
- సెన్సెక్స్ 570 పాయింట్ల పతనం
- మూడు రోజుల్లో రూ.5 లక్షల కోట్లు ఫట్
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడితో వరుసగా మూడో రోజూ నష్టాలు చవి చూశాయి. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులకు తోడు దేశీయంగా సానుకూల ఆర్థికాంశాలు ఏమీ కానరాకపోవడంతో ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా భారత్- కెనడా మధ్య సంబంధాలు దిగజారడానికి తోడు అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపునపై సంకేతాలు ఇవ్వడంతో గురువారం సెషన్‌లో ఉదయం నుంచే మొదలైన సూచీల పతనం ఏ దేశలోనూ కోలుకోలేదు. తుదకు బిఎస్‌ఇ సెన్సెక్స్ 570 పాయింట్లు కోల్పోయి 66,230కు జారింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ కూడా 159 పాయింట్ల నష్టంతో 19,742కు వద్ద ముగిసింది. దీంతో నిఫ్టీ -50 సూచీ సెప్టెంబరు 7 నాటి కనిష్ఠానికి పడిపోయింది. ప్రస్తుతానికి అయితే వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు అమెరికా ఫెడ్ రిజర్వ్ ప్రకటించింది. కాగా.. దీర్ఘకాలం పాటు అధిక వడ్డీ రేట్లు కొనసాగవచ్చని.. రానున్న రోజుల్లో మరోసారి వడ్డీ రేట్ల పెంపు తప్పదని సంకేతాలు ఇచ్చింది. ఈ పరిణామం మదుపర్ల విశ్వాసాన్ని దెబ్బతీసింది. మరోవైపు ముడి చమురు ధరలు కూడా పెరగడం ప్రతికూలతను పెంచాయి.
రంగాల వారిగా ఐటి, ఎఫ్‌ఎంసిజి, ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకులు, క్యాపిటల్ గూడ్స్ నష్టాలను చవిచూశాయి. ఇంధనం, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్ సూచీలకు మద్దతు లభించింది. డాలర్‌తో రూపాయి మారకం తుదకు యథాతథంగా 83.10 వద్ద ముగిసింది. మూడు సెషన్లలో సెన్సెక్స్ దాదాపు 1600 పాయింట్లు కోల్పోయింది. దీంతో దలాల్ స్ట్రీట్‌లో మదుపర్ల సంపద దాదాపు రూ.5.4 లక్షల కోట్లు ఆవిరయ్యింది. నేటి వారాంతం సెషన్‌లోనూ మార్కెట్లు పడిపోతే.. మదుపర్లు మరింత నష్టాలు చవి చూసే అవకాశం ఉంది.