Oct 04,2023 07:14

             ప్రజలందరికి సంక్షేమం, సామాజిక న్యాయం అందించడం, అభివృద్ధి సాధించడం ప్రభుత్వాల బాధ్యత. ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలంటే వాస్తవ పరిస్థితులపై సంపూర్ణమైన అధీకృత సమాచారం కావాలి. కొన్ని వేల సంవత్సరాలుగా మన దేశంలో నిచ్చెనమెట్ల కులవ్యవస్థలో దిగువ కులాలకూ, ఎగువ కులాలకూ మధ్య తీవ్ర అంతరాలున్నాయి. అవి సమసిపోతే తప్ప అభివృద్ధి అసాధ్యం. కనుక కులగణన ఒక తప్పనిసరి అవసరం. 1931లో బ్రిటీష్‌ పాలనలో చివరిసారి కులగణన నిర్వహించారు. 2011లో అప్పటి యుపిఎ ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, కులగణన పేరిట సమాచారం సేకరించింది. దాని నిర్దిష్టతలపై సందేహాలున్నాయంటూ ఆ వివరాలను అటకెక్కించింది. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కోరుతూ బీహార్‌ రాష్ట్రానికి చెందిన అఖిలపక్షం ప్రధాని మోడీని 2021లో కోరింది. ఆ రాష్ట్ర బిజెపి ప్రతినిధి కూడా ఆ బృందంలో ఉన్నా, కేంద్ర సర్కారు మౌనముద్రలోనే ఉండిపోయింది. అనేక సార్లు చేసిన విజ్ఞప్తులు బుట్టదాఖలు కావడంతో తామే చొరవ చూపాలని బీహార్‌ ప్రభుత్వం నిర్ణయించుకుంది. గత జనవరి, ఏప్రిల్‌లో కులగణనతోపాటు ఆర్థిక స్థితిగతులపై సర్వే నిర్వహించింది. బీహార్‌లో కుల గణనను రద్దు చేయాలని కేంద్రంలోని పెద్దల అండదండలతో పాట్నా హైకోర్టు, సుప్రీంకోర్టులో పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలను పాట్నా హైకోర్టు కొట్టివేయగా, సుప్రీంకోర్టు వాటిని ప్రచురించవచ్చని పేర్కొనడంతో వివరాల వెల్లడికి మార్గం సుగమమైంది.
           గాంధీ జయంతి సందర్భంగా విడుదల చేసిన కుల గణన వివరాలు అనేక వాస్తవాలను సాక్షాత్కరింపజేశాయి. 13.07 కోట్ల బీహార్‌ జనాభాలో 63 శాతానికి పైగా ఇతర వెనుకబడిన తరగతులు (ఒబిసి), అత్యంత వెనుకబడిన తరగతులు (ఇబిసి) ఉన్నారు. ఒబిసిలు మూడున్నర కోట్లు (27.13 శాతం), ఇబిసిలు 4.70 కోట్లు (36.01 శాతం), 2.6 కోట్ల మంది ఎస్‌సిలు (19.65 శాతం), 22 లక్షల మంది ఎస్‌టిలు (1.68 శాతం) ఉన్నారని గణాంకాలు ధ్రువీకరించాయి. జనరల్‌ కేటగిరీలో ఉన్న ఇతర కులాలు 15.5 శాతం అని, హిందువులు 81.99 శాతం, ముస్లిములు 17.7 శాతం, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, ఇతర మతాల వారు ఒక శాతం లోపేనని నివేదిక తెలిపింది. జనాభాకు సంబంధించిన పూరిస్థాయి గణాంకాలు అందుబాట్లో లేకపోవడంతో 1979లో అప్పటి జనతా పార్టీ ప్రభుత్వం నియమించిన మండల్‌ కమిషన్‌ నివేదికే ప్రభుత్వాలకు ఆధారంగా ఉంది. ఆ నివేదిక ఒబిసిలు 52 శాతం ఉంటారని అంచనా వేసింది. ఆ శాతం మరింత ఎక్కువగా ఉంటుందన్న పలువురు సామాజిక అధ్యయనవేత్తల అంచనాలు నిజమని తాజా గణాంకాలు నిర్ధారించాయి.
           సామాజికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా ఎన్నో వ్యత్యాసాలున్నాయని తాజా నివేదికలో తేటతెల్లమైంది. ఇప్పుడు అమలు చేస్తున్న విధానాలను మెరుగుపరిచి, పథకాలలో లోపాలను సరిదిద్ది...సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందరికీ అందించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలది. గణాంకాల ఆధారంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని అక్కడి మహా కూటమి ప్రభుత్వం నడుం బిగిస్తే... వివరాలు సేకరించొద్దని, వెల్లడించొద్దని, కేంద్రం సేకరించాల్సిన వివరాలు రాష్ట్ర ప్రభుత్వం ఎలా సేకరిస్తుందని, వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుతుందని పిటిషనర్లు, కేంద్రం వాదనలు వినిపించడం విడ్డూరం. తమ వద్ద వివరాలు లేవని, సేకరించడం తమ బాధ్యతని బీహార్‌ ప్రభుత్వం చేసిన వాదనలను కోర్టులు సమర్ధించడం ముదావహం. కులాల వారీగా జనాభా లెక్కలుంటేనే చిక్కులు, అపోహలు తొలగుతాయి. తాజా గణాంకాలు రిజర్వేషన్లు 50 శాతం మించరాదన్న నిబంధనలను అత్యున్నత న్యాయస్థానం పున:సమీక్షించేందుకు దారితీయ వచ్చు. వామపక్షాలు, పలు లౌకిక పార్టీలు కుల గణనను స్వాగతిస్తుండగా, బిజెపి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. జనాభా ఆధారంగా అణగారిన వర్గాలకు సంక్షేమంలో, అభివృద్ధిలో భాగస్వామ్యం లభిస్తే... రాజకీయ సమీకరణాలు మారిపోతాయని, కుల, మత వైషమ్యాలను తిప్పికొడతారని అభివృద్ధి నిరో ధకుల భయం. ఇప్పటికైనా జనహితం దృష్ట్యా జనగణనతోపాటు కులగణనను కేంద్రమే చేపట్టాలి. గతంలో కులాల వారీగా జనగణనకు ప్రయత్నించిన తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర సహా పలు ప్రభుత్వాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లోనూ కులగణనకు బీహార్‌ చూపిన మార్గం స్ఫూర్తి కావాలి.