ప్రజాశక్తి- కాకినాడ:కేంద్ర బిజెపి మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా, నిరుద్యోగం, అధికధరలు, విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 4 వరకు సిపిఎం ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రచారోద్యమాన్ని ప్రజలంతా జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా నాయకులు దువ్వ శేషబాబ్జీ కోరారు.ఆదివారం స్థానిక ఇంద్రపాలెం వంతెన ఎదురుగా ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద సిపిఎం ప్రచార ఉద్యమ కరపత్రాన్ని శేషబాబ్జీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల ధరలు విపరీతంగా పెరిగి సామాన్య మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. సెప్టెంబర్ 3 వ తేదీన నిరుద్యోగులతో సదస్సు నిర్వహిస్తామన్నారు. సెప్టెంబర్ 4 వ తేదీన మండల కార్యాలయాల వద్ద ధర్నా చేపడతామన్నారు.కె. సత్తిరాజు మాట్లాడుతూ కేంద్ర బిజెపి మన రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు వారికి భజన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాన ప్రతిపక్షాలు కూడా ఏమాత్రం స్పందించడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలకోసం జరిగే ఉద్యమాలకు ప్రజలు సంఘీభావం తెలపాలన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు మలక వెంకట రమణ, దుంపల ప్రసాద్, కె. నాగ జ్యోతి లతో పాటు నర్ల ఈశ్వరి, నాగాబత్తుల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.










