Nov 03,2023 10:48

 ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులకు యాపిల్‌ అలర్ట్‌పై 'అత్యవసర సమావేశం' ఏర్పాటు చేయాలి

ఐటి  స్టాండింగ్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌కు సిపిఐ(ఎం) ఎంపి జాన్‌ బ్రిట్టాస్‌ లేఖ
ప్రజాశక్తి - న్యూఢిల్లీ బ్యూరో :
  ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులకు యాపిల్‌ అలర్ట్‌ మేసేజ్‌ల వెనుక ఎవరున్నారో తేల్చడానికి సత్వరమే 'అత్యవసర సమావేశం' ఏర్పాటు చేయాలని సిపిఐ(ఎం) ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కమ్యూనికేషన్స్‌, ఐటి పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌కు ఆయన లేఖ రాశారు. పలువురు ప్రతిపక్ష నేతలకు యాపిల్‌ నుంచి హెచ్చరికలు అందుతున్న నేపథ్యంలో అత్యవసరంగా ప్యానెల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ''ఈ పరిస్థితిని తక్కువగా అంచనా వేయలేం. ఎందుకంటే ఇది వ్యక్తిగత డేటా భద్రత గురించి మాత్రమే కాకుండా జాతీయ భద్రతకూ చిక్కులను తెచ్చిపెడుతుంది. ఈ నోటిఫికేషన్‌ పెగాసస్‌ స్పైవేర్‌ కుంభకోణాన్ని గుర్తుచేస్తున్నది. ఇది పాలక వ్యవస్థను విమర్శించే గొంతులను లక్ష్యంగా చేసుకుంది. ఇది మన ప్రజాస్వామ్యానికి తీవ్ర ఆందోళన కలిగించే విషయం'' అని బ్రిట్టాస్‌ పేర్కొన్నారు. ''పౌరుల ప్రాథమిక హక్కులు ప్రమాదంలో ఉన్నందున స్టాండింగ్‌ కమిటీ, ఈ సమస్యను సమగ్రంగా పరిశీలించడానికి తక్షణమే చర్య తీసుకోవాలి. దర్యాప్తు చేయడం కమిటీ పరిధిలో ఉందని నేను నమ్ముతున్నాను'' అని లేఖలో పేర్కొన్నారు. యాపిల్‌ గుర్తించిన భద్రతా ముప్పు స్వభావం, విశ్వసనీయత, ప్రభుత్వం మద్దతు ఉన్న హ్యాకర్ల ప్రమేయం, వారి ప్రేరణలు, సైబర్‌ భద్రతా చర్యల సమర్ధతను కమిటీ పరిశీలించాలని జాన్‌ బ్రిట్టాస్‌ అన్నారు. దేశంలోని మొబైల్‌ ఫోన్‌ వినియోగదారుల గోప్యత, భద్రతను కాపాడాలని అన్నారు. ''గోప్యతా హక్కు మానవ ఉనికికి పవిత్రమైనది. మానవ గౌరవం, స్వయం ప్రతిపత్తి విడదీయరానివి'' అని ఆయన అన్నారు.