Oct 31,2022 10:50
  • రైతులు, నిరుద్యోగం, అధిక ధరలపై ప్రచారం
  • హిమాచల్‌లో 12న పోలింగ్‌

న్యూఢిల్లీ : హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ (నవంబర్‌ 12న) దగ్గర పడుతున్నకొద్దీ..ప్రజా సమస్యలు తెరపైకి వస్తున్నాయి. యాపిల్‌ను సాగు చేస్తున్న రైతుల సమస్యలు, ఇంధన ధరలు, ఎరువుల ధరలు, రవాణా వ్యయం, జిఎస్‌టి పెంపు, నిరుద్యోగం..ఇవన్నీ ఎన్నికల్లో ప్రధాన అంశాలుగా వివిధ పార్టీలు లేవనెత్తుతున్నాయి. డబుల్‌ ఇంజన్‌, అవినీతి నిర్మూలన, ఉమ్మడి పౌరస్మృతి అంశాలతో బిజెపి ఓటర్లను ప్రభావితం చేస్తోంది. రైతు సమస్యలు, నిరుద్యోగం, జిఎస్‌టి దోపిడి, ఎరువులు, ఇంధన ధరలపై సిపిఎం చాలాకాలంగా రాష్ట్రంలో పలు నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. 68 అసెంబ్లీ స్థానాల్లో 11 చోట్ల సిపిఎం తన అభ్యర్థుల్ని బరిలో నిలిపింది. అఖిల భారత కిసాన్‌ సభ (ఎఐకెఎస్‌్‌) ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనల్లో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యాపిల్‌ ప్యాకేజింగ్‌ డబ్బాపై జిఎస్‌టిని ఉపసంహరించాలని, ఎరువుల సబ్సిడీ అందించాలని, మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ స్కీమ్‌ ద్వారా యాపిల్స్‌ కొనుగోలు చేయాలని ఎఐకెఎస్‌ డిమాండ్‌ చేస్తోంది.
                యాపిల్‌ పెంపకందార్లు, ఏజెంట్లు, ప్రభుత్వంతో కూడిన స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలని ఆందోళనలు చోటుచేసుకున్నాయి. ఇవేవీ కాంగ్రెస్‌, బిజెపి ఎన్నికల ఎజెండాలో లేవు. డబుల్‌ ఇంజిన్‌ పేరుతో బిజెపి ప్రజలకు భ్రమలు కల్పిస్తోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వంపై హిమాచల్‌ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. నాయకుల అంతర్గత కుమ్ములాటలతో కాషాయ కూటమి సతమతమవుతోంది. ఇటీవల ఎన్నికల ర్యాలీ సందర్భంగా ప్రధాని మోడీ, 3125 కిమీ గ్రామీణ రహదారుల అప్‌గ్రేడ్‌ చేయడానికి పథకాన్ని ప్రారంభించారు. ఇది కేవలం ఎన్నికల జిమ్మిక్కు తప్ప మరోటి కాదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
            హిమాచల్‌ అసెంబ్లీలో 68 స్థానాలున్నాయి. వివిధ పార్టీలకు చెందిన 550 మంది నామినేషన్లు వేశారు. 17 సీట్లు ఎస్సీలకు, మూడు ఎస్టీలకు రిజర్వ్‌ అయ్యాయి. మొత్తం ఓటర్ల సంఖ్య 55,74,793. ఇందులో మొదటిసారటి ఓటు హక్కు వినియోగించుకునేవారు 1.86 లక్షలు. గత మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్‌, బిజెపి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తూ వస్తున్నాయి.
 

                                                                    యాపిల్‌ రైతు..నిరుద్యోగం

గత ఐదేళ్ల్లుగా యాపిల్‌ రైతులు ఆందోళనబాట పడుతున్నారు. భారీ నిరసనలకు దిగుతున్నారు. పెరిగిన ఉత్పత్తి వ్యయం, వాతావరణ వైరుధ్యాలు, ఇంధన, ఎరువుల ధరలు వంటివి చర్చనీయాంశమయ్యాయి. పెద్ద పెద్ద వ్యవసాయ పరిశ్రమల వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొగ్గుచూపుతున్నాయని, సామాన్య రైతు కష్టాలు కనపడటం లేదని ఆగ్రహం వ్యక్తమవుతోంది. జిఎస్‌టి పన్నుల పెంపు, రవాణా వ్యయం పెరగటం రైతుల్ని తీవ్రంగా వేధిస్తోంది. బిజెపి పాలనే దీనికి కారణమని కాంగ్రెస్‌, వామపక్షాలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. యాపిల్స్‌కు కనీస మద్దతు ధర అమలు కావటం లేదు. ఇది అత్యధికమందిని వేధిస్తోంది. బిజెపి హయాంలో రాష్ట్రంలో నిరుద్యోగం పతాక స్థాయికి చేరింది. జాతీయ సగటు అక్టోబర్‌లో (సిఎంఐఇ ప్రకారం) 7.8 శాతం కాగా, హిమాచల్‌లో 9.2 శాతం నమోదైంది. ప్రభుత్వ శాఖల్లో నియమకాలు తగ్గటం, రైతాంగం సంక్షోభంలో కూరుకుపోవటం ఉపాధి సమస్యకు ప్రధాన కారణమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇది కూడా హిమాచల్‌ ఎన్నికల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.