Aug 21,2023 11:15

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ (అన్నమయ్య) : మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారానికై ఈ నెల 24వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రవికుమార్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్‌ కమిషనర్‌ జనార్దన్‌ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రవికుమార్‌ మాట్లాడుతూ ... రాష్ట్ర ప్రభుత్వం సి.పి.ఎస్‌ పెన్షన్‌ విధానాన్ని రద్దు చేస్తామని, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేస్తామని, దళారీ వ్యవస్థ రద్దు, ఇంజనీరింగ్‌ కార్మికులకు స్కిల్‌, సెమి స్కిల్డ్‌ వేతనాల అమలు వంటి హామీలు ఇచ్చి నాలుగున్నరేళ్ళు పూర్తవుతున్నా హామీల అమలు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు. పెరుగుతున్న పట్టణాల విస్తీర్ణం, జనాభా దృష్ట్యా కార్మికుల సంఖ్యను పెంచలేదని, తదితర సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్ర ప్రదేశ్‌ మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ రూపాలలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఈ నెల 24న రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజు పనులు నిలుపుదల చేసి చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ కార్మికులు, ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ కార్మికుల జిల్లా అధ్యక్షులు సి.హెచ్‌ ఓబయ్య, ప్రసాద్‌, లక్ష్మీదేవి, ఎం.రమణ, రవిశంకర్‌, మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.