ఈనెల 12న కౌలు రైతుల పాదయాత్రను జయప్రదం చేయండి : కౌలు రైతు సంఘం పిలుపు
నందిగామ (ఎన్‌టిఆర్) : కౌలు రైతుల డిమాండ్ సాధన కోసం ఈనెల 12 న విజయవాడ నుండి ప్రకాశం బ్యారేజీ మీదుగా మంగళగిరి సిసిఎల్‌ఏ కార్యాలయం వద్ద చేపట్టనున్న రాయబార పాదయాత్రను జయప్రదం చేయాలని కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి చనుమోలు సైదులు పిలుపునిచ్చారు.
శనివారం కౌలు రైతుల పాదయాత్రకు సంబంధించిన కరపత్రాలను నందిగామ మండలం కమ్మవారిపాలెం రాఘవాపురం పల్లగిరి గ్రామాలలో పంచారు. ఈ సందర్భంగా చనుమోలు సైదులు మాట్లాడుతూ ... రాష్ట్రంలో 30 లక్షల కుటుంబాలకు పైగా ఉన్న కౌలు రైతులకు 2019 పంట సాగుదారుల చట్టం ప్రకారం గుర్తింపు కార్డు మంజూరుకు భూ యజమాని సంతకం తప్పనిసరి అనే నిబంధనలతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ... చట్టంలో మార్పులు చేసి కౌలు రైతుకు సులభంగా గుర్తింపు కార్డు మంజూరు, భూ యజమాని సంతకం తొలగింపు సాధనే లక్ష్యంగా కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో జూన్ 5 నుండి 10వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రచార జాతాలు, సచివాలయాలు, తహశీల్దార్ కార్యాలయాల వద్ద వినతిపత్రాలు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. పంట ఋణాలు, రాయితీ ఎరువులు విత్తనాలు, పంట నష్టపోతే పరిహారం దక్కక కౌలు రైతులకు అడుగడుగునా కష్టాల సాగు తప్పడం లేదని ఎద్దేవా చేశారు. భూ యజమాని సంతకం తప్పనిసరి అయిన నేపథ్యంలో కౌలు రైతులకు గుర్తింపు కార్డు రావడం లేదని భూ యజమాని సంతకంతో పని లేకుండా గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రాల సిబ్బంది సంయుక్తంగా గ్రామ సభలు నిర్వహించి అసలైన కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, పంట రుణాలు, బీమా, ఈ క్రాప్, రాయితీపై రుణాలు, పంట అమ్ముకునేందుకు ఇబ్బందులు లేకుండా చూడాలని, ప్రకఅతి వైపరీత్యాలతో పంట నష్టం వాటిల్లితే పరిహారం సౌకర్యం కల్పించి కౌలు రైతుల ఆత్మహత్యలు నివారించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డు ప్రధాన అంశమని దీనికి ప్రధాన ఆటంకంగా ఉన్న భూ యజమాని సంతకం తొలగించాలన్న డిమాండ్ సాధన తమ సంఘం లక్ష్యమన్నారు. గ్రామ సభలు ఏర్పాటు చేసి భూ యజమాని కౌలు రైతులతో గ్రామ సభ నిర్వహించి అర్హులైన కౌలు రైతులకు గుర్తింపు కార్డులు రుణాలు, బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ డిమాండ్ సాధన కోసం 12 న విజయవాడ నుండి ప్రకాశం బ్యారేజీ మీదుగా మంగళగిరి సిసిఎల్‌ఏ కార్యాలయంకు వద్ద రాయబార పాదయాత్ర కార్యక్రమంలో కౌలు రైతులు పాల్గని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతులు కటారపు విఠల్రావు, వెంపటి రఘు, పుల్లయ్య, వెంకటరత్నం, లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.










