Oct 06,2023 11:32

ముంబయి : బాలీవుడ్‌ ప్రముఖ నటుల చుట్టూ బెట్టింగ్‌ యాప్‌ ఉచ్చు బిగుసుకుంటోంది. మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కేసుకు సంబంధించి బాలీవుడ్‌ హీరోయిన్‌ శ్రద్ధా కపూర్‌ కు కూడా ఈడీ సమన్లు అందాయి. శుక్రవారమే ఆమె విచారణకు రావాలని ఈడీ తెలిపినట్లు సమాచారం. అయితే ఆమె విచారణకు హాజరవుతారా ? లేదా ? అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఇదే కేసుకు సంబంధించి ఈడీ సమన్లు అందుకున్న రణ్‌బీర్‌ కపూర్‌ కూడా ఈరోజు రారుపుర్‌లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో హాజరు కావాల్సి ఉంది. కాగా, ఆయన రెండు వారాల సమయం కోరినట్లు సమాచారం. ఇక, కపిల్‌ శర్మ, హూమా ఖురేషి, హీనా ఖాన్‌ను వేర్వేరు తేదీల్లో ప్రశ్నించనున్నట్లు తెలిసింది.

ఈ కేసులో 15మంది సెలబ్రిటీలు.. త్వరలోనే నోటీసులు..!

మహాదేవ్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ ప్రమోటర్లు సౌరభ్‌ చంద్రకర్‌, రవి ఉప్పల్‌ 70-30 నిష్పత్తి ప్రకారం లాభాల్లో వాటా ఇస్తామని వివిధ దేశాల్లో బీటర్లను నియమించుకున్నారు. ఈ యాప్‌ కార్యకలాపాలు యూఏఈ ప్రధాన కేంద్రంగా సాగుతున్నట్లు ఈడీ విచారణలో తేలింది. సౌరభ్‌, రవి ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అయితే బాలీవుడ్‌ నటులంతా ఆన్‌లైన్‌లో యాప్‌ను ప్రచారం చేసి.. అందుకు బదులుగా ప్రమోటర్ల నుంచి డబ్బు అందుకున్నారన్నది ఈడీ అభియోగం. ఈ కేసులో 14 నుంచి 15 మంది సెలబ్రిటీలు, నటుల పాత్ర ఉన్నట్లు ఈడీ అనుమానిస్తోంది. మిగతా వారికి కూడా త్వరలోనే నోటీసులు జారీ చేసే అవకాశముంది.