- దొడ్డి పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం
ప్రజాశక్తి-రాజవొమ్మంగి(అల్లూరి) : బోయ,వాల్మీకి,బెంతు, ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చరాదని లోదొడ్డి పంచాయతీ సర్పంచ్, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా.రామారావు ఆధ్వర్యంలో పంచాయితీ పాలకవర్గం గురువారం ఏకగ్రీవ తీర్మానం చేసింది. గురువారం లోదొడ్డి పంచాయతీ కార్యాలయంలో వార్డు సభ్యులు జర్తా రాజబాబు అధ్యక్షతన పంచాయతీ పాలకవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా లోదొడ్డి సర్పంచ్ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు మాట్లాడుతూ.. బోయ,వాల్మీకి,బెంతు,ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానించిందని తెలిపారు. దీనివలన ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న నిజమైన గిరిజనులు 25 లక్షల మందికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతంలో విద్య, వైద్యం,రహదారులు, తాగునీరు, విద్యుత్ వంటి పూర్తిస్థాయి సౌకర్యాలు లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణం ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 52ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ.. పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ కార్యక్రమంలో లోదొడ్డి వైస్ సర్పంచ్, బుఠారి రాజుబాబు, వార్డు సభ్యులు, జర్తా.రాజుబాబు, పొత్తూరు సింహద్రి, కె.మంగిరెడ్డి, పి లోవరాజు, కె.రాజుబాబు, తదితరులు పాల్గొన్నారు.










