కరాచీ (పాకిస్థాన్) : పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించింది. శుక్రవారం ఓ మసీదు ప్రాంగణంలో జరిగిన దుర్ఘఘటనలో 34 మంది మరణించినట్లు పాక్ మీడియా కథనాలు వెల్లడించాయి. పలువురు పాక్ మంత్రులు ఈ ఘటనను ఖండించారు. ఆత్మాహుతి పేలుడు మఅతులకు సంతాపం తెలిపారు.
34 మంది మృతి .. 130 మందికి పైగా గాయాలు..
మస్తుంగ్ అసిస్టెంట్ కమిషనర్ అట్టహుల్ మునిమ్ మాట్లాడుతూ ... బలూచిస్తాన్ ప్రావిన్స్ మస్తుంగ్ జిల్లాలోని ఓ మసీదు సమీపంలో ఆత్మాహుతి బాంబు పేలుడు సంభవించి 34 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 130 మందికి పైగా గాయపడ్డారని తెలిపారు. ఈరోజు (శుక్రవారం) ఈద్-ఎ-మిలాద్ ఊరేగింపు కోసం ఆ ప్రాంతంలో ప్రజలు గుమిగూడారని.. ఈక్రమంలో బాంబు పేలుడు సంభవించిందని అన్నారు.
అన్ని ఆసుపత్రులలో అత్యవసర పరిస్థితి...
బలూచిస్తాన్ తాత్కాలిక సమాచార మంత్రి జాన్ అచక్జారు మాట్లాడుతూ ... ఈ బాంబు పేలుడులో తీవ్రంగా గాయపడినవారిని క్వెట్టాకు బదిలీ చేస్తున్నారని తెలిపారు. అన్ని ఆసుపత్రులలో అత్యవసర పరిస్థితి విధించబడిందని అన్నారు. నేరస్తులను అరెస్టు చేయాలని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అలీ మర్దాన్ డోంకీ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
భద్రతలను కఠినతరం చేయండి : కరాచీ పోలీసులకు ఆదేశాలు
బాంబు పేలుడు నేపథ్యంలో ... అధికార యంత్రాంగమంతా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని, ఈద్-ఐ-మిలాద్ ఊరేగింపుల కోసం పోలీసులు భద్రతా ఏర్పాట్లను కఠినతరం చేయాలని కరాచీ అదనపు ఇన్‌స్పెక్టర్ జనరల్ పోలీసులను ఆదేశించినట్లు కరాచీ పోలీసులు తెలిపారు.