Sep 22,2023 10:12

శాన్‌ ఫ్రాన్సిస్కో : అమెరికా శాన్‌ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌పై గత మార్చిలో దాడి చేసిన ఖలిస్థానీ సానుభూతిపరులలో 10 మంది నిందితుల ఫొటోలను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) గురువారం విడుదల చేసింది. దాడికి పాల్పడిన వారిపై అప్పట్లో 'చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యుఎపిఎ) సహా ఆయా సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, ఎన్‌ఐఎ విచారణ ప్రారంభించింది. నిందితులను గుర్తించేందుకు సహకరించాలని, వారి గురించి ఏమైనా సమాచారం ఉంటే తమతో పంచుకోవాలని ప్రజలను కోరింది. ఖలిస్థాన్‌ సానుభూతిపరుడు, 'వారిస్‌ పంజాబ్‌ దే' నాయకుడు అమృత్‌పాల్‌ సింగ్‌ అరెస్టుకు భారత్‌లో ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు పలు దేశాల్లో ఖలిస్థాన్‌ సానుభూతిపరులు దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారు. ఈ క్రమంలోనే మార్చిలో కొంతమంది ఖలిస్థాన్‌ అనుకూలవాదులు.. శాన్‌ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌లో విధ్వంసానికి పాల్పడ్డారు. జులై 1వ తేదీ రాత్రి సైతం.. అధికారులు లోపల ఉండగానే, కొంతమంది నిందితులు కాన్సులేట్‌లోకి చొరబడి నిప్పంటించడానికి ప్రయత్నించారని ఎన్‌ఐఎ పేర్కొంది. తాజాగా అక్కడి భారత దౌత్యకార్యాలయంపై దాడులకు పాల్పడినట్లు భావిస్తున్న నిందితుల ఫొటోలు విడుదల చేసింది. ప్రస్తుతం కెనడాలో 20 మంది ఖలిస్తానీ-గ్యాంగ్‌స్టర్లు తలదాచుకుంటున్నారని ఎన్‌ఐఎ ప్రకటించింది. ఇదిలా ఉండగా.. శాన్‌ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌పై దాడి జరిగిన సమయంలోనే.. కెనడాలోని దౌత్యకార్యాలయం వద్ద కూడా ఖలిస్థానీ మద్దతుదారులు దుశ్చర్యలకు పాల్పడ్డారు. దీనిపై స్థానిక కెనడా హైకమిషనర్‌నుంచి భారత్‌ వివరణ కోరింది.