Oct 29,2023 10:53

రాజమండ్రి : రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు కుడి కంటికి క్యాటరాక్ట్‌ శస్త్ర చికిత్స చేయాలని ప్రభుత్వ ఆసుపత్రి నేత్ర వైద్య నిపుణుడు నిర్ధారించారు. ప్రభుత్వ ఆసుపత్రి సివిల్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌ బి.శ్రీనివాసరావు ఈ నెల 25న చంద్రబాబుని పరీక్షించి, జైలు అధికారులకు నివేదిక ఇచ్చారు. అందులో చంద్రబాబు కుడి కంటిలో ఇమ్మెచ్యూర్‌ క్యాటరాక్ట్‌ ఉందని, దానికి శస్త్రచికిత్స చేయాలని పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్‌లో చంద్రబాబు తన ఎడమ కంటి శుక్లం శస్త్రచికిత్స చేయించుకున్నారు. సెప్టెంబరులోపు కుడి కంటికి కూడా చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించారు. ప్రస్తుతం కుడి కంటి చూపు మందగించిన కారణంగా అత్యవసరంగా శస్త్ర చికిత్స అవసరమని డాక్టర్‌ వివరించారు. జాప్యం చేస్తే చూపు పూర్తిగా మందగించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. దీనిపై హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్‌ కంటి వైద్య నిపుణులు అక్టోబర్‌ 21న ఇచ్చిన నివేదికను కోర్టు ముందు ఉంచారు. వారే చంద్రబాబుకు 2016లో 'యాంగిల్‌ క్లోజర్‌ గ్లకోమా' అనే కంటి సమస్యకు లేజర్‌ చికిత్స, ఈ ఏడాది జూన్‌ 21న ఎడమ కంటికి క్యాటరాక్ట్‌ శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత ఎడమ, కుడి కంటి చూపుల్లో వ్యత్యాసం ఎక్కువగా ఉన్నందున మూడు నెలల్లోగా కుడికంటికీ శస్త్రచికిత్స చేయాలని అప్పుడే తెలిపారు. ఇటీవల ఇచ్చిన నివేదికలోనూ వారు అదే విషయాన్ని మళ్లీ ధ్రువీకరించారు.

మరోవైపు చంద్రబాబు పిటిషన్‌ నేపథ్యంలో ... చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని జిల్లా మెడికల్‌ బోర్డుకు సిఫార్సు చేయాలని సిఐడి కోరే అవకాశాలు ఉన్నాయి. రిమాండ్‌ ఖైదీల అత్యవసర చికిత్సల విషయంలో సాధారణ ఖైదీలకు వర్తించే నిబంధనలే ఎవరికైనా వర్తిస్తాయని చంద్రబాబుకు కూడా మెడికల్‌ బోర్డు సిఫార్సు చేస్తే ప్రభుత్వమే శస్త్ర చికిత్సలు చేయించే అవకాశాలు ఉన్నాయి. సాధారణ ఖైదీలకు భిన్నంగా రిమాండ్‌లో ఉండగా సొంత వైద్యానికి అనుమతించే అవకాశాలు ఉండవని న్యాయవాదులు చెబుతున్నారు. ప్రస్తుతం హైకోర్టుకు సెలవులు కొనసాగుతున్నందున రెగ్యులర్‌ బెంచ్‌ విచారించే వరకు వేచి ఉండాలని కోరే అవకాశాలు లేకపోలేదని న్యాయనిపుణులు చెబుతున్నారు. దీనిపై హైకోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.