
'స్టీఫెన్ ఇలాగేనా నీ చదువు' అని మరియమ్మ అడిగింది. 'అలా ఎందుకు అడుగుతున్నావు అమ్మమ్మ!' అని స్టీఫెన్ అడిగాడు. 'నీ పుస్తకాల సంచి చూశాను. ఏ ఒక్క పుస్తకం కూడా సరిగా లేదు. అట్టలన్నీ చిరిగిపోయి ఉన్నాయి. చిత్తు కాగితాల సంచిలా, నీ పుస్తకాల సంచి ఉంది' అని అసలు విషయం చెప్పింది.
'అమ్మమ్మ! పుస్తకాలు చిరిగిపోయాయి. నేనేం చేస్తాను' అన్నాడు స్టీఫెన్.
'నీ పుస్తకాలను చూసి నీ చదువు గురించి చెప్పొచ్చు. నీకు ఏమాత్రం పుస్తకాలపై శ్రద్ధ లేదు. చదువుపై శ్రద్ధ ఉండకపోవటమే అందుకు కారణం. పుస్తకాలను చాలా చక్కగా ఉంచుకోవాలి. అప్పుడే చదువు కూడా చక్కగా సాగుతుంది' అని మరియమ్మ అంది.
'అమ్మమ్మ! ఎందుకు నువ్వు అంతలా కోప్పడుతున్నావు? ఆ పుస్తకాలు ఏమైనా డబ్బులు పెట్టి కొనుగోలు చేసామా? పాఠశాలలో ఉచితంగా ఇచ్చినవే కదా! అవి చిరిగిపోతున్నాయని ఎందుకు అంత బాధ పడిపోతున్నావ్' అని చాలా నిర్లక్ష్యంగా స్టీఫెన్ సమాధానం చెప్పాడు.
అప్పుడు మరియమ్మకు చాలా కోపం వచ్చింది. 'ఉచిత పుస్తకాలు అంటే నీకు అంత చిన్న చూపుగా ఉందా! ఈ పుస్తకాలు బయట కొంటే ఖరీదు ఎంత అవుతుందో తెలుసా? మా చిన్నతనంలో పుస్తకాలు దొరక్క, మేము మా పై తరగతుల వారిని బతిమాలి ఆ పాత పుస్తకాలు తీసుకునే వాళ్ళం. వాటికి అట్టలు వేసుకుని సంవత్సరం అంతా జాగ్రత్తగా చదివే వాళ్ళం. పుస్తకం ఎంతో విలువైనది. ఖరీదుతో సంబంధం లేదు' అని స్టీఫెన్‌తో అంది. ఎప్పుడూ తనపై కోపగించుకోని అమ్మమ్మ చాలా కోపంగా ఆ మాటలు అంటుంటే స్టీఫెన్ తట్టుకోలేకపోయాడు. వెంటనే అమ్మమ్మ దగ్గరకు వెళ్లి, 'నన్ను క్షమించమ'ని అడిగాడు. 'ఇకపై పుస్తకాలను చక్కగా వాడుకుంటాను. బాగా చదువుకుంటాను' అని అన్నాడు.
స్టీఫెన్‌లో వచ్చిన మార్పుకు మరియమ్మ ఎంతో ఆనంద పడింది.
- మొర్రి గోపి
88978 82202