Aug 31,2023 06:56

గ్వాటెమాలా సిటీ : గ్వాటెమాలా అధ్యక్ష ఎన్నికల్లో మధ్యేమార్గ వామపక్ష అభ్యర్ధి బెర్నార్డో అరెవాలో విజేతగా నిలిచారని దేశ ఉన్నత ఎన్నికల ట్రిబ్యునల్‌ సోమవారం ప్రకటించింది. అదే రోజు ఆయన రాజకీయ పార్టీ రద్దయింది. జనవరి 14న ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారు. ఆయన పార్టీ సీడ్‌ మూవ్‌మెంట్‌కి చెందిన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయగలుగుతారో లేదో స్పష్టం కాలేదు. మితవాద పార్టీ మద్దతున్న అభ్యర్ధిపై గెలుపొందినప్పటి నుండి అరెవాలో అనేక చట్టపరమైన సవాళ్లను, అవకతవకల ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఎలక్టోరల్‌ రిజిస్ట్రీ తన పార్టీని సస్పెండ్‌ చేయడం చట్టబద్ధంగా చెల్లదని అరెవాలో పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ అప్పీల్‌ చేయనున్నట్లు తెలిపారు. ఈ దశలో తాను అధికారం చేపట్టకుండా ఎవరూ ఆపలేరని ఆయన ఒక పత్రికా సమావేశంలో ప్రకటించారు. గ్వాటెమాలా అటార్నీ జనరల్‌ కార్యాలయం సీడ్‌ మూవ్‌మెంట్‌ పార్టీపై జరిపిన దర్యాప్తు నేపథ్యంలో ఎలక్టోరల్‌ రిజిస్ట్రీ పై రూలింగ్‌ ఇచ్చింది. ఉద్యమాన్ని పార్టీగా ఏర్పాటు చేసేందుకు సంతకాల సేకరణలో అవకతవకలు జరిగాయని వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరిగింది. ఈ నేపథ్యంలో సీడ్‌ పార్టీ సుప్రీంను ఆశ్రయించనుంది.