Aug 11,2023 17:33

ప్రజాశక్తి, తాడేపల్లి రూరల్‌ : సంయుక్త కిసాన్‌ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా శుక్రవారం ఎంటిఎంసీ పరిధిలోని కొలనుకొండ జాతీయ రహదారి వద్ద సిపిఎం ఆధ్వర్యంలో క్విట్‌ కార్పోరేట్‌, సేవ్‌ ఇండియా, సేవ్‌ అగ్రికల్చర్‌ నినాదంతో సిపిఎం నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా సిపిఎం సీనియర్‌ నాయకులు జొన్న శివ శంకరరావు మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వన కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాలు అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పాలు అయ్యారని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయని ఆయన విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని కారు చౌకగా, కార్పొరేట్‌ కంపెనీలకు అమ్మేందుకు బిజెపి ప్రభుత్వం పూనుకుందన్నారు. భారతదేశ వెలిగిపోతుంది అంటూనే, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ శక్తులకు దారా దత్తం చేసేందుకు ఏకపక్షంగా మూడు నల్ల చట్టాలను బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చింది అన్నారు. వ్యవసాయ రంగాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ఒకే దేశం ఒకే మార్కెట్‌ పేరుతో రైతులను నట్టేట ముంచేందుకు నరేంద్ర మోడీ పూనుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా అనేక రైతు సంఘాల ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ సంవత్సరం కాలం పాటు రైతులు పోరాటం చేశారని ఆయన అన్నారు. అదేవిధంగా 1942 ఆగస్టు 9వ తేదీన ఆనాడు బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్విట్‌ ఇండియా కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగిందని ఆయన అన్నారు. దేశాన్ని కాపాడుకునేందుకు, వ్యవసాయ రంగాన్ని కాపాడుకునేందుకు సేవ్‌ ఇండియా, సేవ్‌ అగ్రికల్చర్‌ నినాదంతో సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగాఆయా రైతు, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నాయని ఆయన అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం తాడేపల్లి మండల కార్యదర్శి దొంతి రెడ్డి వెంకటరెడ్డి, సిపిఎం సీనియర్‌ నాయకులు కాట్రగడ్డ శివరామకఅష్ణయ్య, సిపిఎం కొలనుకొండ గ్రామ శాఖ కార్యదర్శి కాట్రగడ్డ శివన్నారాయణ, గద్దె శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.