ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : యాంత్రీకరణలో సర్కారీ సబ్సిడీ భాగాన్ని ముందు రైతులే పెట్టుకోవాలని, తన వద్ద నిధులున్నప్పుడు సబ్సిడీ రీయింబర్స్ చేస్తామని రాష్ట్రప్రభుత్వం కొత్త మెలిక ముందుకు తెచ్చింది. వ్యవసాయ యాంత్రీకరణ పథకాల్లో రైతులకు యంత్ర పరికరాలను సరఫరా చేశాక కూడా ప్రభుత్వం తానివ్వాల్సిన రాయితీ సొమ్మును విడుదల చేయకపోవడంతో సప్లయర్స్ గగ్గోలు పెడుతున్నారు. కొత్తగా యంత్రాల సరఫరాకు ముందుకు రావట్లేదు. దాంతో యాంత్రీకరణ స్కీంలు నిలిచిపోతున్నాయి. ఇదే సమయంలో తన వాటా నిధులిస్తున్న కేంద్రం పథకాల అమలుకు రాష్ట్ర సర్కారుపై ఒత్తిడి పెంచింది. ఈ తరుణంలో అటు పథకాలు ఆగకుండా ఇటు నిధుల విడుదల విషయంలో తనకు వెసులుబాటు కలిగేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్త చిట్కా కనిపెట్టింది. ముందే సబ్సిడీ అమౌంట్ పే చేసేలా రైతులను ఒప్పించాలని అధికారులకు నిర్దేశించింది. ఈ నెలాఖరులోపు యాంత్రీకరణ పూర్తి చేయాలని ఆదేశించింది. అసలే సేద్యం అస్తవ్యస్తంగా తయారైన పరిస్థితుల్లో ప్రభుత్వం పెట్టుకోవాల్సిన సబ్సిడీ సొమ్మును చెల్లించేందుకు రైతులు ముందుకు రాకపోవడంతో యంత్రాంగం తలలు పట్టుకుంటోంది.
- ఒకేసారి సగం కట్టాలి
ప్రతి రైతు భరోసా కేంద్రం (ఆర్‌బికె) పరిధిలో ఒక యంత్ర సేవా కేంద్రం (కమ్యూనిటీ హైరింగ్ సెంటర్/సిహెచ్‌సి) నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. రాష్ట్ర వ్యాప్తంగా 10,750 ఆర్‌బికెలు టార్గెట్. దశలవారీగా వాటన్నింటికీ సిహెచ్‌సిలు ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్కో సిహెచ్‌సికి నలుగురికి తగ్గకుండా రైతులతో గ్రూపులు ఏర్పాటు చేశారు. ఒక్కో సిహెచ్‌సికి రూ.15 లక్షల విలువైన యంత్రాల కొనుగోలుకు అనుమతిచ్చారు. కొన్న యంత్రాలను గ్రూపు రైతులు తాము వినియోగించుకోవడంతో పాటు ఆర్‌బికె పరిధిలో మిగతా రైతులకు అద్దెకిచ్చి, వచ్చిన సొమ్ముతో బ్యాంక్ రుణం తిరిగి చెల్లించాలి. యూనిట్ విలువలో పది శాతం రైతులు, 50 శాతం బ్యాంక్ రుణం కాగా, ప్రభుత్వం 40 శాతం రాయితీ అన్నారు. కేంద్రానికి చెందిన ఆర్‌కెవివై, స్మామ్ వంటి పథకాలకు వచ్చే నిధులకు, రాష్ట్రం కొంత కలిపి సబ్సిడీ ఇస్తోంది. యూనిట్ కాస్ట్ రూ.15 లక్షలలో రైతులు సొంతంగా పది శాతం... అంటే రూ.లక్షా యాభై వేలు చెల్లించాలి. ప్రభుత్వ సబ్సిడీ రూ.ఆరున్నర లక్షలు (40 శాతం). ప్రభుత్వ షరతు ప్రకారం ఆ మొత్తాన్నీ రైతులే చెల్లించాలి. దాన్ని ప్రభుత్వం ఎప్పుడు రీయింబర్స్ చేస్తుందో తెలీదు. రైతులు అప్పు చేసి కడితే సర్కారు వడ్డీ ఇవ్వదు. వడ్డీ భారాన్ని రైతులే మోయాలి. ఇక ప్రభుత్వం రూ.ఏడున్నర లక్షలను బ్యాంకుల నుంచి రుణం ఇప్పిస్తామంటోంది. ఆ రుణాన్ని వడ్డీతో సహా బ్యాంకులకు రైతులే చెల్లించాలి. ఏతావాతా యంత్ర సేవా కేంద్రాల వలన రైతులకు నష్టం తప్ప లాభం లేదు.
- కంపెనీల ఒత్తిడితోనే...
యంత్రాలను సరఫరా చేసిన కంపెనీలకు ప్రభుత్వం సబ్సిడీ సొమ్ము సకాలంలో చెల్లించట్లేదు. పనిముట్లు సరఫరా చేసి, డబ్బుల కోసం కోర్టులకెక్కాల్సి వస్తోందని కంపెనీలు చెబుతున్నాయి. తమకు ముందు మొత్తం డబ్బులిస్తేనే యంత్రాలు సరఫరా చేస్తామంటున్నాయి. నిరుడు మే నాటికి కోట్లాది రూపాయల బకాయిలు ఇంకా అందలేదని వాపోతున్నాయి. మరో వైపు కేంద్ర నిధులు ఈ నెలాఖరుకు వెనక్కి వెళ్లేలా ఉన్నాయి. అందుకే మొత్తం డబ్బు ముందే చెల్లించి యంత్రాలు కొనుగోలు చేయాలని రైతులపై ఒత్తిడి పెంచింది సర్కారు. ఈ మొత్తం వ్యవహారంలో కంపెనీలకు బిజినెస్ వస్తుంది. కంపెనీల నుంచి ప్రభుత్వానికి చెందిన కొందరు పెద్దలు, ఉన్నతాధికారులకు కమీషన్లు, కిట్ బాగ్స్ అందుతాయి. యాంత్రీకరణ పథకం అమలైనట్లు ప్రచారం సాగుతుంది. ఎటొచ్చీ నష్టపోయేది రైతులే.










