Jul 29,2023 12:06

ప్రజాశక్తి-ఘంటసాల (కృష్ణా) : చల్లపల్లి సిహెసి పరిధిలో గత మూడు రోజులుగా అత్యధికంగా పాముకాటు కేసులు నమోదు కాగా బాధితులను సిపిఎం నాయకులు శనివారం హాస్పిటల్లో పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అధికంగా నమోదవుతున్న పాముకాటు కేసుల గురించి సిహెసి వైద్యాధికారి డాక్టర్‌ మహేష్‌ ని సంప్రదించగా ... డాక్టర్‌ మహేష్‌ మాట్లాడుతూ... గత మూడు రోజుల నుంచి 40 కి పైగా పాముకాటు కేసులు నమోదయ్యాయని అన్నారు. సకాలంలో హాస్పటల్‌ కి రావడం వల్ల ఏ విధమైన ప్రమాదం లేదన్నారు. అత్యవసరం అయినప్పుడు సరిపడ ఏఎస్వి డోసులు అందుబాటులో ఉన్నాయన్నారు. సాధారణంగా అన్ని పాము కాట్ల విషయంలోనూ ఏఎస్వి డోసు ఉపయోగించాల్సిన అవసరం లేదని కరిచిన పాము విషపూరితమైనదా ? కాదా ? అని నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే ఏఎస్వి డోసు ఉపయోగించడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా చల్లపల్లి సిపిఎం మండల కార్యదర్శి యద్దనపూడి మధు మాట్లాడుతూ ... చల్లపల్లి, ఘంటసాల మండలాల పరిధిలోని ప్రజలు పాము కాట్ల పట్ల జాగ్రత్తలు వహిస్తూ ఎవరైనా పాముకాటుకు గురైతే నాటు మందులను ఆశ్రయించి ప్రాణాల మీదకు తెచ్చుకోకుండా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి రావడం వల్ల ప్రాణాలను నిలబెట్టుకోవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వాకా రామచంద్రరావు, మహమ్మద్‌ కరిముల్లా, బళ్ళ వెంకటేశ్వరరావు, కలపాల దావీదు, రావి సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.