Aug 02,2023 21:43

ప్రజాశక్తి - అల్లూరి జిల్లా విలేకరుల యంత్రాంగం : మణిపూర్‌లో ఆదివాసీలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో గురువారం తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త మన్యం బంద్‌ను జయప్రదం చేయాలంటూ అల్లూరి సీతారామరాజు జిల్లాలో బుధవారం ప్రచారం ఊపందుకుంది. అరకులోయలో ఆదివాసీ గిరిజన సంఘం, దండకారణ్య విమోచన సమితి ఆధ్వర్యంలో బైకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్‌ మాట్లాడారు. బిజెపి ప్రోద్బలంతోనే మణిపూర్‌ హింసాకాండ పెచ్చుమీరిందన్నారు. బంద్‌ జయప్రదం కోసం పాడేరులో పలుచోట్ల ప్రచారం చేపట్టారు. ఆదివాసీ గిరిజన సంఘం, గిరిజన సమాఖ్య నేతలు పాడేరు ఆర్‌టిసి డిపో మేనేజర్‌ను, బ్యాంక్‌ మేనేజర్లును, విద్యాసంస్థలు, వాణిజ్య సంస్థల నిర్వాహకులను కలిసి బంద్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతగిరిలో సిపిఎం జెడ్‌పిటిసి సభ్యులు దీసరి గంగరావు ఆధ్వర్యాన అనంతగిరి, ములియగుడ, బొర్రా గుహలు, డముకు, శివలింగపురం, కొత్తూరు, చిలకలగెడ్డ ప్రాంతాల్లో ప్రచారం చేపట్టారు. విజయనగరం జిల్లా ఎస్‌ కోట ఆర్‌టిసి డిపో అధికారులను కలిసి బంద్‌కు సహకరించాలని సిపిఎం, ప్రజా సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు.