Oct 17,2023 07:25

రవి తన పుట్టినరోజు వేడుకకు కొంత మంది మిత్రులను, కథల తాతయ్యను పిలిచాడు. సాయంత్రం ఆరు గంటలకల్లా స్నేహితులంతా వచ్చారు. కాసేపటి తరువాత కథల తాతయ్య వచ్చారు. ఆయనకు రవి తల్లిదండ్రులు స్వాగతం పలికారు. అసలు ఆయన పేరు సూర్యం మాస్టారు. ఖాళీ సమయం దొరికితే పిల్లలంతా ఆయన వద్దకు చేరేవారు. మాస్టారు మంచి నీతి కథలను చెప్పి, ఆ కథలను నోట్‌ బుక్‌లో రాయమనే వారు. అలా చేయడం వల్ల తెలుగు భాష మీద సులువుగా పట్టు వస్తుందని చెప్పేవారు.
పుట్టినరోజు కోసం వచ్చిన అతిథులకు, స్నేహితులకు భోజనాలు ఏర్పాటు చేశారు రవి నాన్న. రవి స్నేహితులు అతనికి బహుమతులు ఇచ్చారు. కథల తాతయ్య కొన్ని నీతి కథల పుస్తకాలను ఇచ్చి రవిని ఆశీర్వదించారు. 'రవి నీతో పాటు నీ మిత్రులు కూడా ఈ పుస్తకాలను చదివేలా చేయాలి' అన్నారు. 'అలాగే తాతయ్య!' అన్నాడు రవి.
'పిల్లలూ కాసేపట్లో భోజన కార్యక్రమం మొదలవుతుంది మీరంతా శ్రద్దగా వినండి అన్నం ఎంతో విలువైంది. వృధా కానివ్వకండి. తక్కువ వడ్డించుకుని తృప్తిగా తినండి. మీరు తినగా మిగిలిన పదార్థాలను ఎవరికైనా పంచండి. నేను వస్తున్నప్పుడు ఇక్కడికి దగ్గరగా ఓ పెద్ద భవంతి కడుతున్నారు. అక్కడ పనివాళ్లతో పాటు వాళ్ల పిల్లలు కూడా ఉన్నారు. ఇక్కడ మిగిలిపోయిన ఆహారం వారికి తీసుకెళ్లి పెట్టండి. సంతోషిస్తారు' అని చెప్పారు తాతయ్య. 'సరే తాతయ్య..' అంటూ పిల్లలు భోజనకార్యక్రమం పూర్తిచేశారు.
పాతిక మందికి అని తెచ్చిన భోజనాలు మరో పదిహేనుమందికి సరిపడా మిగిలాయి. 'తాతయ్యా! ఈ పదార్థాలు ఉన్న గిన్నెలను తీసుకు వెళ్లి వారికి ఇచ్చే కంటే వారినే ఇక్కడకు రమ్మంటే బాగుంటుంది కదా?' అన్నాడు రవి. 'చాలా బాగుంటుంది. అలాగే వెళ్లి పిలుచుకొద్దాం పద!' అన్నారు తాతయ్య. ఆ పిల్లలు వచ్చి చక్కగా తిని రవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి వెళ్లారు. ఇదంతా చూసిన రవి స్నేహితులు, 'తాతయ్య! మా పుట్టిన రోజు వేడుకలను కూడా ఇదే పద్ధతిలో చేసుకుంటాం' అన్నారు. 'చాలా సంతోషం పిల్లలూ.. భోజనాలు వృధా కాకుండా మీరు ఎప్పుడూ ఇలాగే చేయండి.. సరేనా' అన్నారు కథల తాతయ్య.
 

- యు.విజయశేఖర రెడ్డి,
99597 36475