్యూ జ్వరంలో అందరికీ ప్లేట్‌లెట్లు ఎక్కించాల్సిన అవసరం లేదు. ప్లేట్‌లెట్ల సంఖ్య లక్ష కన్నా తగ్గినప్పుడు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలి. 50 వేల కన్నా పడిపోతే ఆసుపత్రిలో చేర్చి, నిశితంగా పరిశీలిస్తుండాలి. ప్లేట్‌లెట్లు 20 వేల కన్నా తగ్గి, రక్తస్రావ లక్షణాలు కనిపిస్తుంటే బయటి నుంచి రక్తం ఎక్కించాల్సి వస్తుంది. అదే 10 వేలకు పడిపోతే.. రక్తస్రావం ఉన్నా లేకున్నా ప్లేట్‌లెట్లు ఎక్కించాలి. ఒక మాదిరి డెంగీ జ్వరానికి పారాసిట్మాల్‌ మాత్రలు ఇస్తే సరిపోతుంది. ఓఆర్‌ఎస్‌ తరచూ ద్రావణాన్ని తాగించాలి.
                                                                                                     - యడవల్లి శ్రీనివాసరావు

9

                                                                   పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం

పిల్లల్లో అకస్మాత్తుగా జ్వరం, కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, శరీరంపై దద్దుర్లు ఉంటే వారికి డెంగీ గా భావించొచ్చు. కొన్నిసార్లు పొత్తికడుపు నొప్పి, విరేచనాలు, వికారం లేదా వాంతులు అవుతాయి. పిల్లలకు జ్వరం తగ్గిన తర్వాత మొదటి ఒకటి రెండు రోజుల్లో డెంగీ జ్వరం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు.
 

పిల్లల్లో డెంగీ లక్షణాలు : 
అతి నిద్ర
వాంతులు లేదా నోటి ద్రవాలను స్వీకరించడానికి నిరాకరించడం
పొత్తి కడుపు నొప్పి
ముక్కు, చిగుళ్ల రక్తస్రావం
గత 6 గంటల్లో మూత్రం లేకపోవడం.
చలితోపాటు చెమటలు పట్టడం
చేతులు, కాళ్లు చల్లబడటం
చర్మం మసకబారడం
 

                                                                          అప్రమత్తంగా ఉండాలి

డెంగీ లక్షణాలు ఉంటే సమీపంలోని హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్‌గానీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోగానీ పరీక్ష చేయించుకోవాలి. ఈ పరీక్షలో పాజిటివ్‌ వచ్చినా గానీ దానిని డెంగీ గా నిర్ధారించరాదు. ఆ తరువాత 'ఎలిసా' పరీక్ష చేసిన తర్వాతే నిర్ధారిస్తారు. ఈ టెస్ట్‌ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రులన్నింటిలోనూ చేస్తున్నారు.

డెంగీ ప్రబలకుండా ఉండాలంటే- దోమలను నివారించాలి. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలి. విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లో ఎంఎల్‌హెచ్‌పి, ఎఎన్‌ఎం, ఆశా కార్యకర్త ఉంటారు. జ్వరం వచ్చిన వెంటనే పిహెచ్‌సికి రావాలి. డాక్టరు ద్వారా వైద్య పరీక్షలు చేయించుకుని తగిన మందులను తీసుకోవాలి. గ్రామ పంచాయతీ, మున్సిపల్‌, నగర పాలక సంస్థల సహాయ సహకారాలతో దోమల పిచికారీ మందులను వాడాలి. దోమలు రాకుండా ఇంటి కిటికీలు, తలుపులకు మెష్‌ను వాడాలి. ఎసిలు, పూలకుండీలు, వాడని పాత సామానులో చేరిన వర్షపు నీటిని ఎప్పటికప్పుడు పారపోయాలి. మురుగుగుంతల్లో ఆయిల్‌బాల్స్‌ వేయాలి.
 

                                                          - డాక్టర్‌ ఎం.మౌనిక                                             వైద్యాధికారి, కోడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,                                                                8500676699
                                                          - డాక్టర్‌ ఎం.మౌనిక
                                            వైద్యాధికారి, కోడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,
                                                               8500676699