న్యూయార్క్ : గాజా-ఇజ్రాయెల్ భీకర పోరు వేళ ... మానవతా దృక్పథంతో వెంటనే ఇరువర్గాల మధ్య సంధికి ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. ఎలాంటి అవరోధం లేకుండా గాజాకు మానవతా సాయం అందాలని ఆ తీర్మానంలో పేర్కొంటూ ... ఓటింగ్‌ను ఏర్పాటు చేసింది. అయితే ఈ ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. తన అభిప్రాయాన్ని ఐరాసలో భారత్ స్పష్టం చేసింది.
40 దేశాల మద్దతుతో తీర్మానం...
మొత్తం 40 దేశాల మద్దతుతో జోర్డాన్ ఐరాస అత్యవసర ప్రత్యేక సెషన్‌లో ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ' పౌరుల రక్షణ, చట్టపరమైన, మానవతా బాధ్యతలను సమర్థించడం ' పేరుతో తీసుకువచ్చిన ఈ తీర్మానం ఆమోదం పొందింది. 120 దేశాలు ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయగా, 14 దేశాలు వ్యతిరేకించాయి. 45 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, జపాన్, ఉక్రెయిన్, యూకే.. ఓటింగ్‌కు దూరంగా ఉన్న దేశాల జాబితాలో ఉన్నాయి.
తీర్మానంలో ప్రతిపాదన...
జోర్డాన్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానంలో మిలిటెంట్ గ్రూప్ హమాస్ గురించి ఎలాంటి ప్రస్తావన లేకపోవడంతో అమెరికా ఈ తీర్మానాన్ని తీవ్రంగా ఖండించింది. చెడును విస్మరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓటింగ్‌కు ముందు అమెరికా మద్దతుతో కెనడా ఈ తీర్మానానికి సవరణ ప్రతిపాదించింది. ఆ పేరాను తీర్మానంలో చొప్పించాలని కోరింది. ' అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడిని, పౌరులను బందీలుగా చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఎలాంటి షరతులు లేకుండా బందీలను తక్షణమే విడుదల చేయాలి ' అని ఆ సవరణలో పేర్కొంది. ఆ ప్రతిపాదనకు భారత్‌తో సహా 87 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. 55 దేశాలు వ్యతిరేకించగా.. 23 దేశాలు దూరంగా ఉన్నాయి. అయితే ఆ సవరణకు మెజార్టీ రాకపోవడంతో దానిని తీర్మానంలోకి తీసుకోవడం వీలుపడలేదని ఈ మేరకు ఐరాస 78వ సాధారణ అసెంబ్లీ అధ్యక్షుడు డాన్నిస్ ఫ్రాన్సిస్ వెల్లడించారు.
శాంతి చర్చలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించే దిశగా కృషి చేయాలి : భారత్
అక్టోబర్ ఏడవ తేదీన జరిగిన ఉగ్రదాడి దిగ్భ్రాంతి కలిగించిందని ఐరాసలో భారత్ తెలిపింది. దానిని తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేసింది. తమ ఆలోచనంతా బందీలుగా మారిన వారి గురించేననీ.. ఎలాంటి షరతు లేకుండా, తక్షణమే వారిని విడుదల చేయాలని పిలుపునిస్తున్నామని భారత్ తెలిపింది. ఉగ్రవాదం ప్రాణాంతకమైందని... దానికి ఎలాంటి హద్దులు లేవనీ... ఇలాంటి ఉగ్రవాద చర్యలకు ఎలాంటి సమర్థన ఉండకూడదు అని చెప్పింది. విభేదాలు పక్కనపెడదాం అని కోరింది. ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించకూడదు అని పిలుపునిచ్చింది. అలాగే మానవతా సంక్షోభాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందని అంది. ఉద్రిక్తతలు తగ్గించేందుకు అంతర్జాతీయ సమాజం చేస్తోన్న ప్రయత్నాలు, గాజాకు అందిస్తోన్న మానవతా సాయాన్ని స్వాగతిస్తున్నామని భారత్ తెలిపింది. దీనికి భారత్ కూడా తనవంతు సహకారం అందించిందని చెప్పింది. శాంతి చర్చలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించే దిశగా కృషి చేయాలని కోరుతున్నామని... ఈ దిశగా సభ స్పష్టమైన సందేశాన్ని పంపుతుందని ఆశిస్తున్నామని ఐరాసలో భారత్ స్పష్టం చేసింది.