
జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి తమకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంటారు చాలామంది. అలాగే శారీరక, మానసిక వైకల్యాలను అధిగమించి విజయ తీరాలు చేరతారు ఎంతోమంది. అటువంటి వారి గురించి ఎన్నిసార్లు తెలుసుకున్నా ఎంతో స్ఫూర్తినింపుతారు. అలాంటివారే ఈ మహిళలు. శారీరక లోపాలను అధిగమించిన వారు కొందరైతే.. ఆర్థిక కష్టాలకు ఎదురెళ్లి విభిన్న రంగాల్లో తమకంటూ ప్రత్యేకతను నింపుకున్నవారు మరికొందరు.
శరీరంలో ఏ చిన్న లోపం ఉన్నా చాలామంది తెగ కంగారు పడిపోతారు. ఆత్మనూన్యతతో కుదేలైపోతారు. ముఖ్యంగా యువతలో ఈ లక్షణం బాగా ఉంటుంది. కానీ, కేరళలో పుట్టి పెరిగిన షియా రాజన్ అలా కాదు. చిన్నతనం నుండే ఆమె శరీరంలో విలక్షణమైన మార్పు ఒకటి కొట్టొచ్చినట్లు కనిపించేది. యుక్త వయసు వచ్చేసరికి అది మరింత బహిర్గతమైంది. అయినా ఆమె ఏమాత్రం సిగ్గుపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకడుగేస్తున్నారు.
అందం ఆత్మవిశ్వాసానికి కొలమానం కాదు
'నా చిన్నతనం నుండే మూతిమీద చర్మం కాస్త మందంగా ఉండేది. 14, 15 ఏళ్లు వచ్చేసరికి అక్కడ వెంట్రుకలు రావడం మొదలైంది. నేనేమీ కంగారు పడలేదు. ఈ లక్షణం అందరిలోనూ నన్ను ప్రత్యేకంగా నిలిపిందని భావించాను. బాల్యంలో నా స్నేహితులు నన్ను గేలి చేసేవారు. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో నా ఫొటోలు వైరల్ చేస్తూ.. చాలామంది నెగిటివ్ కామెంట్స్ షేర్ చేస్తారు. వాటన్నింటినీ నేను పట్టించుకోను. కొన్ని కామెంట్స్‌ను భద్రపరుచుకుని మళ్లీ మళ్లీ చదువుకుంటూ మనసారా నవ్వుకుంటాను. నాది చాలా చిన్న ప్రపంచం. భర్త, కూతురుతో సంతోషంగా గడుపుతున్నాను. రోడ్డు మీద నడుస్తున్నప్పుడు పెద్దవాళ్లతో పాటు పిల్లలు కూడా నా వంక ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అయినా మీసంతో ఉన్న నేను వీధుల్లో నడిచేందుకు ఎప్పుడూ జంకలేదు. ఇది నా శరీరం.. అందులో వచ్చిన ఈ ప్రత్యేకమైన మార్పు నా జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలి? నా జీవితం నా ఇష్టం.. ఆనందంగా గడపడం నా అభిమతం.. అందం నా ఆత్మవిశ్వాసానికి కొలమానం కాదు' అంటున్నారు షియా.
8 ఏళ్ల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న శ్రేష్ట తివారీ శరీరమంతా అసహజమైన అతుకులతో అతికించినట్లుగా ఉంటుంది. యుక్తవయసుకు వచ్చేసరికి ఆమె చుట్టూ ఎన్నో హేళనచూపులు.. వాటన్నింటినీ ఎదుర్కొంటూ, తనను తాను సంభాళించుకుంటూ ఎంతోమందిలో స్ఫూర్తినింపుతున్నారు ఆమె.
'ఈ వ్యాధితో నన్ను అందరూ దూరం పెట్టేవారు. బ్యూటీపార్లర్‌కి వెళ్లినప్పుడు వ్యాక్స్ తీసేటప్పుడు నా శరీరంపై గాయాలై రక్తం వచ్చేది. దాంతో వాళ్లు చాలా భయపడి.. 'ఇక్కడికి రావద్దు..' అని మొహం మీదే చెప్పేవారు. అప్పుడు.. ఈ మచ్చల నుండి బయటపడాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను. సైడ్ ఎఫెక్ట్‌తో బాధపడ్డాను. ఇదంతా వృధా అనిపించింది. అందుకే సమాజంతో కంటే నాతో నేను పోరాటం చేయడం ప్రారంభించాను. నన్ను నేను అంగీకరిస్తేనే.. ఈ హేళనలు, అవమానాల నుండి బయటపడగలను అని గట్టిగా నిశ్చయించుకున్నాను. ఒంటరి ప్రయాణం చేశాను.
2020లో నా జీవితంలో కొత్త ప్రయాణం మొదలైంది. సోషల్ మీడియాలో నా జీవిత ప్రయాణాన్ని షేర్ చేయడం మొదలుపెట్టాను. మచ్చలతో ఉన్న నా శరీరంతో తీసుకున్న ఫొటోలనే షేర్ చేసేదాన్ని. మొదట్లో చాలామంది ఆ ఫొటోలపై నెగిటివ్ కామెంట్స్ పెట్టేవారు. 2022 నాటికి పరిస్థితి మారిపోయింది. సోరియాసిస్‌తో పాటే ఇతర శారీరక సమస్యలున్న వారు నన్ను అనుసరించడం మొదలుపెట్టారు. వారితో మాట్లాడుతూ ఒకరి అనుభవాలు మరొకరం పంచుకుంటూ ధైర్యంగా ముందుకడుగులేస్తున్నాం. వ్యాధి ఉందని నన్ను నేను దాచుకుంటే ఇంత ఆత్మవిశ్వాసం నాలో కలిగేది కాదు' అంటున్నారు శ్రేష్ట.
భారత్ తొలి మహిళా ఆటో డ్రైవర్‌గా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్న షీలా దావ్రే భారత ప్రభుత్వంచే 'ఫస్ట్ లేడీస్' అవార్డును కూడా అందుకున్నారు. కుటుంబ సమస్యల వల్ల 18 ఏళ్లప్పుడు తల్లిదండ్రుల నుండి బయటికి వచ్చేసి జీవనం ప్రారంభించిన ఆమె జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు.
నా జీవితంలో సంతోషం లేదు, అయినా..
'18 ఏళ్లప్పుడు.. రూ.12లతో బయటికి వచ్చేశాను. పని లేదు. వసతి లేదు. నాకంతా శూన్యంగా కనిపించింది. అయితే అప్పుడే ఆటోడ్రైవర్‌గా జీవించాలనుకుని శిక్షణ తీసుకోవడం ప్రారంభించాను. ఇప్పుడిది చాలా సాధారణమైన విషయమే కానీ అప్పుడు అంటే 1988లో ఊహించడం కూడా కష్టం.. ఆ రోజుల్లోనే ఆటోరిక్షా లైసెన్స్ పొందాను. ఎంతలా కష్టపడ్డాను అంటే.. సగం రొట్టెతో కడుపు నింపుకునేదాన్ని. రేపటి కోసం మరో ముక్కను ఒక జేబులో.. ఇంకో జేబులో ఆత్మరక్షణ కోసం కారం పొడిని పెట్టుకునేదాన్ని. ఆటో డిక్కీలోనే పడుకునేదాన్ని. కుటుంబం నుండి దూరంగా వచ్చేసిన నన్ను ఎందరో ఎగతాళి చేసేవారు. ఆటో నడుపుతున్నానని గేలి చేశారు. 1991 నాటికి నన్ను ఇష్టపడిన వ్యక్తినే పెళ్లి చేసుకున్నాను. ఇద్దరు పిల్లలతో ఆటో నడుపుకుంటూ నవ్వుతున్న వాళ్ల ఎదుటే మేం దర్జాగా బతికేవాళ్లం. మొదట ఆటో రిక్షాలు, బస్సులు అద్దెకు తీసుకుని నడిపేవాళ్లం. ఆ తరువాత సొంతంగా కొనుక్కుని వ్యాపారం చేశాం. బిజినెస్ బాగా ఉందనుకున్న సమయంలో కూడా రోజుకు 14 గంటలు ఆటోరిక్షా నడిపేదాన్ని. అయితే ఇద్దరు బిడ్డలు పుట్టాక ఆరోగ్య సమస్యల వల్ల నేను వ్యాపారం నుండి తప్పుకున్నాను. అప్పటి నుండి నా జీవితం మళ్లీ మొదటికొచ్చింది. వ్యాపారంలో నష్టపోయి బస్సులు, ఆటోలు అమ్ముకోవాల్సి వచ్చింది. పరిస్థితులు చేయిదాటి పోయాయి. ప్రసాదాలు తిని కడుపు నింపుకునేవాళ్లం. ఎటు చూసినా శూన్యం. వివాహేతర సంబంధంతో భర్త నాపై తరచూ చేయి చేసుకునేవాడు. చాలా నిరాశపడిపోయా.. ఇద్దరు ఆడబిడ్డలతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. కానీ చిన్నతనంలోనే ఒంటరిగా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న నేను బిడ్డల కోసం మరోసారి జీవించాలనుకున్నాను. ఆత్మహత్య నిర్ణయాన్ని వెనక్కితీసుకుని మళ్లీ ఆటోడ్రైవరుగా మారాను. టూరిజం విభాగంలో ఆటోడ్రైవరుగా ఉద్యోగం చేస్తూ పిల్లలను చదివించుకుంటున్నాను. భారత తొలి ఆటోడ్రైవర్‌గా లిమ్కా బుక్‌లో స్థానం సంపాదించడం ఒక్కటే నా జీవితంలో ఎదురైన గొప్ప అనుభవం. అయినా నేను ఎక్కడా నిరాశపడలేదు. నా జీవితంలో నేను ఎదుర్కొన్న కష్టాలే నన్ను మరింత ధైర్యంగా నిలబెట్టాయి' అంటున్నారు ఆమె.
షియా, శ్రేష్ట, షీలా లాంటి మహిళలు మన చుట్టూ ఎంతోమంది ఉంటారు. కష్టాలు, కన్నీళ్లు ఎన్ని ఎదురైనా సవాళ్లనే సోపానాలుగా చేసుకుని ముందుకడుగేస్తున్న ఈ వనితలు ఎంతోమందికి గొప్ప స్ఫూర్తిగా నిలుస్తారు.