Sep 28,2023 16:37

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ (అన్నమయ్యజిల్లా) : భగత్‌ సింగ్‌ జయంతిని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహ సర్వేపల్లి డిమాండ్‌ చేశారు. గురువారం ఎస్‌ఎఫ్‌ఐ రాజంపేట కమిటీ ఆధ్వర్యంలో స్థానిక బాలుర వసతి గృహంలో భగత్‌ సింగ్‌ 116వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించి భగత్‌ సింగ్‌ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వార్డెన్‌ నరసింహారెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహ సర్వేపల్లి, మాట్లాడుతూ.. బ్రిటిష్‌ తెల్ల దొరలకు వ్యతిరేకంగా, పరాయి పాలన నుండి దేశ విముక్తి కోసం 23 సంవత్సరాల అతి చిన్న వయసులోనే ఉరికంబాన్ని ముద్దాడిన గొప్ప విప్లవ పోరాట యోధుడు భగత్‌ సింగ్‌ అని అన్నారు. హిందుస్థాన్‌ సోషలిస్ట్‌ రిపబ్లికన్‌ అసోసియేషన్‌లో చేరి.. దీనికి అనుబంధంగా భారత నవజవాన్‌ సభ స్థాపించి దేశంలోని యువకులను జాతీయత భావాలు, విప్లవ భావాలు, దేశభక్తి నేర్పి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా స్వాతంత్య్రం కోసం పోరాటం చేశారని తెలిపారు. అలాంటి గొప్ప వ్యక్తి యొక్క చరిత్రను నేడు బిజెపి ప్రభుత్వం కర్ణాటకలో భగత్‌ సింగ్‌ చరిత్రను పాఠ్యపుస్తకాల నుండి తీసివేయడం సిగ్గుచేటన్నారు. బిజెపి ప్రభుత్వానికి నిజమైన దేశభక్తి, జాతీయత భావాలు ఉంటే భగత్‌ సింగ్‌ కి భారతరత్న అవార్డు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. యువత, విద్యార్థులు భగత్‌ సింగ్‌ ఆశయాలతో విద్యార్థుల సమస్యలు పరిష్కారం కొరకు, ఉద్యోగ సాధన కొరకు పోరాటాలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు గోవర్దన్‌, సురేంద్ర , సాయి ,మధు, లవకుమర్‌, సురేష్‌ ,రవి హాస్టల్‌ విద్యార్థులు పాల్గొన్నారు.