Nov 15,2023 18:56

కిక్కిరిసిన నగర వీధులు
కిలో మీటర్ల పొడవునా సాగిన ప్రదర్శన
వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనపై పూల వర్షం
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
ప్రజాశక్తి - కృష్ణాప్రతినిధి:అరుణ పతాకాలతో బెజవాడ ఎరుపెక్కింది. 'అసమానతలు లేని అభివృద్ధి' కోసం బుధవారం విజయవాడ నగరంలో చేపట్టిన ప్రజా రక్షణ భేరి భారీ ప్రదర్శన ఉత్సాహంగా సాగింది. సిపిఎం ప్రజారక్షణ భేరి బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు వేలాదిగా తరలి వచ్చాయి. దీంతో రోడ్లన్నీ కిక్కిరిసి పోయాయి. బిఆర్‌టిఎస్‌ రోడ్డు ఫుడ్‌ జంక్షన్‌ నుంచి వేలాది మందితో స్టేడియం వరకు జరిగిన భారీ ప్రదర్శన, రెడ్‌ డ్రెస్‌ వాలంటీర్ల కవాతు నగర ప్రజలను ఆకట్టుకుంది. పలు ప్రాంతాల్లో పార్టీ అభిమానులు, శ్రేయోభిలాషులు, ప్రజలు ప్రదర్శనపై పూల వర్షం కురిపించారు. ర్యాలీలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు విభిన్న కళారూపాలు ప్రదర్శించారు. ప్రజలు ఆసక్తిగా తిలకించారు. రెండున్న కిలో మీటర్ల దూరంలో ఉన్న సభా ప్రాంగణం వద్దకు భారీ ప్రదర్శన చేరేందుకు సుమారు రెండు గంటలు పట్టింది. వాహనదారులకు ఇబ్బంది కలుగకుండా క్రమశిక్షణతో సాగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక వైఖరిపై చేసిన నినాదాలు ఆకట్టుకున్నాయి.

  • రెడ్‌ డ్రెస్‌ వాలంటీర్ల కవాతు

ఉదయం 11.15 గంటలకు బిఆర్‌టిఎస్‌ రోడ్‌ ఫుడ్‌ జంక్షన్‌ వద్ద ప్రదర్శన ప్రారంభమైంది. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఎ.గఫూర్‌, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు, రాష్ట్ర సీనియర్‌ నాయకులు ఎం.మధు ఓపెన్‌ టాప్‌ వాహనంపై ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీలో ముందుకు సాగారు. ర్యాలీ ప్రారంభ సూచికగా వాహనంపై నుంచి ఎర్ర బెలూన్లకు ఎగురేశారు. మహాప్రదర్శన భారీ బ్యానర్‌ను ప్రదర్శిస్తూ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, కమిటీ సభ్యులు ప్రదర్శనలో ముందు భాగాన సాగారు. వివిధ ప్రాంతాలకు చెందిన రెడ్‌ డ్రెస్‌ వాలంటీర్లు 30 మంది చొప్పున ఒక గ్రూపుగా కవాతు నిర్వహించారు. ఆ గ్రూపు నాయకుడు ఎర్ర జెండాను చేత పట్టుకుని గ్రూపు ముందు భాగాన నడిచారు. నాయకుని అనుసరిస్తూ ఎర్ర జెండా, ఖాకీ ప్యాంట్‌, టోపీతో పురుష వాలంటీర్లు, ఎరుపు, తెలుపు పంజాబీ డ్రస్‌లు, ఎర్ర చీరలు, ఖాకీ టోపీలతో మహిళ వాలంటీర్లు ప్రదర్శనలో ముందు భాగంలో నడిచారు. సుమారు రెండు వేల మందికిపైగా రెడ్‌ డ్రెస్‌ వాలంటీర్లు కవాతు చేస్తూ సాగారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు వినూత్న కళా ప్రదర్శనలు చేస్తూ వారిని అనుకరించారు. పార్టీ శ్రేణులు, నేతలు, అభిమానులు తమ తమ జిల్లాల బ్యానర్లను చేతబట్టుకుని ప్రదర్శనలో పాల్గన్నారు. ఫుడ్‌ జంక్షన్‌, భగత్‌సింగ్‌ రోడ్డు, సత్యనారాయణపురం, గవర్నమెంట్‌ ప్రెస్‌, బుడమేరు వంతెన, సింగ్‌నగర్‌ ఫ్లైవోవర్‌, డాబా కొట్లు సెంటర్‌ మీదుగా సాగిన మహాప్రదర్శన మధ్యాహ్నం ఒంటిగంటకు సభా వేదిక ఏర్పాటు చేసిన సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపునయ్య స్టేడియంనకు చేరింది. ఫుడ్‌ జంక్షన్‌, గవర్నమెంట్‌ ప్రెస్‌ వద్ద పార్టీ స్థానిక శాఖ, ముత్యాలంపాడు వంతెన వద్ద మధ్యతరగతి ఉద్యోగులు, బుడమేరు వంతెన వద్ద కొందరు న్యాయవాదులు ప్రదర్శనపై పూల వర్షం కురిపించారు. ప్రజలు ఇళ్లల్లో నుంచి వెలుపలకు వచ్చి భారీ ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. భవంతులు, అపార్టుమెంట్లపైకి ఎక్కి ప్రదర్శనను చూశారు. పెన్షనర్లు, ఆటో వర్కర్లు, తాపీ, ముఠా వర్కర్లు సంఘీభావం తెలుపుతూ ర్యాలీలో పాల్గోన్నారు.

  • కళారూపాల ప్రదర్శన

ర్యాలీ సాగుతుండగానే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు పలు ప్రదర్శనలు ఇచ్చారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం మహిళలు, విజయవాడ కళానగర్‌కు చెందిన చిన్నారులు కోలాట ప్రదర్శనలు ఇచ్చారు. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు మండలం తుమ్మల గ్రామానికి చెందిన కళాకారులు కొమ్ము కోయ డ్యాన్స్‌, కృష్ణాజిల్లా గన్నవరం నుండి తీన్‌మార్‌ బృందం, ఉయ్యూరు డప్పు కళాకారులు, శ్రీకాకుళం జిల్లా పలాస కళాకారులు తప్పిటగుళ్లు ప్రదర్శనలు ఇచ్చారు. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం కళాకారులు గురువయ్య వేషాలు వేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన కళాకారులు అవినీతి, నిరుద్యోగం, కార్పొరేట్‌ మతోన్మాద భూతాల చేతిలో బంధీ అయిన భరత మాతను సూచిస్తూ విజయవాడ చిన్నారులు, కొమ్ముబూర ప్రదర్శన ఇస్తూ ఎన్‌టిఆర్‌ జిల్లా మైలవరం ప్రాంత కళాకారులు, చిలకజోస్యం కళారూపాన్ని ప్రదర్శిస్తూ కృష్ణాజిల్లా కళాకారులు ర్యాలీలో ముందుకు సాగారు.

  • దారులన్నీ బెజవాడకే !

వివిధ జిల్లాల నుంచి రైళ్లు, ఆర్‌టిసి బస్సుల్లో సిపిఎం శ్రేణులు విజయవాడ చేరుకున్నాయి. టూరిస్టు బస్సులు, వ్యాన్లు, ఆటోలు సమకూర్చుకుని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి జనం తరలివచ్చారు. విశాఖపట్నం ఉక్కునగరంనకు చెందిన పార్టీ శాఖ ఆధ్వర్యంలో 150 బైక్‌లతో ర్యాలీగా ప్రదర్శన వద్దకు చేరుకున్నారు.