
- 2 జిల్లాల్లోనే పంపిణీ
- సర్వర్లు పనిచేయక రేషన్ పంపిణీలో ఇక్కట్లు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : చౌకధరల దుకాణాల ద్వారా పేదలకు సబ్సిడీపై అందించే జాబితాలో కందిపప్పు కనుమరుగైంది. దసరా పండగనాడైనా పేదలు పప్పన్నం తినే పరిస్థితులు ప్రభుత్వ వైఖరితో లేకుండా పోయాయి. కందిపప్పు బయట మార్కెట్‌లో కిలో రూ.180 నుంచి రూ.200 పలుకుతోంది. ఈ నేపథ్యంలో సబ్సిడీపై కందిపప్పును ప్రభుత్వం పంపిణీ చేస్తుందని ఆశపడ్డ రేషన్ కార్డుదారులకు నిరాశే మిగిలింది. కందిపప్పు పంపిణీ కేవలం అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలకు మాత్రమే ప్రభుత్వం పరిమితం చేయడం పట్ల కార్డుదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కందిపప్పుకు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రావడం లేదని ప్రభుత్వం పేర్కొంటోంది. రాష్ట్రంలో సరిపడా కంది పంట సాగు లేకపోవడంతో కార్డుదారులకు ఇవ్వలేకపోతున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి సరఫరా చేసే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం అందుకు సుముఖంగా లేదు. రాష్ట్రవ్యాప్తంగా 1.46 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి. అందరికీ కిలో వంతున పంపిణీ చేయాలంటే 14 వేల టన్నుల కందిపప్పు అవసరమవుతుంది. గత రికార్డులను పరిశీలిస్తే పౌరసరఫరాలశాఖ ఏడు వేల టన్నులు మాత్రమే సరఫరా చేసేది. గత కొంత కాలంగా కందిపప్పునకు ప్రభుత్వం మంగళం పాడింది. దసరాకు అల్లూరి, మన్యం జిల్లాల్లో కార్డుదారులకు సుమారు 300 టన్నులు మాత్రమే పంపిణీ చేసేందుకు పౌరసరఫరాలశాఖ సిద్ధమైంది. ప్రస్తుతం ఈ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం, గోధుమ పిండి, పంచదార సరఫరా చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంటోంది.
వెంటాడుతున్న నెట్‌వర్కు సమస్య
రాష్ట్ర వ్యాప్తంగా ఎండియు వాహనాల ద్వారా పంపిణీ చేసే రేషన్‌కు నెట్‌వర్కు సమస్య వెంటాడుతోంది. నాలుగు రోజులుగా సర్వర్లు పనిచేయకపోవడంతో వేలిముద్రలు పడక, రేషన్ తీసుకోలేక పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెట్‌వర్కు సమస్యను అధిగమించేందుకు పౌరసరఫరాలశాఖ ఐటి విభాగం కృషి చేస్తున్నప్పటికీ 8 జిల్లాల్లో మాత్రమే మంగళవారం నాటికి క్లియర్ చేయగలిగారు. క్లియర్ అయిన జిల్లాల్లో ఎన్‌టిఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు ఉండగా, మిగిలిన జిల్లాల్లో ఆఫ్‌లైన్ ద్వారా సరుకుల పంపిణీ జరుగుతున్నట్లు ఆ శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.