- 20న న్యాయస్థానం ముందు హాజరు కావాలని ఢిల్లీ కోర్టు ఆదేశం
న్యూఢిల్లీ : లైంగికదాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిజెపి సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి షానవాజ్ హుస్సేన్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈనెల 20న కోర్టు ముందు హాజరు కావాలని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ వైభవ్ మెహతా ఆదేశించారు. 2018 ఏప్రిల్‌లో హుస్సేన్ తనను ఫామ్‌హౌస్‌కి తీసుకెళ్లి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి తనపై లైంగికదాడి చేశాడని బాధితురాలు ఆరోపించింది. మేజిస్ట్రేట్ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించారు. ఆ తర్వాత షానావాజ్ హుస్సేన్ ఈ ఉత్తర్వును ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశారు. గతేడాది ఆగస్టులో హైకోర్టు హుస్సేన్ పిటిషన్‌ను కొట్టివేసింది. ఇప్పుడు అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ పోలీసులు ఇచ్చిన నివేదికను తోసిపుచ్చారు. విచారణ సమయంలో మహిళ వాదనల విశ్వసనీయతను పరీక్షించవచ్చని చెప్పారు.










