
సాధారణ పౌరుడు ఏమి ఆలోచిస్తాడు? మన స్వతంత్ర సమరయోధులు చేసిన త్యాగాలా? ప్రధాని చెప్తున్న ప్రగతా? దేశం ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లా ? నిత్య జీవితంలో ఎదురయ్యే ఇక్కట్లా? సామాన్య మనిషి ఆశలు, ఆకాంక్షలు పాలకులకు అర్ధమవుతాయా? తన అభిప్రాయాలు పాలకులకు తెలిపే అవకాశం సగటు మనిషికి వుందా? తన వేదన ఎవరికి నివేదన చేయగలడు ? తన ఆవేదనను ఎవరు ఆలకిస్తారు? తన మనోవేదనను ఎవరు తీరుస్తారు ?
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకునే వేళ సగటు పౌరుడి మనసులో వుండే ఆలోచనలేమిటి? సాధారణ భారతీయుడు ఈ రోజును పండగగానే చూస్తున్నాడా? మనసు నిండా దేశభక్తి నిండి వుందా? ప్రధాన మంత్రి ఎర్ర కోట నుంచి హావభావాలతో చేసే ప్రసంగం సగటు పౌరుడికి అర్ధమవుతుందా లేక ఊకదంపుడు ఉపన్యాసంగానే మిగిలిపోతుందా? సగటు పౌరుడు అంటే ఎవరు? ఎవరి మొఖానా సగటు పౌరుడు అని రాసి వుండదు. మీరు, నేను అందరం సగటు పౌరులమే (పండితులైనా, పామరులైనా, కిసాన్ అయినా, జవాన్ అయినా, ఆఫీసరైనా, గుమాస్తా అయినా). సంపాదనలో తారతమ్యాలు వుండొచ్చు. జీవన విధానంలో మార్పులు వుండవచ్చు. కానీ అందరం సామాన్య మనుషులమే. అందరి ఆశలు, ఆకాంక్షలు దాదాపుగా ఒకటే. అది ఎవరి స్థాయికి తగ్గట్టు వారు మెరుగైన జీవితం కోసం పడే ఆరాటం, చేసే పోరాటం. అదే జీవన తరంగం. కొద్ది మంది ఈ పోరాటంలో నెగ్గుతారు, కోట్లాదిమంది ఈ ఆరాటంతోనే అశువులు బాస్తున్నారు.
మన దేశంలో జీవితాన్ని చాలా వరకు ప్రభుత్వమే శాసిస్తుంది. అభివృద్ధి కుంటుపడ కుండా, సంక్షేమ కార్యక్రమాలు అమలు చెయ్యటమే ప్రధాన ధ్యేయంగా చెబుతుంది ప్రభుత్వం. సంక్షేమం అంటే ప్రభుత్వానికి పెద్ద పాత్ర ఉందని అర్ధం. సంక్షేమం అనగానే మనకి గుర్తొచ్చేది బడుగు బలహీన వర్గాల ప్రజలు. ప్రజలందరి సంక్షేమం ప్రభుత్వ ధ్యేయమే అయినా సంక్షేమం అనగానే సమాజంలో అట్టడుగు వర్గాల వారే మొదటి ధ్యేయం. ఈ వర్గాలవారికి కనీస అవసరాలు తీర్చుకునే శక్తి ఉండదు. ఎందుకంటే వీరు కడు పేదరికంలో బతుకు బండిని నెట్టుకొస్తుంటారు. చదువు వుండదు, ఆస్తిపాస్తులు వీరు ఎరుగరు. కడుపు నిండా తిండి, ఒంటి నిండా బట్ట, తల దాచుకోవటానికి నీడ అనేవి సమాజంలో అట్టడుగు వర్గాల వారికి నెరవేరని కనీస కోరికలు. ఏ ప్రభుత్వమైనా వీరి సంక్షేమానికే పాటుపడుతున్నామనీ, వీరి అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నామని చెబుతుంది. కానీ అది ఆచరణలో ఏ మాత్రం సాధ్యమైంది, ఎంత మందికి చేయూతనిచ్చింది ?
స్వతంత్ర దినోత్సవం నాడు పొద్దున్నే ప్రధాన మంత్రి ఎర్ర కోట మీద నుంచి దేశ ప్రజలనుద్దేశించి రాచరికాన్ని తలపించే రీతిలో ఉపన్యసిస్తారు. దేశం సాధించిన ప్రగతి, సాధించవలసిన లక్ష్యాలు, ఎదుర్కొంటున్న సమస్యల మీద మాట్లాడతారు. తన సారథ్యంలో ప్రభుత్వం సాధించిన ఘనత గురించి గొప్పగా చెబుతారు. కానీ ఈ ఉపన్యాసంతో ఎంతమంది కనెక్ట్ అవుతారు? సాధారణ పౌరుడు ఏమి ఆలోచిస్తాడు? మన స్వతంత్ర సమరయోధులు చేసిన త్యాగాలా? ప్రధాని చెప్తున్న ప్రగతా? దేశం ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లా? నిత్య జీవితంలో ఎదురయ్యే ఇక్కట్లా? సామాన్య మనిషి ఆశలు, ఆకాంక్షలు పాలకులకు అర్ధమవుతాయా? తన అభిప్రాయాలు పాలకులకు తెలిపే అవకాశం సగటు మనిషికి వుందా? తన వేదన ఎవరికి నివేదన చేయగలడు? తన ఆవేదనను ఎవరు ఆలకిస్తారు? తన మనోవేదనను ఎవరు తీరుస్తారు ?
ఎర్ర కోట నుంచి ప్రధాని వల్లె వేసే గణాంకాలతో నిండిన ప్రగతి కబుర్లు, భావోద్వేగంతో చెప్పే అభివృద్ధి కథలకు, సగటు మనిషి జీవితానికి ఏమైనా సంబంధం వుందా? ప్రభుత్వ ప్రకటనల్లో, ప్రధానమంత్రి ఉపన్యాసంలో పేర్కొనే వృద్ధి రేటుతో సగటు మనిషి జీవితం మెరుగుపడిందా? ఇవి చాలామందిని వేధిస్తున్న ప్రశ్నలు. దీనికి ఎవరు సమాధానం ఇవ్వగలరు? వృద్ధి రేటు పెరగటంతో సగటు మనిషి జీవనంలో గణనీయమైన మార్పులు వచ్చాయి? ఇది చదువుకున్నవారికీ అర్ధంగాని ప్రశ్న.ఏమి చదివుకున్నారో చెప్పని నాయకులకు ఏం అర్ధమవుతుంది వృద్ధి రేటు కథ? మనం సాధించామని చెబుతున్న ప్రగతితో సామాన్యుడిలో రేపటి గురించిన అభద్రత తగ్గిందా? మనం సాధించిన అభివృద్ధితో నేడు సగటు మనిషి అన్నంలో టొమాటో పప్పు తినగలుగుతున్నాడా? ప్రగతి అంకెలు, వృద్ధి రేటు కథలూ ప్రజలకు అర్ధం కాకపోవటానికి అసలు కారణం ఆ కథలు నిజ జీవితానికి కడు దూరంగా వుండటమే !
మనం స్వతంత్ర దేశంగా అభివృద్ధి చెందలేదని కాదు ఇక్కడ వాదన. స్వతంత్రం వచ్చిన నాటికి నేటికీ మన దేశ స్థితిగతుల్లో గణనీయమైన మార్పు వచ్చిన మాట కాదనలేని నిజం. నదులకు ఆనకట్టలు కడుతున్నాము, విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాము, వ్యవసాయానికి సాగునీరు అందిస్తున్నాము. దేశంలో చాలా వరకు విద్యత్ సదుపాయం విస్తరించింది. ఒకనాడు సంపన్నుల ఇంట వుండే వంటగ్యాస్ ఇప్పుడు అందరికీ అందుబాటులో వుంది (బండ ఖరీదు బండెడు భారంగా మారింది. అది వేరే విషయం). జాతీయ రహదారులను అభివృద్ధి చేసుకున్నాము. రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నాము. రాజధాని, శతాబ్ది, వందే భారత్ లాంటి అధునాతన రైళ్లను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నడుపుతున్నాం. విమానాశ్రయాలు కడుతున్నాం. అంతరిక్షంలోకి విదేశాల ఉపగ్రహాలను కూడా పంపే స్థాయికి ఎదిగాం. చందమామ మీద కాలు మోపాలని ఆశపడుతున్నాం. ఇంటర్నెట్ వాడుతున్నాం, ప్రపంచంలో ఏ మూల ఏం జరుగుతున్నదో ఇట్టే తెలుసుకోగలుగుతున్నాం. నేడు ప్రపంచం మన వాణి వింటుంది. ఇది గర్వించదగ్గ ప్రగతి. సందేహం లేదు. కానీ, ఇది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అన్ని ప్రభుత్వాల సమిష్టి కృషి ఫలితం. చరిత్ర ఘనతను విస్మరించేవారు ఘనమైన చరిత్రను సృష్టించలేరన్నది చారిత్రక సత్యం.
మనం సాధించిన ప్రగతి సమాజంలోని అట్టడుగు వర్గాలైన రిక్షా కార్మికుడు, రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారి, నాలుగు ఇళ్లలో పాచి పని చేస్తే గానీ జరగుబాటు లేని 'పనిమనిషి', మురికివాడలో బతికే జీవి, రెక్కాడితేగాని డొక్కాడని వ్యవసాయ కూలీ లాంటి కోట్లాది మంది ప్రజల జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేయగలిగింది? ఈ ప్రశ్నకు సంతృప్తికరమైన సమాధానం లేదు. మన ప్రగతి ఫలాలు అట్టడుగు వర్గాలకు అందటం లేదన్న విషయాన్ని మనం అంగీకరించాలి. ముందు సమస్య ఉందని ఒప్పుకుంటేనేగదా సమస్యకు పరిష్కారం వెతకగలం. మనం సాధించిన అభివృద్ధి కొన్ని వర్గాలకే పరిమితమైంది. అన్ని వర్గాలవారికి ప్రగతి ఫలాలు అందించటంలో మనం విఫలమయ్యామని ఒప్పుకోవాలి. మనం మాట్లాడుకుంటున్న అట్టడుగు వర్గాల ప్రజలు వందే భారత్ రైలు ఎక్కగలరా? విమానాశ్రయం దరిదాపులకు పోగలరా? జాతీయ రహదారుల్లో కార్ల మీద తిరగగలరా? వీరికి ఆధునిక వైద్యం అందుబాటులో ఉందా? ఆధునిక విద్య అందుబాటులో ఉందా? విద్య వలన దిగువ మధ్య తరగతి వారు కొందరు మధ్య తరగతిలో కలిసిపోయారు, మధ్య తరగతివారు కొందరు ఎగువ మధ్య తరగతిలో కలిసిపోయారు, ఎగువ మధ్యతరగతి వారు కొందరు సంపన్నుల్లో కలిసిపోయారు, సంపన్నుల్లో కొందరు బ్యాంకులను మోసం చేసి దేశం వదిలి పారిపోయారు! మరి కొందరు దేశంలోనే వుండి కేంద్రంలో అధికార పార్టీలో చేరి వారి నేరాలను కడిగేసుకున్నారు! ఇదే కదా మన ప్రగతి కథ! విద్య వలన అట్టడుగు వర్గాలు ఇంకా తమ స్థితిగతులను మార్చుకోలేక పోతున్నాయి. మరి, అట్టడుగు వర్గాలకు చెందిన కోట్లాదిమంది జనులు ప్రభుత్వ ప్రగతి నివేదికలతో ఏ విధంగా కనెక్ట్ అవుతారు? అధికారులు పేదలను సంప్రదించకుండా, పేదలతో నిమిత్తం లేకుండా పేదరిక నిర్మూలన కోసం ఎక్కడో దూరాన ఏసీ గదుల్లో కూర్చొని పథకాలు రచిస్తుంటే పేదరికాన్ని ఎలా ఓడించ గలం? నిజానికి, సమాజంలో పేదరికం ఉండటం పాలకులకు అవసరం. పేదరికం ఉంటేనేగదా దానిని నిర్మూలించేది? మన పాలకులకు పేదరికాన్ని కాపాడటం చాలా అవసరం !
అట్టడుగు వర్గాలవారి అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు రూపొందించామని అదేపనిగా చెబుతారు నాయకులు, అధికారులు. కానీ ఈ పథకాలకూ వీటిని ఉద్దేశించిన ప్రజలకు మధ్య ఎంతో అంతరం వుంది. దీన్ని పూడ్చలేక పోతున్నాము. దానికి కారణం పథకాలను రూపొంచించేవారికి లబ్ధిదారుల అవసరాల పట్ల అవగాహన లేకపోవటమే. మన సమస్యలు అన్నిటికీ ఐఏఎస్ అధికారులే పరిష్కారం అనే ఆలోచన నుంచి బయటపడలేకపోతున్నాము. దానికి సమాధానం లేక విరుగుడుగా ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు వెదజల్లుతున్నాము. కొన్ని రాష్ట్రాల చట్ట సభలకు మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఆ తరువాత వచ్చే ఏడాది మొదటి సగభాగంలో పార్లమెంటుకు కూడా ఎన్నికలు వస్తాయి. డబ్బు పంపిణీ చేసే పండగ సీజను. ఇది హామీల సీజను కూడా. నది లేకపోయినా బ్రిడ్జి నిర్మిస్తామని హామీలు గుప్పించేవి రాబోయే రోజులు. పోయినసారి ఎన్నికలప్పుడు ఏం హామీలిచ్చారు, వాటిని ఏ మేరకు నెరవేర్చారు, ఇప్పడు ఇచ్చే హామీలు నెరవేర్చటానికి వీలైనవా లేక స్వర్గానికి నిచ్చెనలేసే విధంగా ఉన్నాయా అని నిశితంగా పరిశీలించాల్సిన చైతన్యం మనకు ఉండాల్సిన సమయమిది. అందుకే ప్రజాస్వామ్యంలో ఎన్నికల సమయం ప్రజలకు చాలా కీలకం. ఇప్పుడు గనక మనం జాగ్రత్త వహించకపోతే వచ్చే ఐదేళ్ళు నోరు మెదిపే అవకాశముండదు. ఎందుకంటే మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజలు నేతలను నిలదీసి అడగగలిగేది ఎన్నికలప్పుడే. ఓటును అమ్ముకుంటే నిలదీసి అడిగే నైతిక హక్కు వుండదు. ఐదు వేళ్లతో ఐదేళ్లు నోటికి తాళం వేసుకోవాల్సిందే !
మనకి ప్రజాస్వామ్యం కొత్త. రాజ్యాంగ పాలన కొత్త. రాజ్యాంగం, హక్కులు, బాధ్యతల గురించి లోతైన అవగాహన లేదు మనకు. పుట్టుకతోనే వివక్షను వారసత్వపు బహుమతిగా పొందే వ్వవస్థ మనది. మనిషిని మనిషిగా గౌరవించి, బాధ్యతలు తెలుసుకొని, హక్కులను, కాపాడుకుంటామో అప్పుడే ప్రజాస్వామ్యానికి నిజమైన పండగ. మన ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అంతరం తగ్గుతుంది. అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతాయి. ప్రజలు స్వతంత్ర దినోత్సవ వేడుకలు, గణతంత్ర దినోత్సవ వేడుకలకు నిండు మనసుతో సులభంగా కనెక్ట్ అవుతారు. మనలో జాతీయతా వాదాన్ని బలపరచటానికి, ప్రపంచంలో మనం గౌరవప్రదమైన స్థానం పొందటానికి ఇదే సరైన మార్గం. అంతేగానీ ప్రజలు పేదరికం నుంచి బయట పడాలని కోరుతుంటే పాలకులేమో అయోధ్యలో మందిరం నిర్మిస్తాం, ఆర్టికల్ 370ని రద్దు చేశాం, ఏకరూప పౌర స్మృతిని తెస్తాం, హిందీని బలవంతంగా నేర్పుతాం...అనేది వితండవాదం. ఇవి అనుత్పాదక అంశాలు. వీటివలన ఎవరి కడుపూ నిండదు. ఈ ఉన్మాదంతో జాతీయతా భావం బలపడుతుందా, పలచబడుతుందా? ఆలోచించవలసిన అవసరం ఎంతైనా వుంది. భారత్ అనేది ఒక వైవిధ్యభరితమైన భావన. విభిన్న జీవన విధానాలు విలసిల్లుతున్న ఈ భరత భూమి మీద రాజ్య విధానం ఎవరి గౌరవానికీ భంగం కలిగేలా వుండదు అన్న విశ్వాసాన్ని ప్రజల్లో నింపడం చాలా అవసరం. అప్పుడే మనం ఒక జాతిగా ఐకమత్యంతో ముందుకెళతాం. కానీ పాలకులు దీన్ని అర్ధం చేసుకోవటం లేదు. ఈ సత్యాన్ని అర్ధం చేసుకోవటంలోనే వుంది ప్రజాస్వామ్యానికి అర్ధం, పరమార్ధం. అప్పుడే మువ్వన్నెల జండాకి గౌరవం, జాతికి గర్వం. ఇదే నేడు సగటు మనిషి మదిలో మెదిలే ఆలోచన. ఈ వ్యాసానికి నేపథ్యం కూడా సగటు మనిషి ఆలోచనలే.
(వ్యాసకర్త లోక్‌సభ సచివాలయంలో మాజీ డైరెక్టర్)
గుమ్మడిదల రంగారావు