న్యూఢిల్లీ : వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకునేందుకై భారత్, అమెరికా విదేశీ, రక్షణ మంత్రులు శుక్రవారం ముఖాముఖి చర్చలు జరిపారు. ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఇండో-పసిఫిక్ అంశాలు, ప్రాంతీయ, అంతర్జాతీయ సవాళ్ళు చర్చకు వచ్చాయి. రక్షణ పారిశ్రామిక సంబంధాలను మరింతగా విస్తరించుకోవాలని భావిస్తున్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో కార్యకలాపాలను పెంచాలని, కీలకమైన ఖనిజాలు, అత్యున్నత సాంకేతికత వంటి కీలక రంగాల్లో సహకారాన్ని పెంచుకోవాలని ఆకాంక్షించారు. భారత తరుపున విదేశాంగ మంత్రి జై శంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లు పాల్గొనగా, అమెరికా తరపున ఆంటోనీ బ్లింకెన్, లాయిడ్ ఆస్టిన్‌లు పాల్గొన్నారు. ముందస్తు దృక్పథం గల భాగస్వామ్యాన్ని నిర్మించి, అంతర్జాతీయ ఎజెండాను రూపొందించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ల దార్శనికతను మరింత ముందుకు తీసుకెళ్ళేందుకు ఈ చర్చలు ఒక అవకాశాన్ని కల్పిస్తాయని సమావేశం ప్రారంభానికి ముందు జై శంకర్ వ్యాఖ్యానించారు. కీలకమైన సాంకేతికతలు, ముఖ్యమైన ఖనిజాల రంగంలో, పౌర రోదసీ రంగంలో సహకారం వంటి కొత్త రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారానికి గల అవకాశాలను అన్వేషిస్తున్నామని చెప్పారు. రక్షణ సహకారాన్ని మరింత పెంచుకోవడానికి ఇరు దేశాలు ఆసక్తిగా వున్నాయని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు అత్యంత కీలకమైన మూల స్తంభాల్లో రక్షణ సహకారం ఒకటిగా వుందన్నారు. అమెరికాతో అన్ని రంగాల్లో కలిసి సన్నిహితంగా పనిచేయడానికి ఎదురుచూస్తున్నామని చెప్పారు.క్వాడ్ ద్వారా అమెరికా-భారత్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంతో పాటూ స్వేచ్ఛా, పారదర్శకమైన, సుసంపన్నమైన, భద్రత కలిగిన ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని పెంచి పోషించడానికి ఇరు పక్షాలు కృషి చేస్తున్నాయని అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ చెప్పారు. నిబంధనల ఆధారిత వ్యవస్థను పెంపొందించేందుకు కృషి చేస్తూ, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, స్వాతంత్య్ర సూత్రాలను పరిరక్షిస్తూ, అంతర్జాతీయ శాంతి, భద్రతా రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంచి పోషించడంపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. నిబంధనల ఆధారిత వ్యవస్థను పెంపొందించేందుకు కృషి చేస్తూ, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, స్వాతంత్య్ర సూత్రాలను పరిరక్షిస్తూ, అంతర్జాతీయ శాంతి, భద్రతా రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంచి పోషించడంపై దృష్టి పెట్టినట్లు చెప్పారు.