న్యూఢిల్లీ : మణిపూర్ లైంగిక హింస కేసులో ఆరుగురు నిందితులపై సిబిఐ చార్జిషీట్ దాఖలు చేసింది. చట్టానికి విరుద్ధంగా ఒక చిన్నారిపై కూడా నివేదిక ఇచ్చింది. అస్సాం రాజధాని గువహటిలో ప్రత్యేక కోర్టులో చార్జిషీట్‌ను, నివేదికను సిబిఐ అందజేసింది. క్రిమినల్ కుట్ర, మారణాయుధాలతో అల్లర్లకు పాల్పడడం, మహిళలపై అత్యాచారం, సామూహిక అత్యాచారానికి పాల్పడడానికి సంబంధించి ఐపిసి నిబంధల కింద, ఎస్‌సి, ఎస్‌టి చట్ట నిబంధనల కింద సిబిఐ అభియోగాలు నమోదు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుండి అందిన ప్రస్తావన, కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్‌లను పరిగణనలోకి తీసుకుని సిబిఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. మే 4న ఈ ఘటన జరగగా, జూన్ 21న కేసు నమోదైంది. మణిపూర్‌లోని కాంగ్‌పోక్పి జిల్లా ఫైనామ్ గ్రామంలోకి అత్యంత అధునాతన ఆయుధాలతో చొరబడ్డ దాదాపు వెయ్యి మంది మూక ఇళ్లను తగలబెట్టి, ఆస్తులను లూటీ చేసి, గ్రామస్తులపై దాడులు జరిపి, హత్యలు, అత్యాచారాలకు పాల్పడ్డారని చార్జిషీట్ పేర్కొంది.










