- రెచ్చిపోతున్న ఇజ్రాయిల్ వత్తాసు పలికిన అమెరికా
- 1100 మందికి పైగా మృతి
- వేలాది మందికి గాయాలు
- రెండేళ్ల పసిపిల్లాడి కాల్చివేత
గాజాసిటీ : హమాస్‌పై ఇప్పటికే యుద్ధం ప్రకటించిన నెతన్యాహు ప్రభుత్వం గాజా సిటీపై ఒక వైపు వైమానిక దాడులను విస్తరించడమే గాక, ఆ ప్రాంతాన్ని పూర్తిగా దిగ్బంధించేందుకు ఆటవిక పద్ధతులను అనుసరిస్తోంది. మరో వైపు హమాస్, హిజ్బుల్లాలతో కలసి వీటిని ప్రతిఘటించే యత్నం చేస్తోంది. ఈ దాడులు, ప్రతి దాడుల్లో ఇరు వైపులా మొత్తం 1100 మందికిపైగా మరణించారు. వీరిలో 20 మంది దాకా చిన్నారులు ఉన్నారు ఇజ్రాయిల్ తాజా దాడుల్లో 413 మంది పాలస్తీనీయులు చనిపోయారని, 2,300 మంది గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేయగా, హమాస్ దాడుల్లో 700 మంది ఇజ్రాయిలీయులు చనిపోయారని ఆ దేశ రక్షణ శాఖ మంత్రి యెవ్ గలాంట్ తెలిపారు.మరో వైపు ఇజ్రాయిల్‌కు మద్దతుగా యుద్ధ నౌకలను, విమానాలను, ఇతర యుద్ధ సామగ్రిని పంపుతున్నట్లు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ప్రకటించారు. అమెరికా దన్ను చూసుకుని పేట్రేగిపోతున్న నెతన్యాహు ప్రభుత్వం ఇప్పుడు గాజాను పూర్తిగా దిగ్బంధిస్తానని ప్రకటించిం ది. గాజా ప్రజలకు కరెంట్, నీళ్లు, ఆహారం, ఇంధనం వంటివి అందకుండా పూర్తిగా దిగ్బంధిస్తామని గలాంట్ చెప్పారు. గాజా సరిహద్దు ప్రాంతాలపై ఇజ్రాయిల్ బలగాలు విచక్షణా రహితంగా వైమానిక దాడులు సాగిస్తున్నాయి. వెస్ట్‌బ్యాంక్‌లో మహ్మద్ హైతమ్ అల్ తమిమి అనే రెండేళ్ల పసి పిల్లవాడిని ఇజ్రాయిల్ బలగాలు కాల్పుల్లో చనిపోయాడు. ఇజ్రాయిల్ మర్డర్ మెషిన్‌కు ఇలా బలైన పసిపిల్లలెందరో ఉన్నారు. ఫాసిస్టు నెతన్యాహు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేయకపోగా, యుద్ధంలో ఇటువంటివి సహజమన్నట్లుగా మాట్లాడారు. ఇజ్రాయిల్ మిలిటరీ చీఫ్ ప్రతినిధి డేనియల్ హగారి మాట్లాడుతూ గాజాలోని అన్ని పట్టణాలను తిరిగి తమ అధీనంలోకి తెచ్చుకుంటామని అన్నారు. యుఎస్‌ఎస్ గెరాల్డ్ 'ఆర్', ఫోర్డ్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ యుద్ధ నౌకలు, గైడెడ్ మిస్సైల్ క్రూయిజర్లు, గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్లు మధ్యదరా సముద్ర తీరానికి పంపాలని బైడెన్ ప్రభుత్వం ఆదేశంచినట్లు వార్తలొస్తున్నాయి.
ఈ దాడుల్లో అనేక మంది హమాస్ సభ్యులు చనిపోతున్నప్పటికీ , ఆ సాయుధ గ్రూపు దక్షిణ ఇజ్రాయెల్‌లోని కెబ్బట్జ్ మేగాన్‌తో సహా కొత్త ప్రాంతాల్లోకి ప్రవేశించినట్లు వాడా వార్తా సంస్థ తెలిపింది.కాఫర్ ఆసాతో సహా గాజా సరిహద్దులోని ఎనిమిది కేంద్రాల్లో హమాస్‌తో పోరు కొనసాగు తోందని ఇజ్రాయిల్ రక్షణ దళాల అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇదిలా వుండగా లెబనీస్ సరిహద్దు నుంచి హిజ్బుల్లా సాయుధ గ్రూపు జరిపిన దాడిలో మూడు ఇజ్రాయెల్ సైనిక పోస్టులు ధ్వంసమయ్యాయి. హమాస్‌కు హిజ్బుల్లా మద్దతు ఇజ్రాయెల్‌కు గట్టి దెబ్బ. బందీలను రక్షించడానికి మధ్యవర్తిత్వం వహించడానికి ఇజ్రాయెల్ ఈజిప్టుతో సంప్రదింపులు జరుపుతున్నట్లు రాయిటర్ వార్తా సంస్థ తెలిపింది. ఇంకో వైపు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హమాస్ నేతలతో చర్చలు జరిపారు.