Aug 25,2023 23:16

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి పశు సంపద అభివృద్ధికి, పాడి రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని, రైతు భరోసా కేంద్రాల ద్వారా పశు సేవల్ని అందిస్తున్నామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం ఆచరణలో పశు సంక్షేమాన్ని పూర్తిస్థాయిలో విస్మరిస్తున్నట్లు కనిపిస్తుంది. కాకినాడ జిల్లాలో 76,502 ఆవులు, 2,82,273 గేదెలు, 1,01,870 గొర్రెలు, 1,41,229 మేకలు ఉన్నాయి. ప్రభుత్వ తీరుతో గతంతో పోల్చుకుంటే జిల్లాలో పాడి పరిశ్రమ గణనీయంగా తగ్గిపోయింది. పాడి పరిశ్రమను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం గతంలో అమలు చేసిన వివిధ పథకాలు ఒక్కొక్కటి తగ్గిస్తూ పోతుండడంతో పశు సంక్షేమం బక్క చిక్కి పోతుంది.
చతికిలపడిన పథకాలు
వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత పాడి పరిశ్రమను నిర్లక్ష్యం చేస్తోందని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో అమలు చేసిన గోకులం పథకాన్ని ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టిందన్నారు. ఈ పథకంలో భాగంగా షెడ్లు నిర్మించుకున్న పలువురు రైతులకు బిల్లులు నిలిపివేసింది. పశునష్టపరిహారంపై నిర్లక్ష్యం వహిస్తోంది. రెండేళ్లుగా ఈ పరిహారం ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రెండేళ్ల కాలంలో వివిధ ప్రమాదాల్లో మృత్యువాత పడిన గేదెలు, మేకలు, గొర్రెలకు నష్టపరిహారంగా ఇంకా రూ.4 కోట్లకు పైగా పరిహారం అందాల్సి ఉందని రైతులు తెలిపారు.
పశుబీమా పథకంలో మార్పులు తీసుకొచ్చేందుకు తాత్కాలికంగా నిలిపివేశామని అధికారులు చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఊరూరా పశుగ్రాసం పథకాన్ని నిలిపివేయడంతో రైతులపై ఆదనవు భారం పడుతోంది. అప్పట్లో ఎకరా కౌలు భూమికి రూ.25 వేలతో పాటు పచ్చగడ్డి పెంచుకోవడానికి, ఎరువులకు మరో రూ.20 వేలు ఇచ్చేవారు. గతంలో కిలో రూ.2 చొప్పున పాతర్ల గడ్డి పంపిణీ చేసేవారు. గతంలో రాయితీపై పాతర్ల గడ్డి పంపిణీ చేసేవారు. ఇప్పుడు అమలు చేయడం లేదు. మరోవైపు రైతు భరోసా కేంద్రాల ద్వారా వైద్య సేవలు నామమాత్రంగానే అందుతున్నాయి.
పూర్తిస్థాయిలో మందులు ఉంచడం లేదు. 108 రకాల మందులు అందుబాటులో ఉండాల్సి ఉండగా 10 నుంచి 15 రకాలు మాత్రమే ఉంటున్నాయి. దీంతో పశు వైద్యం ఆర్‌బికెనల్లో గగనంగా మారింది. ప్రైవేట్‌ పశు వైద్యుల వద్ద చేయించుకుంటుండడం వల్ల పాడి రైతులపై అదనపు భారం పడుతోంది.