Jul 26,2023 16:07

ఫెనోమ్‌ పెన్‌ : కంబోడియా ప్రధాని మంత్రిగా ఉన్న హున్‌సేన్‌.. పిఎం పదవిని తన కుమారుడు హున్‌ మానేట్‌కి కట్టబెడుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. బుధవారం ఓ ప్రసంగంలో మాట్లాడుతూ.. 'నేను ప్రధాని పదవి నుంచి వైదొలుగుతున్నాను. రాబోయే రోజుల్లో ప్రధాని బాధ్యతలను నా కుమారుడు హున్‌మానెట్‌ స్వీకరిస్తారు. బహుశా ఆగస్టు 10వ తేదీన కొత్త ప్రధాని నియమితం కావొచ్చు. కుమారుడు ప్రధాని బాధ్యతలు స్వీకరించినా.. నేను అధికార పార్టీ (సిపిపి) అధినేతగానూ.. పార్లమెంట్‌ సభ్యుడిగా కొనసాగుతాను. కొత్తగా ఎన్నికైన పార్లమెంట్‌ ఆగస్టు 21న సమావేశం కానుంది. ఆగస్టు 22వ తేదీన కొత్త మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేస్తుంది.' అని ఆయన అన్నారు.
కాగా, దాదాపు 40 సంవత్సరాలుగా కంబోడియా దేశాన్ని హున్‌ పాలించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హున్‌సేన్‌ రూలింగ్‌ పార్టీ కంబోడియన్‌ పీపుల్స్‌ పార్టీ (సిపిపి) పోటీ లేకుండానే విజయం సాధించింది. ఎన్నికల్లో గెలిచి ప్రధాని బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజుల తర్వాత హున్‌సేన్‌ పిఎం పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.