
ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు) : ట్రిపుల్ రైడింగ్ లో వెళుతున్న బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం తెనాలిలో జరిగింది.
బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండల కేంద్రానికి చెందిన అభి, కిషోర్, ప్రేమ్ కుమార్ ముగ్గురు స్నేహితులు. తెనాలిలో బంధువుల ఇంట ఉన్న ప్రేమ్ కుమార్ ను కలిసేందుకు అభి, కిషోర్ ఆదివారం రాత్రి తెనాలికి వచ్చారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ముగ్గురు కలిసి తెనాలి నుంచి భట్టిప్రోలుకు వెళ్లడానికి బైక్ పై బయలుదేరారు. చెంచుపేట వైపు నుంచి ఫ్లైఓవర్ ఎక్కిన తరువాత అతివేగంగా ఉన్న బైక్ అదుపుతప్పి రోడ్డు డివైడర్ ని ఢీకొట్టింది. తీవ్రగాయాలపాలైన ఇద్దరు యువకులు అభి (21), కిషోర్ (19) ఘటనా స్థలంలోనే మృతి చెందగా, ప్రేమ్ కుమార్ కి గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి వెంటనే ప్రేమ్ కుమార్‌ను చికిత్స నిమిత్తం తెనాలి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరు యువకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అభి హైదరాబాదులో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడని, కిషోర్ గుంటూరు మిర్చి యార్డులో ముఠా కార్మికుడని తెలిసింది.