Aug 24,2023 22:08

బెర్న్‌(స్విట్జర్లాండ్‌): భారత రెజ్లింగ్‌ సమాఖ్య(డబ్ల్యుఎఫ్‌ఐ) సభ్యత్వాన్ని యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ సమాఖ్య(యుడబ్ల్యుడబ్ల్యు) రద్దు చేసింది. సకాలంలో ఎన్నికలు నిర్వహించడంలో డబ్ల్యూఎఫ్‌ఐ విఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యుడబ్ల్యుడబ్ల్యు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. యూడబ్ల్యూడబ్ల్యూ తీసుకున్న ఈ నిర్ణయంతో త్వరలో (సెప్టెంబర్‌ 16 నుంచి) ప్రారంభంకానున్న ఒలింపిక్‌ క్వాలిఫైయింగ్‌, వరల్డ్‌ ఛాంపియన్‌ షిప్స్‌ పోటీల్లో భారత అథ్లెట్లుగా తటస్థ అథ్లెట్లుగా (భారత్‌ ట్యాగ్‌లైన్‌ లేకుండా) బరిలోకి దిగాల్సి ఉంటుంది. కాగా, డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై స్టార్‌ మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో డబ్ల్యూఎఫ్‌ఐ వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. బ్రిజ్‌భూషణ్‌ను పదవి నుంచి తప్పించాలని రెజ్లర్లు తారాస్థాయిలో ఆందోళనలకు దిగడంతో ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ డబ్ల్యూఎఫ్‌ఐ ప్యానెల్‌ను రద్దు చేసింది. ఆ తర్వాత డబ్ల్యూఎఫ్‌ఐ నిర్వహణ బాధ్యతను అడ్‌హక్‌ కమిటీకి అప్పగించింది. అయితే అడ్‌హక్‌ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణకు వరుసగా అవాంతరాలు ఎదురవుతూ వచ్చాయి. షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది (2023) మే 7న ఎలక్షన్స్‌? జరగాల్సి ఉండింది. అయితే అప్పుడు క్రీడా మంత్రిత్వ శాఖ ఎన్నికలను నిలిపి వేసింది. ఆతర్వాత చాలా తేదీలు మారుతూ వచ్చాయి. ఈ మధ్యలో ఓటు హక్కు కోసం పలు సంఘాలు కోర్టుకెక్కాయి. చివరగా ఆగస్టు 12న ఎన్నికలు నిర్వహిస్తామని అడ్‌హక్‌ కమిటీ ప్రకటించగా.. పంజాబ్‌-హర్యానా హైకోర్టు ఈ ఎన్నికలపై స్టే విధించింది. దీంతో ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డాయి. ఈ క్రమంలోనే యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ సమాఖ్య.. భారత రెజ్లింగ్‌ సమాఖ్యపై వేటు వేసింది.