Sep 25,2023 07:34

ఆ పురుగు కొందరినే తొలుస్తుంది
అంతే!
ఆ కొందరి బుర్రలూ మంత్రమేసినట్టు మారిపోతాయి !
వారి మస్తకాలకు అక్షరాల అల్లికలు కొత్త ఆభరణాలవుతాయి!
కొత్త వ్యక్తుల ప్రపంచంలోకి అడిగిడుతూ
బాహ్య బంధాల బంధనాలను మర్చిపోతారు!
రంగు - రుచులను దాటి, భావాల స్పర్శను తడుముకుంటూ
పుస్తకాల దుకాణాల్లో తప్పిపోయిన మిత్రులను
కనుగొనే ప్రయత్నం చేస్తారు!
షికార్లు - పుకార్లు, మర్యాదలు -మొహమాటాలు
వారిని ఉత్సాహపరచవు ఇక!
ఏవో తెలిసిన అనుభూతి, ఇంకా తడమని ద్వారాలు
వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి!
వారి ఆతురత వైశాల్యం
పుస్తకాల అరలు కూడా కొలవలేవు!
వారి జ్ఞాన తృష్ణ ఏ పరికరానికి అందదు!
లౌక్యవాదంలోకి నెట్టినా
యథార్థవాదంలోకి తోసినా
అమాయకత్వంలోనే మిగిలిపోయినా
ఆ లోకపు దారి మాత్రం ఆ కొందరిని మార్చేస్తుంది!
ఆ లోకంలో పేద - పెద్ద, కుల-మత భేదాలే లేవు కనుక
సమాన స్థాయి వ్యక్తులు ఎదిగేలా చేసే ఆ లోకమే
కొత్త సమాజపు పునాదుల దారి దివిటీ!
పుస్తకాల పురుగు నామధేయంతో
అక్షరాల మూటలను పుస్తకాల బాటలను
ఆస్తులుగా పరిగణించే
ఆ కొందరి మారిన ప్రపంచమే
నిందించని మిత్రులను, మౌనభాషణంతో మేల్కొలిపే
స్వయంగా ఎంపిక చేసుకునే పద్ధతిలో
నేస్తాలను ఆలోచనల అరల్లో
జ్ఞాన దీపపు చమురులా ప్రసాదిస్తుంది!
అదే పుస్తక పురుగుల లోకం!
రాతలు, కొట్టివేతలే తప్ప
బట్టలు, ముస్తాబులు మరిచిపోతూ
కొత్త రకమైన మనుషులు అయిపోతారు వారు ఆ లోకంలో!
చదవని పుస్తకాల లెక్కతో వ్యర్థమైన జీవితాన్ని
ఆ కొందరు ఇక లెక్కిస్తారు!
జీవించలేని క్షణాలు తరుముతున్నప్పుడు
అక్షరాల కౌగిళ్ళల్లో సేద తీరుతారు!
ఆ లోకంలోకి ఆ పురుగు వారిని లాగినప్పుడే
భిన్న జీవితపు దృక్పథంగా మారిన ఆ కొందరు
పురుగు నుంచి పరిణతి సాధించే
గొప్ప వ్యక్తులుగా కూడా ఎదుగుతారు!
 

- శంగవరపు రచన
9505811239