Nov 04,2023 10:32

చెన్నై : వివాహం చేసుకున్న మూడు రోజులకే ప్రేమ జంటను యువతి కుటుంబ సభ్యులు అతిదారుణంగా హత్య చేశారు. తమిళనాడులోని తూత్తుకుడిలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. తూత్తుకుడికి చెందిన మారిసెల్వం (24), కార్తీక (20) రెండేళ్లుగా ప్రేమించుకుని అక్టోబర్‌ 31న గుడిలో పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి మురుగేషన్‌ నగర్‌లో ఉంటున్నారు. తమ వివాహం గుర్తింపు కోసం స్థానిక మహిళా పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించారు. మారిసెల్వం ఒక షిప్పింగ్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. గురువారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో దంపతులు ఉంటున్న ఇంట్లోకి రెండు మోటర్‌బైక్‌లపై వచ్చిన ఐదుగురు సభ్యుల ముఠా చొరబడి, దంపతుల్ని దారుణంగా చంపి పరారైంది. మరిసెల్వం వెనుకబడిన కులానికి, కార్తీక అగ్రకులానికి చెందిన వారని స్థానికులు తెలిపారు. కార్తీక బంధువులే ఈ హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు.