
- యుఎపిఎ, ఆర్థిక నిబంధనలతో జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలను తొక్కిపెడుతున్నారు
- అంతర్జాతీయ మానవ హక్కుల గ్రూపుల ఖండన
న్యూఢిల్లీ : జర్నలిస్టులను, మానవ హక్కుల కార్యకర్తలను, సామాజిక కార్యకర్తలను, ప్రభుత్వాన్ని విమర్శించే వారి నోళ్ళను మూయించేందుకు భారత అధికారులు తీవ్రవాద నిరోధక చట్టాలను, ఆర్థిక నిబంధనలను, ఇతర చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారంటూ అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు తీవ్రంగా విమర్శించాయి. హ్యూమన్ రైట్స్ వాచ్, అమ్నెస్టీ ఇంటర్నేషనల్, మరో 10 అంతర్జాతీయ హక్కుల గ్రూపులు ఈ మేరకు శుక్రవారం సంయుక్తంగా ఒక ప్రకటన జారీ చేశాయి. న్యూస్‌క్లిక్ కార్యాలయాలు, సిబ్బంది నివాసాలపై ఇటీవల దాడులు జరిగిన నేపథ్యంలో వీరి ప్రకటన వెలువడింది. 13ఏళ్ళ నాటి కేసులో రచయిత అరుంధతి రారును ప్రాసిక్యూట్ చేయడానికి ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్ ఇటీవల అనుమతినివ్వడాన్ని కూడా ఆ ప్రకటన ప్రస్తావించింది. న్యూస్‌క్లిక్‌పై జరిగిన దాడులను నిరసిస్తూ జరిగిన నిరసనల్లో అరుంధతి రారు పాల్గొనడమే ఇందుకు కారణమై వుండవచ్చని మానవ హక్కుల గ్రూపులు భావిస్తున్నాయి.
సామాజిక కార్యకర్త తీస్తా సెత్వలాద్‌ను లక్ష్యంగా చేసుకోవడం, బిబిసి ఇండియా కార్యాలయాలపై ఆదాయపన్ను అధికారుల దాడులు, ఢిల్లీ అల్లర్ల కేసులో విద్యార్ధి కార్యకర్తలపై రాజకీయ దురుద్దేశపూరితమైన అభియోగాలు మోపడం, కాశ్మీరీ జర్నలిస్టులు ఫహద్ షా, సజద్ గుల్, కాశ్మీరీ మానవ హక్కుల కార్యకర్త ఖుర్రం పర్వేజ్‌లను అరెస్టు చేసి నిర్బంధించడం, బీమా కొరెగావ్ కేసులో దళితులు, ఆదివాసీలు, బహుజన కార్యకర్తల నిర్బంధాన్ని కొనసాగించడం వంటి చర్యలను ఆ ప్రకటన ప్రముఖంగా ప్రస్తావించింది.
అణచివేత ఉధృతం
''మానవ హక్కులను పరిరక్షించడంలో విఫలమైనందుకు బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించే న్యూస్‌క్లిక్‌పై దాడులు, అరెస్టులు ఈ క్రమంలో స్వతంత్ర జర్నలిస్టులను వేధించేందుకు, వారిని బెదిరించేందుకు అధికారులు చేపట్టిన తాజా ప్రయత్నాలు'' అని ఆ ప్రకటన పేర్కొంది.
రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్, కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్, ఫ్రంట్‌లైన్ డిఫెండర్స్, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్స్, ఇంటర్నేషనల్ సర్వీస్ ఫర్ హ్యూమన్ రైట్స్, ఆసియన్ ఫోరమ్ ఫర్ హ్యూమన్ రైట్స్ అండ్ డెవలప్‌మెంట్ (ఫోరమ్-ఆసియా) తదితర సంస్థలు ఈ ప్రకటనను జారీ చేశాయి. ''2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి, మీడియా, పౌర సమాజంపై అధికారుల దాడులు, అణచివేత చర్యలు ఎక్కువైపోయాయి.'' అని ఆ ప్రకటన పేర్కొంది. ముఖ్యంగా మైనారిటీ గ్రూపులకు చెందిన జర్నలిస్టులు, కార్యకర్తలకు ముప్పు ఎక్కువగా వుందని పేర్కొంది.
రాజకీయ దురుద్దేశ్యంతోమోపిన కేసుల్లో అరెస్టు చేసిన జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు, సమాజిక కార్యకర్తలు, విమర్శకులు అందరినీ తక్షణమే, బేషరతుగా విడుదల చేయాలని మానవ హక్కుల సంస్థలు కోరాయి. వారిపై మోపిన అభియోగాలన్నింటినీ ఉపసంహరించాలని, క్రిమినల్ ప్రాసిక్యూషన్ ద్వారా వారిని బెదిరించడం, వేధించడం, నిరోధించడం ఆపాలని కోరాయి.
యుఎపిఎ దుర్వినియోగం
''బూటకమైన తీవ్రవాదం, ఇతర క్రిమినల్ అభియోగాలపై వారు జర్నలిస్టులను అరెస్టు చేశారు. ఆర్థికపరమైన అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో విమర్శకులను, స్వతంత్ర వార్తా సంస్థలను లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. అలాగే, వారు తీవ్రవాద నిరోధక చట్టాన్ని, జాతీయ భద్రతా చట్టాలను, విదేశీ నిధుల చట్టాలను, ఆదాయపన్ను నిబంధనలను ఉపయోగించి మానవ హక్కుల కార్యకర్తలను, శాంతియుత ఆందోళనకారులను లక్ష్యంగా చేసుకుని, వేధిస్తున్నారు.'' అని ఆ ప్రకటన పేర్కొంది.
యుఎపిఎను ఉపయోగించడం పెరిగినప్పటికీ, కేవలం 2016 నుండి 2019 వరకు ఈ చట్టం కింద నమోదైన కేసుల్లో కేవలం 2.2శాతం కేసుల్లో మాత్రమే నేర నిరూపణ జరిగిందని, 11శాతం కేసులు సాక్ష్యాధారాలు లేక మూతబడ్డాయని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ చేసిన విశ్లేషణను కూడా ఆ ప్రకటన ఉదహరించింది.
''ఈ కేసుల్లో అభియోగాల నమోదులో జాప్యం జరగడం, అనేకమందిని నిర్దోషులుగా విడిచిపెట్టడం చూస్తుంటే తీవ్రవాద నిరోధక చట్టాన్ని ఏళ్ళ తరబడి విమర్శకుల నోళ్ళు మూయించడానికి వాడుతున్నట్లు అర్ధమవుతోంది. మాట్లాడాలనుకునేవారికి ఒళ్లు గగుర్పొడిచేలా సందేశం పంపడానికి, వేధింపులు, శిక్షకు న్యాయ క్రమాన్ని ఒక సాధనంగా వాడేందుకు వాడుతున్నారు.'' అని ఆ ప్రకటన పేర్కొంది. జర్నలిస్టులను, మానవ హక్కుల పరిరక్షకులను, ఇతర విమర్శకులను లక్ష్యంగా చేసుకోవడానికి యుఎపిఎను పదే పదే ఉపయోగించడాన్ని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల నిపుణులు పదే పదే ఖండిస్తున్నారని పేర్కొంది.
''అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాలకు అనుగుణంగా అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టాన్ని ప్రభుత్వం సవరించాలి. ఆ సవరణ జరిగేంతవరకు, విమర్శకులను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రభుత్వం దీన్ని ఉపయోగించుకోవడం ఆపాలి'' అని ఆ గ్రూపులు పేర్కొన్నాయి.