Aug 30,2023 20:43

న్యూఢిల్లీ: యాక్సిస్‌ బ్యాంక్‌ మినిమం బ్యాలెన్స్‌ అవసరం లేకుండా ప్రత్యేకంగా సేవింగ్స్‌ ఖాతాను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే, ఈ ఖాతా కోసం ఖాతాదారులు నెలకు రూ.150 చెల్లిస్తే సరిపోతుందని బ్యాంకు పేర్కొంది. లేదంటే ఏడాదికి రూ.1,650 చెల్లించవచ్చని పేర్కొన్నారు. దీనికి 'ఇన్ఫినిటీ సేవింగ్స్‌ ఖాతా' నామకరణం చేసింది. అకౌంట్‌ హౌల్డర్లకు ఎస్‌ఎంఎస్‌ ఛార్జీలతో పాటు మరే ఛార్జీలు ఉండవని యాక్సిన్‌ బ్యాంక్‌ పేర్కొంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం యాక్సిస్‌ బ్యాంకుతో సహా అన్ని బ్యాంకుల్లో సేవింగ్‌ అకౌంట్‌ కోసం మినిమం బ్యాలెన్స్‌ ఉండాలనే నిబంధన ఉన్నది. ఆయా అకౌంట్లలో డబ్బులు లేకపోతే జరిమానా సైతం విధిస్తుంటాయి. దాంతో పాటు ఎస్‌ఎంఎస్‌, పాస్‌బుక్‌ ప్రింటింగ్‌ తదితర సేవలకు ఛార్జీలు సైతం వసూలు చేస్తుంటాయి. ఈ క్రమంలో ప్రత్యేకంగా అకౌంట్‌ను తీసుకువచ్చినట్లు చెప్పింది. ముఖ్యంగా డిజిటల్‌ సేవలను అధికంగా వినియోగించే వారిని దష్టిలో పెట్టుకొని స్పెషల్‌గా ఖాతాను రూపొందించినట్లు పేర్కొంది. ఏటీఎం ద్వారా అమౌంట్‌ విత్‌డ్రా తదితర సేవలకు ఎలాంటి పరిమితి ఉండబోదని బ్యాంక్‌ రిటైల్‌ లయబిలిటీస్‌ అధిపతి రవి నారాయణ్‌ తెలిపారు. కొత్త అకౌంట్‌కు కనీస బ్యాలెన్స్‌ అవసరం లేదన్నారు. దేశీయ లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలుండవని, చెక్‌బుక్‌ల వినియోగం, లావాదేవీలపై ఎలాంటి చార్జీలు ఉండవని ఆయన వివరించారు.