Sep 20,2023 09:25

వాషింగ్టన్‌ : కుటుంబ వ్యాపార కార్యకలాపాలపై అధ్యక్షుడు జో బైడెన్‌పై సాగుతున్న అభిశంసనా విచారణలో భాగంగా ప్రతినిధుల సభలోని రిపబ్లికన్లు వచ్చే వారం మొదటి విచారణ చేపట్టనున్నారు. సెప్టెంబరు 28న ఈ విచారణ జరగనుంది. బైడెన్‌ కుమారుడు హంటర్‌ విదేశీ వ్యాపారాల్లో బైడెన్‌ ప్రమేయం వుందంటూ వచ్చిన ఆరోపణలపై తలెత్తిన రాజ్యాంగ, చట్టబద్ధమైన ప్రశ్నలపై ఈ విచారణలో దృష్టి పెడతారని భావిస్తున్నారు. ఉపాధ్యక్షుడిగా వున్న హయాంలో బైడెన్‌ చర్యలు అవినీతి సంస్కృతికి నిదర్శనంగా కనిపిస్తున్నాయంటూ ప్రతినిధుల సభ స్పీకర్‌ కెవిన్‌ మెక్‌ కార్తె నేతృత్వంలో రిపబ్లికన్లు విమర్శిస్తున్నారు. కాగా అధ్యక్ష ఎన్నికల ప్రచారం మధ్యలో రిపబ్లికన్లు చేసిన ఈ ప్రయత్నాలను వైట్‌హౌస్‌ తీవ్రంగా విమర్శించింది. కేవలం రాజకీయం చేయడం కోసమే ఇదంతా చేస్తున్నారని వ్యాఖ్యానించింది. గత 9మాసాలుగా అధ్యక్షుడి కార్యకలాపాలపై దర్యాప్తు సాగుతునే వుంది.