ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : మండలంలోని ఓబులాపురం గ్రామంలో రైతు కరెంట్ డిపిలకు మోటర్లకు స్కాన్ క్యూర్ కోడ్ స్టిక్కర్లను అతికించడానికి వచ్చిన విద్యుత్ అధికారులను రైతు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం అడ్డుకోవడం జరిగినది. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఏం కఅష్ణమూర్తి, ఎస్.సూరి, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి వెంకట చౌదరి మాట్లాడుతూ ... ఇప్పటికే రైతాంగం పూర్తిగా నష్టపోయిందని పెట్టిన పెట్టుబడులు కూడా గిట్ట లేనట్టు పరిస్థితుల్లో ఉన్నారని అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితిలో ఉన్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం బిజెపి విధానాలను అమలు పరచడంలో భాగంగా రైతు మోటార్లకు మీటర్లు పెట్టే కార్యక్రమాన్ని కేంద్రం నిర్ణయిస్తే ఆ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అతి ఉత్సాహంతో అమలు చేయడంలో భాగంగా రైతుల కరెంటు డిపి లకు మోటర్లకు స్కానర్లను సర్వే రూపంలో స్టిక్కర్లు అతికించడం దారుణమన్నారు. ఈ కార్యక్రమాన్ని రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ప్రత్యక్షంగా ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని డిమాండ్ చేస్తూ ఈరోజు ఓబులాపురం గ్రామంలో సర్వేకు వచ్చిన విద్యుత్ అధికారులను అడ్డుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి పెద్దయ్య, భాస్కరు, నాయకులు చిన్న నాగన్న, నాగేశ్వర, గోపాలు, రామాంజనేయులు, రామ్మోహన, తదితర రైతులు పాల్గొన్నారు.










