ఎన్నికల ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా పరిణమించిన ఎలక్టొరల్ బాండ్ల విధానాన్ని సమర్థించుకోడానికి సుప్రీం కోర్టులో మోడీ ప్రభుత్వం చేసిన వాదనలు ప్రజల పట్ల దాని జవాబుదారీ రాహిత్యానికి అద్దం పడుతున్నాయి. ఎలక్టొరల్ బాండ్ల విధానం పారదర్శకతతో కూడుకున్నదని ఒక వైపు చెబుతూనే మరో వైపు ఆ బాండ్లను ఇచ్చిన వారి పేర్లను తెలుసుకునే హక్కు ప్రజలకు కానీ, ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు కానీ లేదని ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ వినిపించిన వాదనలో హేతుబద్ధత కొంచెం కూడా కనిపించడం లేదు. రాజకీయ పార్టీలు విరాళాలు స్వీకరించే విధానం దోషరహితంగా ఉండాలని సాక్షాత్తూ సర్వోన్నత న్యాయస్థానమే వ్యాఖ్యానించిందంటే ప్రస్తుత ఎన్నికల బాండ్ల వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా ఉందో అర్థమవుతోంది. ఆశ్రిత పెట్టుబడిదారీ వ్యవస్థలో క్విడ్ ప్రోకోకు సాధనంగానే బిజెపి దీనిని తీసుకొచ్చిందనేది నిర్వివాదాంశం. ఎలక్టొరల్ డెమొక్రసీలో పోటీ చేసే రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు సమాన అవకాశాలు లభించేలా చూడాల్సిన ఎన్నికల సంఘానికి ఈ ఎలక్టొరల్ బాండ్లపై ఎలాంటి నియంత్రణ కానీ, పర్యవేక్షణ కానీ లేకుండా చేయడం ఈ బాండ్ల విధానంలోని మరో పెద్ద లోపం. నల్లధనాన్ని, విదేశీ కంపెనీలతో కుదుర్చుకునే డీల్స్‌లో ముడుపులు ఎలక్టొరల్ బాండ్ల రూపంలో అధికార పార్టీకి అందేలా చూసుకోవచ్చు. ఈ విరాళాల గురించి సమాచార హక్కు చట్టం కింద తెలుసుకునే హక్కును కూడా నిరాకరిస్తుంది. లొసుగుల పుట్ట అయిన ఈ విధానంలో పారదర్శకత ఉందని ప్రభుత్వం చెప్పడం ఈ శతాబ్దంలోనే అతిపెద్ద జోక్! ఆరేళ్ల క్రితం ఎలక్టొరల్ బాండ్ల విధానాన్ని ప్రభుత్వం ఆమోదించుకున్న తీరు అత్యంత వివాదాస్పదమైంది. కీలకమైన ఈ బిల్లును లోక్‌సభలో తనకు ఉన్న మెజార్టీతో ఆమోదించుకున్న మోడీ ప్రభుత్వం, రాజ్య సభలో తనకు మెజార్టీ లేనందున ఆర్థిక బిల్లు పేరుతో ఎగువ సభకు పంపకుండా నేరుగా రాష్ట్రపతి ఆమోదానికి పంపింది. ఎలక్టొరల్ బాండ్ల చట్టబద్ధతను ప్రశ్నిస్తూ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఎడిఆర్), సిపిఐ(ఎం), మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం రాజకీయ పార్టీలకు ఎలక్టొరల్ బాండ్ల ద్వారా వచ్చిన విరాళాల పూర్తి వివరాలను రెండు వారాల్లోగా తనకు అందజేయాలని ఆదేశించింది.
ఎలక్టొరల్ బాండ్ల విధానాన్ని ప్రవేశపెట్టిన తరువాత మొదటి విడతలో 95 శాతం విరాళాలు బిజెపికే దక్కాయి. ఏ పార్టీకి ఎవరు ఎంత విరాళం ఇచ్చారో పేర్లు బయటికి వెల్లడి కావు. కానీ, అధికారంలో ఉన్న పార్టీకి ఈ విరాళాల డేటా మొత్తం అందుబాటులో ఉంటుంది. మిగతా ఏ రాజకీయ పార్టీకి ఆ వివరాలు తెలిసే అవకాశమే లేదు. కాబట్టి ప్రతిపక్షాలకు బాండ్లు ఇచ్చే వ్యక్తులను, సంస్థలను టార్గెట్‌గా పెట్టుకుని ఇడి, ఐటి వంటి వాటిని ఉసిగొలిపేందుకు అధికార పార్టీకి అవకాశమిస్తుంది. గత ఆరేళ్ల అనుభవం దీనినే రుజువుచేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇదే అంశాన్ని సూటిగా అడిగేసరికి ప్రభుత్వం బిక్కమొగం వేసింది. ఎడిఆర్ బయటపెట్టిన వివరాల ప్రకారం 2017 - 22 మధ్య రూ.9208 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లు అమ్ముడైతే- అందులో సగం కన్నా ఎక్కువ రూ.5271 కోట్లు (57 శాతం) బిజెపి ఖాతాలోకి చేరాయి. రెండోస్థానంలో ఉన్న కాంగ్రెస్‌కు అందిన విరాళాలు రూ.952 కోట్లు మాత్రమే! మిగతా మొత్తంలో కొంత కొంత దేశంలోని వివిధ ప్రాంతీయ పార్టీలకు చేరింది.
తొమ్మిదేళ్ల పాలనలో బిజెపి కార్పొరేట్లకు అనేక రూపాల్లో లబ్ధిని చేకూర్చి పెట్టింది. రుణాలను మాఫీ చేసి, రాయితీలను పెంచి, ప్రభుత్వ ఆస్తులను ఉదారంగా ధారాదత్తం చేసి ... శత కోటి సంపన్నుల సేవలో సంపూర్ణంగా తరించిపోయింది. బిజెపికి అత్యధిక విరాళాలు అందడానికి ఇదొక ముఖ్య కారణం. కోవిడ్ సమయంలో పిఎం కేర్ పేరిట సేకరించిన కోట్లాది రూపాయల విరాళాల విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం ఇలాంటి దాపరికాన్నే పాటించింది.
తరచూ నీతిసూత్రాలు వినిపించే బిజెపి...విరాళాల అంశంలో పారదర్శకత పాటించటానికి ఎందుకు భయపడుతోంది? తన నిధుల మూలాలు తెలిస్తే-ఆశ్రిత పెట్టుబడిదారులతో తన గాఢానుబంధం బయటపడుతుందనే బెరుకు కావొచ్చు. 2019 ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టటానికి, అభ్యర్థులను వశపర్చుకోవటానికి, రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయడానికి ఈ బాండ్లను అది ఒక సాధనంగా వాడుకుంది. ఇప్పుడు కూడా అదే పని చేస్తోంది. దానికి దోహదపడే విధంగా రాజ్యాంగ సంస్థలను, విధివిధానాలనూ పునర్నిర్మిస్తోంది. విరాళాలపై పారదర్శకత పాటించకుండా, దాపరికమే తన విధానంగా ప్రవర్తించటం బిజెపి దివాళాకోరు తనానికి, నీతిరాహిత్యానికి ఒక గట్టి ఆనవాలు. ఈ ధోరణి ప్రజాస్వామ్య విలువలకు పెను సవాలు.