Sep 06,2023 11:07

వాషింగ్టన్‌ (అమెరికా) : జి 20 సదస్సు కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ భారత పర్యటన చేయడం ఖాయమేనని అగ్రరాజ్య అధ్యక్ష భవనం శ్వేతసౌధం ప్రకటించింది. అయితే ఈ పర్యటన సమయంలో .... బైడెన్‌ కోవిడ్‌ మార్గదర్శకాలను పూర్తిగా పాటిస్తారని, మాస్క్‌లో కన్పిస్తారని తెలిపింది. ఇదిలా ఉండగా .... బైడెన్‌కు మంగళవారం కూడా వైద్యులు కోవిడ్‌ పరీక్షలు నిర్వహించి నెగెటివ్‌గా నిర్థారించారు.

                                 మీడియాకు శ్వేతసౌధం మీడియా కార్యదర్శి జీన్‌ పెర్రీ వివరణ...

'' అధ్యక్షుడి ఆరోగ్యాన్ని నిరంతం వైద్యులు పర్యవేక్షిస్తారు. ప్రస్తుతం ఆయనకు ఎలాంటి వైరస్‌ లక్షణాలు లేవు. భారత్‌కు బయలుదేరే ముందు బైడెన్‌, ఆయనతో పాటు వెళ్లే ప్రతినిధుల బఅందానికి మరోసారి కోవిడ్‌ పరీక్షలు చేయనున్నారు. పర్యటన సమయంలోనూ ఆయన అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఎల్లప్పుడూ మాస్క్‌ ధరిస్తారు '' అని శ్వేతసౌధం మీడియా కార్యదర్శి జీన్‌ పెర్రీ మీడియాకు తెలిపారు.

                                                 షెడ్యూల్‌ ప్రకారమే జి 20 సదస్సుకు హాజరు...

జో బైడెన్‌ భార్య జిల్‌ బైడెన్‌కు కూడా కోవిడ్‌ రావడంతో బైడెన్‌ భారత్‌ పర్యటనపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ప్రస్తుతం పరీక్షల్లో కోవిడ్‌ నెగెటివ్‌గా నిర్థారణ కావడంతో బైడెన్‌ పర్యటనలో ఎలాంటి మార్పు ఉండబోదని శ్వేతసౌధం తాజాగా వెల్లడించింది. షెడ్యూల్‌ ప్రకారమే భారత్‌లో జరిగే జి 20 సదస్సుకు బైడెన్‌ హాజరవుతారని మరోసారి స్పష్టం చేసింది. బైడెన్‌ ఢిల్లీ పర్యటన ముగించుకుని అక్కడి నుంచి వియత్నాంకు వెళ్లనున్నట్లు తెలిపింది. ఈ పర్యటనల్లో ఆయన సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) నిర్దేశించిన కోవిడ్‌-19 మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటిస్తారని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటారని వైట్‌హౌస్‌ వెల్లడించింది.