Jul 27,2023 16:08
  • కేంద్ర కార్మిక సంఘాల ఆగస్టు 9న చలో విజయవాడకు పిలుపు

ప్రజాశక్తి-కాకినాడ : మోడీ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 9న విజయవాడలో మహాధర్నా జయప్రదం చేయాలని కోరుతూ.. కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో టీచర్స్‌ హోంలో సిఐటియు జిల్లా కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్‌, టీఎన్టీయుసి నాయకులు రాజారావు, ఐ.ఎన్‌.టి.యు.సి జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణార్జున, ఐ.ఎఫ్‌.టి.యు నాయకులు మూర్తి అధ్యక్షతన జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్‌, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజకుమార్‌, ఐ.ఎఫ్‌.టి.యు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే.వెంకటేశ్వరరావు, టిఎన్టియుసి జిల్లా అధ్యక్షులు గదుల సాయిబాబు, ఏఐసీసీటియు రాష్ట్ర కన్వీనర్‌ గొడుగు సత్యనారాయణ, ఐఎన్టీయూసీ ఏపీ అండ్‌ తెలంగాణ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తాళ్లూరి రాజులు సంయుక్తంగా మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలపై పన్నుల భారాలు మోపుతూ, కార్మికులను బానిసలుగా మార్చేందుకు 29 చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్‌ కోడ్లు తెచ్చారని, 3 వ్యవసాయ చట్టాల రూపంలో రైతాంగ భూములను కార్పొరేట్లకు అప్పగించేందుకు ప్రయత్నించారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం తీసుకొచ్చే విశాఖ ఉక్కు, ఎల్‌ఐసి, ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటు దోపిడీదారులకు అప్పగించేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారన్నారు. 8 ఏళ్ల కాలంలో ఆరు లక్షల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయని, వీటిలో పనిచేసే లక్షలాదిమంది కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందన్నారు. భారతదేశం మోడీ హయాంలో ఆకలి సూచికలో బంగ్లాదేశ్‌, శ్రీలంక దేశాలకంటే వెనుకపడినట్లు ప్రపంచ గణాంకాలు తెలియజేస్తున్నాయన్నారు. నిరుద్యోగాన్ని, అధిక ధరలను, ఆహార సంక్షోభాన్ని మోడీ ప్రభుత్వం పరిష్కారం చేయలేక, ప్రజల ఐక్యతకు భంగం కలిగించే వివక్షపూరిత సిఏఏ, ఎన్‌ఆర్సి, యుసిసి చట్టాలను బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఇందులో భాగంగానే మణిపూర్‌ రాష్ట్రంలో వందల సంవత్సరాలుగా కలిసున్న మైతే, కుకి ప్రజల మధ్య ఎస్టీ రిజర్వేషన్ల సమస్యను సష్టించి మరణహౌమనికి కారణమయ్యారని తెలిపారు. మోడీ ఏం మాట్లాడాలో, ఎం చేయాలో ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్ణయిస్తుందని, ఆర్‌ఎస్‌ఎస్‌ మతోన్మాద ఎజెండాను అమలు చేయడమే మోడీ కర్తవ్యంగా భావిస్తున్నారని, ఇక్కడ మోడీ మనసులో భారత రాజ్యాంగానికి గాని, ప్రజాస్వామ్యానికి గాని స్థానంలేదని విమర్శించారు. కార్మికులకు మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలన్నీ రాష్ట్రంలో జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేస్తూ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తుందన్నారు. మోడీ విధానాలను రాష్ట్రంలో అమలు చేసే పార్టీలకు ప్రజలు, కార్మికులు, మేధావులు ఓటుద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 9 విజయవాడలో క్విట్‌ ఇండియా స్ఫూర్తితో జరిగే మహా ధర్నాకు వేలాదిమందిగా కార్మికులు ఉద్యోగులు తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి మలకా రమణ, మధ్యాహ్న భోజన పథక కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నర్ల ఈశ్వరి, 108 ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు పెంకే రమణ, ఏఐబిఐ బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకులు ఆదినారాయణ, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు దడాల పద్మ, భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటియుసి నాయకులు అన్నవరం, పెన్షనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.సత్తిరాజు, వీఆర్‌ఏ సంఘం జిల్లా అధ్యక్షులు సురేష్‌ ఇజ్రాయిల్‌, యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు రత్నరాజు, ఏపీ.ఎం.ఎస్‌.ఆర్‌.యు జిల్లా అధ్యక్షులు స్వామి, ఏపీ బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కన్‌ స్ట్రక్షన్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రొంగల ఈశ్వరరావు, ఏఐసీసీటియు నాయకులు నరసరాజు, ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ కాకినాడ నగర కమిటీ అధ్యక్షుడు బొబ్బిలి శ్రీనివాసరావు, మెడికల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ కే.వి రామయ్య, ఏఐటీయూసీ నగర అధ్యక్షులు పప్పు ఆదినారాయణ, సామర్లకోట కార్యదర్శి పెద్దిరెడ్ల సత్యనారాయణ, పిఠాపురం కార్యదర్శి కేశవరపు అప్పలరాజు, గొల్లప్రోలు కార్యదర్శి మీసాల అన్నవరం, తదితరులు పాల్గొని చలో విజయవాడకు మద్దతుగా పాల్గొంటామని తెలిపారు.