ఆప్యాయంగా సైకిల్‌ని తడిమేడు వరప్రసాద్. ఈనాటిదా, ఇలాటి అలాటి సైకిలా?
'ఏరా ప్రసాదూ.. సైకిల్ చూసుకొని మురిసిపోతున్నావు? ఏం గుర్తొచ్చిందో?' అంతరాత్మ అడిగింది.
'ఏం గుర్తుకురావాలి? నిత్యం తలచుకుంటున్న వాడికి?' కఠినంగా చెప్పాడు వరప్రసాదు అంతరాత్మకి.
కాదూ మరి.. ఏది మరచిపోతాడని?
చిన్నప్పుడు పొట్టి సైకిల్ తాతగారు పుట్టినరోజుకి బహుమానంగా ఇస్తే, వరప్రసాద్ మురిపంగా తొక్కుతూ ఉంటే స్నేహుతులు కృష్ణుడు, రంగారావు కనిపెట్టి, వరప్రసాదుని బురిడీలు కొట్టి.. వాడి సైకిల్ ఎక్కి వాళ్ళే మార్చి మార్చి ఎక్కుతూ, తొక్కుతూ ఉంటే.. ఏడుస్తూ 'కృష్ణా, రంగా.. ఒక్కసారి నా సైకిల్ నాకు ఇవ్వండిరా, తొక్కి మళ్ళా మీకు ఇస్తానుగా' అంటూ ఉంటే వాళ్ళమ్మ పైకి వచ్చి అందరినీ కోప్పడి, వరప్రసాద్‌కి వాడి సైకిల్ వాడికి ఇప్పించింది.
'వరం.. సైకిల్ నీది. వాళ్ళు నిన్ను బతిమాలాలి. నువ్వు అలా వాళ్ళదగ్గర ఏడవకూడదు' అంటూ వాడి హక్కు ఏమిటో వాడికి చెప్పింది. టెన్త్‌లో ఫస్టుక్లాస్ వస్తే తండ్రి దగ్గర పట్టుపట్టి సైకిల్ కొనిపించుకున్నాడు.
తండ్రి సైకిల్ తొక్కడం నేర్పేందుకు వెనకాలే పరిగెడుతూ, మొదట పెడల్ మీద కాలు పెట్టి సైకిల్ ఎక్కడం, నడుపుతూ, టర్న్ తిప్పడం, అవసరం అయితే టక్కున ఆపడం, బెల్ నొక్కడం ప్రతిదీ నేర్పించాడు.
'వరం బ్యాలెన్స్ చేయగలగాలి సుమీ' అని హెచ్చరించేవాడు.
రమ వెక్కిరింపుగా 'సైకిల్ సైకిల్ సా అప్పల సామీ పో' అంటూ పాట పాడేది.
వెర్రి సైకిల్ ఎంత ఉపయోగపడిందని? తల్లి చెప్పే సరకులు తేవాలన్నా, తండ్రిని ఆఫీసులో దింపాలన్నా, స్నేహితులని కలవాలన్నా ఈ సైకిలే.. బికామ్ ఆఖరు సంవత్సరం చదువుతూ ఉంటే తండ్రి హార్ట్ ఎటాక్ వచ్చి పోయేడు. తల్లిని, చెల్లినీ తమ్ముడినీ తనే ఓదార్చాడు.
ఇంత సంసారం బాధ్యతా తనే పడ్డాడు. 'అమ్మా.. అన్నయ్య తెలివైనవాడు. ఎలా అయినా ఫస్టు క్లాసులో పాసవ్వగలడు. నాన్నగారు ఉద్యోగం చేసే దగ్గర నువ్వు నా పేరు రికమెండ్ చెయ్యమ్మా..' ఇంటర్ పాసయిన కాశీపతి మాటలకి వరప్రసాదే సపోర్ట్ చేశాడు. కాశీపతి గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అయ్యాడు. వరప్రసాద్ చదువే ఆగిపోయింది. తల్లి చాలా బాధపడింది. అయినా ఆమె మనసులో ఏదో వెలితి.
వరప్రసాద్ ప్రైవేటు కంపెనీలో జాయినయ్యాడు. నాలుగేళ్ళు గడిచిపోయాయి. కాశీపతి చూస్తుండగానే స్కూటర్ కొనుక్కున్నాడు. ప్రమోషన్ కూడా వచ్చింది. తల్లికి వచ్చిన పెన్షన్ అతనే తీసుకుంటాడు. తల్లి కూతురు రమకి పెళ్ళి చేయాలని సంకల్పించింది. కట్నాల అందుకునేలా లేవు. దగ్గర బంధువు హనుమాయమ్మ ఒక ప్రపోజల్ తెచ్చింది.
వాళ్ళకి దూరపు బంధువైన పేరుమోసిన లాయరుగారికి కూతురు, కొడుకూ ఉన్నారు. ఆ అమ్మాయిని కాశీపతికి చేసుకొని, రమని వాళ్ళబ్బాయికి ఇస్తే బాగుంటుంది. వాళ్ళు ఇందుకు సముఖంగా ఉన్నారు.
'ప్రసాదుకి చేయకుండానా?' సందేహించింది తల్లి. హనుమాయమ్మ తిట్టింది. 'సిరికి మోకాలు అడ్డుపెడుతున్నావు వదినా.. ప్రసాదు మొగపిల్లాడు. ఇట్టే పెళ్ళయిపోతుంది. రమ మొహం చూసి మాట్లాడు. మన కాశీపతి అందం, బుద్ధి చూసి మోజు పడుతున్నారు తప్పితే, మనం వాళ్ళ గేటు దాకా అయినా వెళ్ళగలమా?'
కాశీపతి ప్రసూనని చేసుకునేందుకు సమ్మతం చూపించాడు. ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి.
ప్రసూన రమ వస్తే ఆదరంగా చూస్తుంది. కానీ, పెళ్ళికాని బావగారి ఉనికి ఆమెకి నచ్చలేదు. అందునా ప్రసూన తండ్రి కూతురు కోసం ఓ ఇల్లు ఇచ్చాడు.
ఎవరితోనూ చెప్పించుకోకుండా వరప్రసాదే బయట ఒక రూమ్ తీసుకొని వెళ్లిపోయాడు. వరప్రసాద్ వెళ్లిపోతుంటే, తల్లి కుమిలి కుమిలి ఏడ్చింది. 'అరే, ఏమిటిది? ఇప్పుడేమైందని అమ్మా? ఆదివారాలు వస్తూనే ఉంటానుగా!' అని తల్లిని ఓదార్చి, నవ్వుతూ బయల్దేరేడు, కానీ అతని గుండెల్లోంచి మంట లేస్తున్నది. అతనికి మొదటినుంచీ ఇల్లంటేనే చాలా ఇష్టం. అతని స్నేహితులు కొంచెం పెద్దయిన దగ్గర నుంచీ, స్నేహితులూ సినిమాలూ అని తిరిగేవారు. అందరూ కలిసి కాఫీ హోటల్లో దూరడం, జోకులూ కబుర్లతో గడిపేవారు.
ఆదివారం అంటే సరేసరి. పొద్దుటే కాఫీ తాగి బయటకి వస్తే, అందరూ కలిసి ఏదో హోటల్లో టిఫిన్ తినటం, మార్నింగ్ షో చూసి హోటల్లోనే భోజనం చేయటం, మళ్ళా మేట్నీ చూసి, సాయంత్రం పార్కులో చేరి నవ్వుల కాలక్షేపం చేయడం.. ఒకసారి మాత్రం వాళ్ళ బలవంతం మీద వెళ్ళిన, వరప్రసాద్ రెండోసారి వెళ్ళలేదు.
తనకి వీలుకాదని తప్పించుకున్నాడు. అతనికి ఇంట్లో తల్లి, చెల్లి, తమ్ముడితో గడపడం అంటేనే తగని ఇష్టం. తల్లికి నీళ్ళు తోడి, గిన్నెలు సర్ది సాయం చేసేవాడు. ఇంటికి పిన్ని లేక అత్తాలాంటి చుట్టాలు వస్తే పండగే అతనికి.
ఆడవాళ్ళ కబుర్లు వినడం.. వాళ్ళ మమతలూ, ప్రేమలూ అనుభూతులూ తనూ పొందుతూ వాళ్ళని గౌరవిస్తూ ఉండేవాడు. తల్లి గుమ్మం ముందు వేసిన ముగ్గు తన్మయుడై చూసేవాడు.
ఆవకాయలు పెట్టే రోజుల్లో తల్లికి ప్రతిపనిలో సాయం చేసేవాడు. పండగలకి పులిహోర కలపడం, పూర్ణం ఉండలు చేయడం ఇష్టంగా చేసేవాడు.
కాశీపతి వెక్కిరించేవాడు. 'ఆ ఆడంగిపనులు నీకెందుకన్నా?' అనేవాడు. వరప్రసాద్‌కి ఆ మాటే నచ్చేది కాదు.
'చెయ్యడం ఆడంగి అయితే తినడం మగతనమా? అయినా ఆడవాళ్ళ పేరుతో, వాళ్ళని అవమానించేలా ఈ భాష ఏమిటి?' ఇలా జవాబు చెప్తే కాశీపతికి సమ్మతపడలేదు.
ఇంత కమ్మటి ఇంటి వాతావరణం వదిలి, మోడులా ఒక్కడూ ఉండడం ఎంత కష్టం?
అలాగని తనది కాని ఇంట్లో ఎలా ఉండగలడు? తల్లిని తమ్ముడు చూడగలడేమో? బావగారికి చెయ్యాల్సిన అవసరం మరదలికి లేదు కదా! తల్లికి వరప్రసాద్‌కి పెళ్ళవ్వలేదని బెంగ.
'వాడికి పిల్లని ఎవరిస్తారమ్మా.. డొక్కు సైకిలూ వాడూ, పోనీ బండీ కొనిద్దామన్నా కూడా నేర్చుకోడు' విసుగ్గా అన్నాడు కాశీపతి.
'పోనీ నేను వెళ్ళి వాడితో ఉంటానురా' అంది ఏడుపు గొంతుతో.
వరప్రసాదే వద్దనేశాడు. అతను అద్దెకి ఉన్నది ఒక గది. కామన్ బాత్‌రూమ్. నీళ్ళు తోడుకోవాలి. తల్లి ఇబ్బందులు పడడం వరప్రసాద్‌కి ఇష్టం లేదు. పైకి అలా అనలేదు. 'అమ్మా.. నేనే పొద్దుట వెళ్ళి ఏ రాత్రికో వస్తాను. ఇప్పుడు కాదులే. తాపీగా వద్దువుగానీ' అనేశాడు.
'అందరూ బాధ్యతలు పడరు. దానికి కాస్త సంస్కారం కూడా ఉండాలి' కాశీపతి హేళనగా పెళ్ళాంతో అనడం తల్లి విననే విన్నది. కాశీపతికి తల్లి పెన్షన్ మీద మోజు ఎక్కువని ఆమె తల్లి మనసుకి బోధపడలేదు.
వరప్రసాద్ ఒంటరి అయ్యాడని అత్తగారేకాక బంధువులూ అనుకోవడం ప్రసూనకీ తెలిసింది.
ఆమె చురుకుగా ఆలోచించింది. వరప్రసాద్‌కి పెళ్ళి అయిపోతే తనకీ, బంధువుల్లో మంచిపేరొస్తుంది. అత్తగారు సంతోషిస్తుంది. అన్నింటికన్నా, ఈ ఆదివారాలనీ, పండగలనీ అత్తగారు కొడుకుని రమ్మనడం తగ్గుతుంది.
ప్రసూన తమకి దూరపు చుట్టం అని ఓ అమ్మాయిని కుదిర్చింది. తల్లి సంతోషం చూసి వరప్రసాద్ కాదనలేకపోయాడు.
పేదింటి పిల్ల అయిన రాణీ తల్లితండ్రులు తమ కూతురికి ప్రసూన అండదండలు ఉంటాయని తెగ ఆశ పడ్డారు. ఏకంగా ప్రసూన ఇంట్లోనే మకాం పెట్టొచ్చని రాణీ ఆశపడింది.
ప్రసూన రాణీ తల్లితో గడుసుగా, 'ఎక్కడ ఎవరం ఉంటే ఏం పిన్నీ.. కలుస్తూ ఉండమా?' అంది. రాణీకి ఈ మాట తెలీదు. వరప్రసాద్ చిన్న ఇంటికి కాపురానికి వచ్చి, రాణీ తెల్లబోయింది. ప్రసూన ఇంట్లో ఉండొచ్చని ఆశపడ్డ ఆమెకి అసంతృప్తి ఎక్కువయింది. అసలే తక్కువ జీతం, దానికి తోడు రమ పెళ్ళికి అప్పులు అయ్యాయని అతనే తీర్చాలని కాశీపతి కొంత అప్పచెప్పాడు.
రాణీ కోపం పరాకాష్ఠకి చేరింది. వరప్రసాద్ ఆలోచనలకి బ్రేక్ పడేలా పిలుపు.
'అన్నా..' పిలుపు విని తలెత్తి చూశాడు వరప్రసాద్. 'మా పిల్ల అన్నా ఇది. పచ్చకామెర్లు. పదిమైళ్ళ పక్కూర్లో పసరు మందు ఇస్తారు. మా ఆయన ఊళ్ళోలేరు. నిన్న పడిపోయేనన్నా, కాలు నొప్పిగాఉంది. నడవలేను. టైముకి అక్కడ ఉంటేనే మాష్టారు పసరు మందు ఇస్తారు. కొంచెం రామాపురం తీసుకెళతావా?' సైకిలు వైపు ఆశగా చూస్తూ అంది.
'ఫరవాలేదా అమ్మా, ఇద్దరూ కూచోగలరా?' ఆపేక్షగా అడిగేడు వరప్రసాద్. 'పదన్నా..' క్షణం ఆలోచించకుండా కూతురుని కూచోపెట్టిందామె. వరప్రసాద్ సంతోషంగా, జోరుగా సైకిలు నడిపి, ఆమె చెప్పిన చోటకి చేర్చాడు.
'దేవుడిలా తెచ్చావన్నా.. రథంలో కూర్చొని వచ్చినట్టు వచ్చాం అన్నా' దండం పెడుతూ అన్నది ఆమె.
'అమ్మా పనిచేసుకొని రా. మళ్ళా మీ ఇంటి దగ్గర దింపేస్తాను' అన్నాడు వరప్రసాద్. ఆమె తటపటాయిస్తూ ఉంటే
'అన్న దగ్గర చెల్లికి మొహమాటం ఎందుకమ్మా? వెళ్ళి మందు తెచ్చుకురా' మృదువుగా అని పక్కకి వెళ్ళాడు. గంట తరవాత తల్లీ కూతుళ్ళనిద్దరినీ వాళ్ళింటి దగ్గర సైకిలు మీద దింపాడు వరప్రసాద్. టీ పెట్టి ఇచ్చింది ఆమె.
వరప్రసాద్ బయలుదేరుతుంటే 'విమానం ఎక్కినా ఇంత సంతోషం రాదన్నా.. సొంతన్నలాగా తీసుకెళ్ళావు. నీ సైకిల్ ఇవాళ నా బిడ్డ ప్రాణాలు కాపాడింది' అంది ఆప్యాయంగా.
వరప్రసాద్ హుషారుగా సైకిలు ఎక్కి, ఇంటికి చేరాడు. తనకీ, తన సైకిల్‌కీ గొప్ప గౌరవం దక్కిన ఆనందం. లోకం గొడ్డు పోలేదు. సైకిలూ వాహనమే, తనూ మనిషే..
లేకపోతే, 'డొక్కు సైకిలు మీద తిరిగే నీదీ ఓ బతుకేనా?' అంటూ ఈసడించే రాణీ రాత్రికి రాత్రి ఎవరితోనో వెళ్లిపోయింది.
ఆమె తల్లితండ్రుల వేధింపులూ, అవమానాలూ తట్టుకోలేక వరప్రసాదు పక్కనే ఉన్న చిన్న ఊరులో ఇంకో ఉద్యోగం చూసుకొని వెళిపోయాడు. మాజీ భార్య వెక్కిరించిన ఈ సైకిలే ఈ రోజు ఒక పాపకి పూల రథం అయింది. ఒక తల్లికి వరదేవత అయింది. తన సైకిలు వైపు గర్వంగా చూసి, లోపలికి వెళ్ళాడు వరప్రసాద్.
మంగు కృష్ణకుమారి
9553486346