
- మీడియా మొత్తాన్ని బిజెపి కబళించింది
ప్రజాశక్తి-తిరువనంతపురం : భారత దేశంలో ప్రశంసలు తప్ప విమర్శనాత్మక జర్నలిజం అవసరం లేదని న్యూస్‌క్లిక్‌పై దాడుల ద్వారా మోదీ ప్రభుత్వం తేల్చి చెప్పిందని కేరళ మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ వ్యాఖ్యానించారు. కేరళలో, బెదిరింపులు, ఒత్తిడి వ్యూహాలను ఉపయోగించి దాదాపు అన్ని మీడియా సంస్థలను బిజెపి తన గుప్పిట్లోకి తెచ్చుకుంది. భారత దేశంలో నేటికీ వెన్నెముక ఉన్న మీడియా సంస్థలు ఉన్నాయి. బెదిరింపుల ద్వారా వాటిని లొంగదీసుకోవాలన్నది బిజెపి ఎత్తుగడ. బిబిస, న్యూస్ లాండ్రీ, దైనిక్ భాస్కర్, భారత్ సమాచార్, ది కశ్మీర్ వాలా , ది వైర్ వంటి మీడియా సంస్థలపై దాడులు చేసిన తర్వాత, ఈడి ఇప్పుడు న్యూస్‌క్లిక్ పై పడిందని ఐజాక్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
న్యూస్‌క్లిక్‌పై వచ్చిన ఆరోపణ ఏమిటంటే అది విదేశీ డబ్బును అంగీకరించింది. ఏదైనా చట్టవిరుద్ధమైన చర్య జరిగితే, ఖచ్చితంగా దర్యాప్తు చేసి, విచారించండి. కానీ ఇక్కడ అలా జరగలేదు. యుఎపిఎ కింద కేసు నమోదు చేశారు. విభాగాలు ఏమిటి? ముఖ్యమైనది సెక్షన్ 153ఎ. ఇది రెండు సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రేరేపించేందుకు సంబంధించినది. న్యూస్‌క్లిక్‌పై అలాంటి కేసు పెట్టడం బిజెపికే చెల్లింది. ఈ ఆన్‌లైన్ పోర్టల్‌పై నమోదు చేసిన మరో సెక్షన్ 120బి. ఇది నేర పూరిత కుట్రకు సంబంధించినది.
సమాజంలో విభజనకు కుట్ర పన్నింది ఎవరు? తీస్తా సెతల్వాద్, రచయిత్రి గీతా హరిహరన్, న్యూస్‌క్లిక్ కార్యకర్తలు డి రఘునందన్, ప్రబీర్ పుర్కాయస్థ, రచయితలు పరంజోరు గుహా ఠాకుర్తా , ఊర్మిళేష్ తదితరులు. వీరిలో, రఘునందన్, ప్రబీర్ 1970ల మధ్యకాలం నుండి సన్నిహిత మిత్రులు. ఎస్‌ఎఫ్‌ఐలోను, తరువాత సైన్స్ ఉద్యమంలోను వీరు కలిసి పనిచేశారు.
శాస్త్రీయ విజ్ఞానాన్ని ప్రచారానికి కృషిచేశారు. సమకాలీన వైజ్ఞానిక పరిణామాలను మార్క్సిస్ట్ దక్పథంతో విశ్లేషించడానికి ప్రయత్నించేవారు. ఫ్రీ సాఫ్ట్‌వేర్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా, ఢిల్లీ సైన్స్ ఫోరమ్ మరియు ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్‌వర్క్ యొక్క ప్రముఖ నాయకులలో ప్రబీర్ పుర్కాయస్థ ఒకరు. ఎమర్జెన్సీ సమయంలో ఏడాదిపాటు జైలు జీవితం గడిపారు. న్యూస్‌క్లిక్‌పై ప్రభుత్వం నిరంతరం దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో గత నెలలో తిరువనంతపురంలో ఫ్రీ సాఫ్ట్‌వేర్ ఉద్యమం నిర్వహించిన ఫ్రీడమ్ ఫెస్ట్ సదస్సులో ప్రబీర్ పాల్గొన్నారు.
న్యూస్‌క్లిక్ అనేది రైతుల కార్మికుల సమ్మెలను క్రమం తప్పకుండా కవర్ చేసే మీడియా సంస్థ. 2018లో మహారాష్ట్రలోని నాసిక్ నుంచి ముంబయి వరకు జరిగిన కిసాన్ లాంగ్ మార్చ్‌ను జాతీయ దష్టికి తీసుకురావడంలో వీరు కీలక పాత్ర పోషించారు. 2020-21లో ఢిల్లీలో ఏడాది పొడవునా రైతుల సమ్మె గురించి అత్యంత ఖచ్చితమైన వార్తలు, విశ్లేషణలను నిరంతరం ప్రచురించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం న్యూస్ క్లిక్‌ను వేటాడడం ప్రారంభించింది.
న్యూస్‌క్లిక్‌పై అనేకసార్లు దాడులు జరిగాయి, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేయబడ్డాయి, కానీ అవేవీ నిరూపించబడలేదు. వీరిద్దరూ ఆరోపించినట్లుగానే ఈ దాడి కేంద్ర ప్రభుత్వ దుష్ట పన్నాగంలో భాగమేనని తెలుస్తోంది. పట్టపగలు 30 కేంద్రాల్లో సమాంతర దాడులు నిర్వహించి, ప్రముఖ జర్నలిస్టులను రహస్య కేంద్రాలకు తీసుకెళ్లి విచారించారు. యుఎపిఎను ప్రయోగించి విమర్శకుల నోర్మూయించడమే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వ ఎత్తుగడ.
ప్రజాస్వామ్యం , మీడియా స్వేచ్ఛపై నమ్మకం ఉన్న మిత్రులందరూ సంఘీభావం తెలిపేందుకు ముందుకు రావాలని మనవి.
'ఇండియా' వేదిక ఖండన
న్యూస్ క్లిక్‌పై జరుగుతున్న దాడులు, సోదాలను ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా) పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ఈ తరుణంలో మీడియాకు, రాజ్యాంగబద్ధంగా రక్షణ కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛకు అండగా నిలబడతామని ఆ పార్టీలు ప్రకటించాయి. ఈ మేరకు ఆ పార్టీలు ఒక ప్రకటన జారీ చేశాయి. గత తొమ్మిదేళ్లుగా మీడియాను అణచివేయడానికి దర్యాప్తు సంస్థలను ఉద్దేశ్యపూర్వకంగా మోడీ ప్రభుత్వం దుర్వినియోగపరుస్తోందని విమర్శించాయి. ఆశ్రిత పెట్టుబడిదారులు మీడియా సంస్థలను స్వాధీనం చేసుకోవడానికి వీలు కల్పించడం ద్వారా మీడియాను తన ప్రచార బాకాలుగా మార్చుకునేందుకు బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఇండియా ఫోరమ్ విమర్శించింది. నిజాలు మాట్లాడే వ్యక్తిగత జర్నలిస్టులపై బిజెపి ప్రభుత్వం, దాని సైద్ధాంతిక సంస్థలు ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నాయని విమర్శించింది. నిష్పక్షపాతంగా రిపోర్టింగ్ చేయకుండా మీడియాను నియంత్రిస్తున్న సమాచార సాంకేతిక నిబంధనలు - 2021 వంటి తిరోగమన విధానాలను తీసుకువస్తోందని ఆ ప్రకటన విమర్శించింది.
జర్నలిస్టు సంఘాల ఖండన
న్యూస్ క్లిక్ ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థ, భాషా సింగ్, ఊర్మిళేష్, తీస్తా సెత్వలాద్, అభిసార్ శర్మ, అమిత్ చక్రవర్తి, సుబోధ్ వర్మతో సహా పలువురు జర్నలిస్టుల నివాసాలపై ఢిల్లీ పోలీసులు జరిపిన దాడులను జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. నేషనల్ అలయన్స్ ఆఫ్ జర్నలిస్ట్, ఢిల్లీ జర్నలిస్టుల యూనియన్, కేరళ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (ఢిల్లీ శాఖ)లు ఈ మేరకు ఒక ప్రకటన చేశాయి. మీడియా గొంతు నొక్కే ఇటువంటి యత్నాలను సహించబోమని జర్నలిస్టు సంఘాలు పేర్కొన్నాయి. ఒక మీడియా సంస్థకి చెందిన సిబ్బందిని ఇలా మూకుమ్మడిగా బెదిరించడం, దాడి చేయడం ఎక్కడా, ఎప్పుడూ వినలేదని తెలిపాయి. ప్రజల సమస్యల నుండి దృష్టిని మళ్లించేందుకు ఈ దాడులు అని విమర్శించాయి. కేంద్ర ప్రభుత్వం పాల్పడుతున్న ఈ వేధింపులను నిరసించాల్సిందిగా మీడియా సోదరులకు విజ్ఞప్తి చేశాయి.
న్యూస్ క్లిక్‌పై, జర్నలిస్టులపై దాడులను ది ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజెయు) అధ్యక్షులు కె.శ్రీనివాసరెడ్డి, సెక్రటరీ జనరల్ బల్విందర్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఎటువంటి ముందస్తు నోటీసులు, వారెంట్ లేకుండా అరెస్టులు చేయడం, దాడులు చేయడం, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్ వస్తువులను సీజ్ చేయడం జర్నలిస్టుల హక్కులకు భంగం కలిగించడమేనని పేర్కొన్నారు.
ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలతో ప్రభుత్వం ఒక ప్రకటన వెలువరించాలని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా (ఇజిఐ) డిమాండ్ చేసింది.
ఎన్‌ఎజె, ఎపిడబ్ల్యుజెఎఫ్, ఎపిబిజెఎ ఖండన
స్వతంత్ర న్యూస్ పోర్టల్ 'న్యూస్ క్లిక్' కార్యాలయాలపై, దానికి వార్తలు రాస్తున్న జర్నలిస్టులు, విశ్లేషకుల ఇళ్లపై ఢిల్లీ పోలీసులు అక్రమంగా జరుపుతున్న దాడులను నేషనల్ అసోసియేషన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఎన్‌ఎజె), ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఎపిడబ్ల్యుజెఎఫ్), ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ (ఎపిబిజెఎ) తీవ్రంగా ఖండించాయి. న్యూస్ క్లిక్‌పై బిజెపి ప్రభుత్వం అసత్య ఆరోపణలు చేస్తోందని విమర్శించాయి. ఉపా చట్టం కింద, నేరపూరిత కుట్రలకు పాల్పడుతున్నట్లు పలు కేసులు పెట్టడం గర్హనీయమని పేర్కొన్నాయి. ప్రభుత్వానికి ఇష్టం లేని వార్తలు ప్రసారం చేస్తున్నందునే ప్రముఖ పాత్రికేయుడు, రచయిత ప్రబీర్ పుర్ణాయస్థ నేతృత్వంలో నడుస్తున్న ఈ పోర్టల్‌పై అతస్య ఆరోపణలు చేస్తూ, అక్రమ కేసులతో వేధింపులకు పాల్పడుతున్నారని విమర్శించాయి. మోడీ ప్రభుత్వ నిరంకుశ విధానాలు, మీడియాపై దాడులు, వేధింపులతో ఇప్పటికే మన దేశం ప్రపంచ పత్రికా స్వాతంత్య్రంలో అట్టడుగు స్థాయికి చేరిందని గుర్తుచేశాయి. న్యూస్ క్లిక్‌పై దాడి దేశంలో మీడియా స్వేచ్ఛపైనా, ప్రజల భావప్రకటనా స్వేచ్ఛపైనా దాడిగా పేర్కొన్నాయి. జర్నలిస్టుల నుండి స్వాధీనం చేసుకున్న పరికరాలను తక్షణం వారికి అందజేయాలని, అరెస్టులకు పాల్పడవద్దని డిమాండ్ చేశాయి. ఈ మేరకు ఎన్‌ఎజె అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎ.అమరయ్య, ఎన్.కొండయ్య, ఎపిడబ్లుజెఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్.వెంకట్రావు, జి.ఆంజనేయులు, ఎపిబిజెఎ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి.శ్రీనివాసరావు, కె.మునిరాజు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
ఉపా చట్టం కింద కేసు దారుణం : ఎపి ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వివిఆర్ కృష్ణంరాజు
ఢిల్లీలో న్యూస్ క్లిక్ జర్నలిస్టులపై ఉప చట్టం కింద కేసులు నమోదు చేయటం పాశవిక చర్యని ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వివిఆర్ కృష్ణంరాజు పేర్కొన్నారు. జర్నలిస్టులపై దాడి గర్హనీయమని అన్నారు.
సిఐటియు ఖండన
మోడీ ప్రభుత్వ వినాశకర విధానాలను వ్యతిరేకిస్తున్న వారి గొంతునొక్కేందుకే న్యూస్‌క్లిక్‌పై, జర్నలిస్టులు, ఇతరులపై యుఎపిఎ కింద కేసులు నమోదు చేశారని సిఐటియు విమర్శించింది. ఢిల్లీ పోలీసుల దాడులను తీవ్రంగా ఖండించింది. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారందరినీ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేసింది ఈ మేరకు సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ ఒక ప్రకటన విడుదల చేశారు.