Aug 11,2023 21:35

- కాంట్రాక్టు కార్మికులకు పది రోజుల్లో న్యాయం చేస్తామన్న యాజమాన్యం
ప్రజాశక్తి - ఉక్కునగరం (విశాఖపట్నం) :తమ సమస్యలను పరిష్కరించాలంటూ స్టీల్‌ప్లాంట్‌ కాంట్రాక్టు కార్మికులు శుక్రవారం తలపెట్టిన చలో అడ్మిన్‌ బిల్డింగ్‌ కార్యక్రమం విజయవంతమైంది. వేలాది మంది కార్మికులు ఒక్కసారిగా తరలివచ్చి సమస్యలపై పెద్దపెట్టున నినదిస్తూ స్టీల్‌ అడ్మిన్‌ బిల్డింగ్‌ను ముట్టడించారు. తమ డిమాండ్లను నెరవేర్చేవరకూ కదిలేది లేదని భీష్మించి అక్కడే కూర్చోవడంతో ఉక్కు యాజమాన్యం దిగిరాకతప్పలేదు. స్టీల్‌ప్లాంట్‌ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది కార్మికులు పాల్గోన్నారు. కోక్‌ ఓవెన్‌ విభాగం నుంచి ర్యాలీగా బయలుదేరి అడ్మిన్‌ బిల్డింగ్‌ ముట్టడికి వారంతా ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవాలని చూసినా వారిని తోసుకుంటూ కార్మికులు ముందుకుసాగారు. అనంతరం అడ్మిన్‌ బిల్డింగ్‌ వద్ద భారీ ధర్నా నిర్వహించారు.
ఫలించిన చర్చలు
కార్మికుల ఆందోళన నేపథ్యంలో అఖిలపక్ష కార్మిక సంఘాలకూ, స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యానికీ మధ్య చర్చలు జరిగాయి. స్టీల్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు నిలిపివేసిన రూ.2400లు కాంట్రాక్టర్లు చెల్లించకపోతే యాజమాన్యమే నేరుగా పది రోజుల్లో చెల్లిస్తుందని ఉక్కు అధికారులు హామీ ఇచ్చారు. బోనస్‌, నోటీస్‌ పే, ఇఎస్‌ఐ సౌకర్యాలపై కార్మిక సంఘాలతో మాట్లాడి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యంతో జరిగిన చర్చల్లో కాంట్రాక్ట్‌ కార్మిక సంఘాల ప్రతినిధులుగా స్టీల్‌ప్లాంట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) గౌరవాధ్యక్షులు జె.అయోధ్యరామ్‌, ప్రధాన కార్యదర్శి యు.రామస్వామి, స్టీల్‌ప్లాంట్‌ గుర్తింపు యూనియన్‌ ప్రధాన కార్యదర్శి డి.ఆదినారాయణ, ఇతర సంఘాల నాయకులు జి.శ్రీనివాసరావు, నమ్మి రమణ, మంత్రి రవి, శ్రీనివాస్‌, గణపతిరెడ్డి, నీరుకొండ రామచంద్రరావు పాల్గొన్నారు.