- 'స్కిల్'కేసులో పూర్తి స్థాయి బెయిల్
- సిఐడి ఆరోపణలకు ఆధారాల్లేవు
- ప్రధాన కేసు జోలికి వెళ్లడం లేదు
- తుది తీర్పు ఎసిబి కోర్టు ఇవ్వాలి
- బెయిల్ ఉత్తర్వుల్లో హైకోర్టు
ప్రజాశక్తి- అమరావతి : స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో నిందితుడైన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి పూర్తి స్థాయి బెయిల్‌ను హైకోర్టు సోమవారం మంజూరు చేసింది. ఈ మేరకు జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇరుపక్షాల వాదనల తర్వాత హైకోర్టు ఈ నెల 16న హైకోర్టు తీర్పు రిజర్వు చేసిన సంగతి తెలిసిందే. బెయిల్ మంజూరు చేయాలన్న అనుబంధ పిటిషన్‌పై సోమవారం తామిచ్చిన తీర్పులో కేసు పూర్వాపరాల్లోకి వెళ్లడం లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. గతంలో కంటికి శస్త్ర చికిత్స నిమిత్తం మధ్యంతర బెయిల్ పొందిన చంద్రబాబుకు ఈ సారి పూర్తి స్థాయి బెయిల్ లభించింది. మధ్యంతర బెయిల్ సందర్భంగా జారీ చేసిన బెయిల్ బాండ్ ఆధారంగా ఆయనను విడుదల చేయాలని న్యాయమూర్తి ఆదేశాల్లో పేర్కొన్నారు.
గతంలోని షరతులను కూడా సడలించారు. సడలింపు ఉత్తర్వులు ఈ నెల 29 నుంచి అమల్లోకి వస్తాయని చెప్పింది. వైద్య నివేదికలను ఈ 7 నుంచి 28వ తేదీ లోపు రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌కు కాకుండా విజయవాడ ఎసిబి కోర్టులో నివేదించాలని ఆదేశించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబుకు బెయిల్ ఇచ్చేందుకు ఎసిబి ప్రత్యేక కోర్టు బెయిల్ నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
'2021లో కేసు నమోదుకు ముందే సిఐబి 140 మందికి పైగా సాక్ష్యులను విచారించింది. 4 వేల పేజీల పత్రాలను సేకరించింది. చంద్రబాబు పిఎ పెండ్యాల శ్రీనివాస్ సిఐడి ఎదుట హాజరుకాలేదనే కారణం పిటిషనర్ బెయిల్ మంజూరుకు అడ్డంకి కాబోదు. మధ్యంత బెయిల్ ఉత్తర్వుల తర్వాత పిటిషనర్ సాక్షులను ప్రభావితం చేశారనే అభియోగాలు కూడా సిఐడి చేయలేదు. సాక్ష్యాలను తారుమారు చేసినట్లు కూడా ఆరోపించలేదు. దర్యాప్తును అడ్డుకున్నట్లుగా కూడా సిఐడి వాదించలేదు. ఈ పరిస్థితుల్లో పిటిషనర్ చంద్రబాబు పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేస్తున్నాం' అని ఉత్తర్వుల్లో ధర్మాసనం పేర్కొంది.
'బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా పూర్తిస్థాయి సాక్ష్యాన్ని పరిశీలించాల్సిన అవసరం లేదు. ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలున్నాయా లేదా అన్నది మాత్రమే చూడాలి. మళ్లించిన రూ.370 కోట్లను చంద్రబాబు నగదు రూపంలో తీసుకున్నారనేందుకు ఎలాంటి ఆధారాలను చూపలేదు. 2014 జూన్ 1 నుంచి .2018 డిసెంబర్ 31 వరకు బ్యాంకు ఖాతాల లావాదేవీల వివరాలను బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్‌ల నుంచి తీసుకున్నట్లు సీఐడీ చెప్పింది. ఈ దశలో నిధులు తిరిగి తెలుగుదేశం బ్యాంకు ఖాతాలకు చేరాయని తుది నిర్ణయానికి రాలేం. నిధుల మళ్లింపు విషయంలో సిఐడి. ప్రాథమిక ఆధారాలను సమర్పించలేదు. సీమెన్స్‌కు చెందిన సుమన్ బోస్, డిజైన్ టెకు చెందిన ఖన్వీల్కర్ మధ్య వాట్సాప్, ఎస్‌ఎంఎస్ మెసేజ్‌ల్లో కరెన్సీ నోట్ల నెంబర్లు స్కిల్ కేసుకు సంబంధించనవి అని చెప్పేందుకు ఆధారాలు కూడా లేవు.' అని ధర్మాసనం తెలిపింది. అయినప్పటికీ ప్రధాన కేసును విజయవాడ ఎసిబి కోర్టు సిఐడి అభియోగాలపై విచారణ జరిపి తీర్పు చెప్పాల్సివుంది' అని హైకోర్టు పేర్కొంది.
'సీమెన్స్ కు నిధుల విడుదలపై ఆర్థిక శాఖ అభ్యంతరం చెప్పినప్పటికీ నాటి సీఎం ఆదేశాల మేరకు సీఎస్ నిధులు విడుదల చేసినట్లుగా సీఐడీ అభియోగం. అయితే ఈ తరహా అధికారం సీఎంకు లేదని సీఐడీ చెప్పడం లేదు. నిధుల విడుడల చేసినంతమాత్రాన అవినీతి జరిగినట్లుగా భావించేందుకు వీల్లేదు. పిటిషనర్ పాత్ర ఉన్నట్లు కాదు. సబ్ కాంట్రాక్టర్ల ఎగవేతకు చంద్రబాబును బాధ్యుడిగా చేయడం సరికాదు. షౌజయత్ ఖాన్ అనే వ్యక్తి సీఐడీ ముందు ఇచ్చిన వాంగ్మూలం, సీమెన్స్ ఎండీ మాథ్యు థామస్ ఈడీ ముందు ఇచ్చిన వాంగ్మూలాల్లో ఎక్కడా కూడా నేరంలో పిటిషనర్ పాత్రకు ఆధారాలు చూపలేదు. ఈ దశలో పిటిషనర్‌కు పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేస్తున్నాం.' అని న్యాయమూర్తి పేర్కొన్నారు. 'అయితే, ప్రధాన కేసు జోలికి వెళ్లడం లేదు. మినీ ట్రయల్ నిర్వహించాల్సిన అవసరం లేదు. అంతిమంగా కింది కోర్టు నిర్ణయించాలి. ఇది పూర్తిగా కోర్టు విచక్షణపై ఆధారపడిన ఉత్తర్వులు. పిటిషనర్ మినహా మిగిలిన నిందితులందరికీ ఇప్పటికే బెయిల్/ముందస్తు బెయిల్ మంజూరు అయ్యింది. దీనిని కూడా దృష్టిలో పెట్టుకుని పిటిషనర్‌కు పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేస్తున్నాం. 'అని బెయిల్ ఉత్తర్వుల్లో న్యాయమూర్తి పేర్కొన్నారు.