Sep 05,2023 10:37
  • సెమీస్‌లో మెన్స్‌ జట్టు
  • టిటి ఆసియా చాంపియన్‌షిప్స్‌

పియాంగ్‌చాంగ్‌ (దక్షిణ కొరియా) : టేబుల్‌ టెన్నిస్‌ ఆసియా చాంపియన్‌షిప్స్‌లో భారత పురుషుల జట్టు పతకం ఖాయం చేసుకుంది. సోమవారం జరిగిన మెన్స్‌ టీమ్‌ క్వార్టర్‌ఫైనల్లో టీమ్‌ ఇండియా 3-0తో సింగపూర్‌పై గెలుపొందింది. మెన్స్‌ జట్టు విభాగంలో సెమీఫైనల్లోకి ప్రవేశించిన భారత్‌.. కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకుంది. టీమ్‌ ఈవెంట్‌ తొలి మ్యాచ్‌లో వెటరన్‌ అచంట శరత్‌ కమల్‌ అదరగొట్టాడు. 11-1, 10-12, 11-8, 11-13, 14-12తో ఐజాక్‌ క్వెక్‌పై ఐదు గేముల్లో అద్భుత విజయం సాధించాడు. టైబ్రేకర్‌కు దారితీసిన పోరులో 41 ఏండ్ల శరత్‌ కమల్‌ పైచేయి సాధించాడు. మరో సింగిల్స్‌లో జ్ఞానశేఖరన్‌ సతియన్‌ సైతం మెరుపు విజయం నమోదు చేశాడు. 11-6, 11-8, 12-10తో కోయెన్‌ పాంగ్‌పై వరుస గేముల్లో గెలుపొందాడు. మరో మ్యాచ్‌లో యువ ప్యాడ్లర్‌ హర్మీత్‌ దేశారు 11-9, 11-4, 11-6తో జె యు క్లారెన్స్‌పై ఏకపక్ష విజయం నమోదు చేశాడు. దీంతో భారత్‌ 3-0తో సింగపూర్‌ను చిత్తు చేసింది. మూడో సీడ్‌ టీమ్‌ ఇండియా నేడు సెమీఫైనల్లో ఇరాన్‌, చైనీస్‌ తైపీ క్వార్టర్‌ఫైనల్‌ విజేతతో సెమీఫైనల్లో తలపడనుంది. గత ఆసియా చాంపియన్‌షిప్స్‌లో భారత మెన్స్‌ జట్టు కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఇక, మహిళల జట్టు క్వార్టర్‌ఫైనల్లో అమ్మాయిల నిరాశపరిచారు. జపాన్‌తో క్వార్టర్స్‌లో భారత్‌ 0-3తో తేలిపోయింది. వరల్డ్‌ నం.8 మిమ 11-7, 15-13, 11-8తో అహిక ముఖర్జీపై గెలుపొందగా.. వరల్డ్‌ నం.36 మనిక బత్ర 7-11, 9-11, 11-9, 3-11తో వరల్డ్‌ నం.7 హినా హయత చేతిలో ఓడింది. మరో మ్యాచ్‌లో సుతీర్థ ముఖర్జీ 11-7, 4-11, 6-11, 5-11తో పరాజయం పాలైంది. 5-8 స్థానాల కోసం నేడు జరిగే క్లాసిఫికేషన్‌ మ్యాచుల్లో భారత మహిళల జట్టు ఆడనుంది.